కుందూ నదిలో గల్లంతైన వారికోసం గాలిస్తున్న అధికారులు, గ్రామ యువకులు
సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురిసాయి. అనేకచోట్ల చెరువులకు జలకళ వచ్చింది. పలుచోట్ల గండ్లు పడ్డాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.. పంటలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. అక్కడక్కడ భారీ వృక్షాలు నేలకూలాయి. కర్నూలు జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలోని కుందూ నదిలో ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతయ్యారు. పిడుగుపాట్లకు పలుచోట్ల గేదెలు మృత్యువాతపడ్డాయి.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన ముగ్గురు వ్యవసాయ కూలీలు సోమవారం కుందూ నదిలో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 12మంది కూలీలు రేవుకు అవతలనున్న వరిచేనులో కలుపు తీసి తిరిగొస్తున్న క్రమంలో కుందూ వంతెన వద్ద నదిని దాటుతుండగా అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి తొమ్మిది మందిని ఒడ్డుకు చేర్చారు. ముగ్గురు గల్లంతయ్యారు. జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి, జేసీ ప్రసన్న వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసాయి. సరాసరిన 21.8మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోనూ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాన.. సోమవారం ఉదయం వరకూ ఏకధాటిగా కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. జిల్లా వ్యాప్తంగా 34.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
విజయవాడలో కుండపోత..
కుండపోత వర్షానికి నగరం జలమయం అయింది. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నగరంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు, శివారు ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమయ్యారు.