Hailstrom
-
Shamshabad Airport: ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి?
సాక్షి, హైదరాబాద్: ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొన్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొనడంతో కొంత దెబ్బతిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. సదరు ఎయిర్‌లైన్స్ అధికారులు, విమానాశ్రయ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. కాగా.. మరో ఘటనలో.. ఈ నెల 18న ఉదయం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానానికి వడగళ్ల వానతో ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పైలెట్లకు ముందు ఉన్న అద్దంతో పాటు వెనకాల కొంత పలుచోట్ల విమానం దెబ్బతిన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.. -
Hyderabad: ఎండల్లో వానలు.. ఏందిరా ఈ బాధలు!
సాక్షి, హైదరాబాద్: మార్చి నెలలో అకాల వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి. వేసవిలో ఊహించని విధంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపోతున్నాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవున్నారు. శివారు ప్రాంతాల్లో వడగళ్లు పడటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటల అపార నష్టం వాటిల్లుతోంది. అల్పపీడంతో ఏర్పడిన ద్రోణి ఆదివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు.. ఉత్తర అంతర్గత కర్ణాటక మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుండటంతో ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు రోజులు నుంచి వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ద్రోణుల ప్రభావంతో వేసవిలో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్చి నెలలో సాధారణ వర్షపాతం కంటే పదింతలు అధికంగా నమోదు కావడం గమనార్హం. -
మరో 4 రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలుంటాయని, క్యుములోనింబస్ మేఘాల కారణంగా సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌లో 2 సెంటీమీటర్లు, చిన్నచింతకుంట, మార్పల్లెలో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో 2.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. జనం కాస్త సేదతీరుతున్నారు. హన్మకొండలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత హన్మకొండ 42.3 రామగుండం 40.4 భద్రాచలం 40.0 నిజామాబాద్ 39.4 ఆదిలాబాద్ 38.8 మెదక్ 38.4 మహబూబ్‌నగర్ 38.3 ఖమ్మం 38.2 నల్లగొండ 37.4 హైదరాబాద్ 37.3 -
అన్నదాతకు కడగండ్లు
► వడగండ్ల వానతో కుదేలైన రైతన్న ► మామిడి, టమాట రైతులకు భారీ నష్టం ► ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వడగండ్ల వాన రైతులకు కన్నీటిని మిగులుస్తోంది. వాయువేగంతో వీచిన పెనుగాలులకు వడగండ్ల వాన తోడవడంతో మామిడి, టమాట పంట రాలిపోతుంది. అరకొరగా పండిన మామిడికాయలు నేలరాలిపోగా, భారీ వృక్షాలు సైతం కూలిపోతున్నాయి. ఇప్పటికి దాదాపు 700 హెక్టార్లకు పైగా మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దీనికితోడు బొప్పాయి, అరటి, టమాట, పొద్దుతిరుగుడు, వరి పంటలకు సైతం కొన్ని మండలాల్లో నష్టం వాటిల్లింది. జిల్లా మొత్తం మీద రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. జిల్లాలో 1లక్ష హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి 75 వేల హెక్టార్లలో మామిడి తోటలు కాపునకు వచ్చాయి. మిగతావి వివిధ దశలో ఉన్నాయి. గత ఏడాది ఎకరాకు సరాసరి దిగుబడి 9 నుంచి 10 టన్నులు రాగా, ఈ ఏడాది కేవలం 8 టన్నులు లోపు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే తవణంపల్లె, బంగారుపాళ్యెం, పాకాల, వీకోట, మదనపల్లి, దామలచెరువు, పూతలపట్టు, కుప్పం ,శాంతిపురం మండలాల్లో 20 వేల ఎకరాల్లో కాపు దశలో ఉన్న మామిడి చెట్లు ఎండుదశకు చేరుకున్నాయి. మిగతా చోట్ల అరకొర కాసిన ఈ మామిడి కాయలు సైతం అకాల వర్షం, వడగండ్ల వానకు నేలపాలవుతున్నాయి. రొంపిచెర్ల, యర్రావారిపాళెం, పుంగనూరు, గంగవరం, పెద్దపంజాణి, వీకోట, ములకలచెరువు, రామసముద్రంలలో గత వారంలో కురిసిన వడగండ్ల వానకు 500 హెక్టార్లకు పైగా మామిడి పంట దెబ్బతింది. ఈనెల 23వ తేదీ కురిసిన వర్షానికి పెనుమూరులో 80 హెక్టార్లు, పుత్తూరు 18 హెక్టార్లు, వడమాలపేటలో 280 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొంత వరకు ఉపయోగమే: ఇటీవల కురిసిన వర్షాలు ఎండిపోయే దశలో ఉన్న 20 వేల ఎకరాల మామిడితోటలకు కొంత మేర ఉపయోగమే. ఇప్పటికి జిల్లాలో పలు మండలాల్లో వడగండ్ల వాన వల్ల మామిడి, టమోటా పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది. మామిడి పిందెల దశలో వర్షం కురియడంతో కాయ బాగా వృద్ధి చెంది అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది. - ధర్మజ, ఉద్యానవన ఉపసంచాలకులు, చిత్తూరు. -
గాలివాన బీభత్సం
కొత్తగూడెం, న్యూస్‌లైన్: జిల్లాలో వడగండ్ల వాన, గాలి దుమారం బీభత్సం సృష్టించాయి. బుధవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గాలితో కూడిన వడగండ్లవాన కురిసింది. బలమైన ఈదురు గాలులు రావడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో పలు గ్రామాలు అంధకారంగా మారాయి. ఏజెన్సీ ప్రాంతంలో గాలి దుమారం ప్రభావం అధికంగా ఉంది. జిల్లాలో సుమారు 600 ఎకరాల్లో కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేలరాలగా, పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు తడిసి ముద్దయ్యాయి. దీంతో ఆయా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం నియోజకవర్గాల్లో గాలిదుమారం ప్రభావం అధికంగా ఉండగా వైరా, మధిర, ఖమ్మం, పినపాక నియోజకవర్గాల్లో చిరుజల్లులు కురిశాయి. పిడుగుపాటుకు ఒకరికి గాయాలు... కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీ ఎదురుగడ్డలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన కాటం మీన అనే బాలిక చేతికి గాయమైంది. పిడుగు ప్రభావం విద్యుత్ తీగెలపైనా పడడంతో పలు ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, విద్యుత్ గృహోపకరణాలు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. దమ్మపేట మండలం పాతర్లగూడెంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మూడు గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. అశ్వారావుపేట మండలం గుమ్మడివెల్లిలో విద్యుత్ లైన్ తెగిపోయి సరఫరాకు అంతరాయం వాటిల్లింది. చండ్రుగొండ మండలంలో కరెంటు తీగెలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తల్లాడ మండలంలో గాలిదుమారం కారణంగా విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరాకు అంతరాయం వాటిల్లింది. భారీ వృక్షాలు ప్రధాన రహదారులపై అడ్డంగా పడ్డాయి. భద్రాచలం నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లోనూ విద్యుత్ వైర్లు తెగి సరఫరా నిలిచిపోయింది. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో గాలిదుమారం కారణంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. టేకులపల్లి మండలంలో గాలిదుమారాలకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 600 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం... మామిడితోటలు అధికంగా ఉండే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గాలిదుమారం ప్రభావంతో సుమారు 600 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు కల్లాల్లో ఆరబోసిన మిర్చి కూడా తడిసిపోయింది. సమయానికి పరదాలు, టార్బాలిన్లు దొరకక మిరపకాయలను కాపాడుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
లెక్క తేలింది
సాక్షి, సంగారెడ్డి: అకాల నష్టంపై లెక్కలు తేలాయి. ఫిబ్రవరి 27-మార్చి 9 మధ్య కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జిల్లాలో 3697.7 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. నష్టపోయిన రైతులను ఆదుకోడానికి రూ.3.35 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రెండు వారాల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో జిల్లాలోని 19 మండలాల పరిధిలో 2021.7 హెక్టార్లలో వ్యవసాయ పంటలు ధ్వంసం కావడంతో 4,819 మంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు పెట్టుబడి రాయితీ కింద రూ. 1.35 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నో వర్రీ ..? వడగండ్ల వానల వల్ల జిల్లాలో 919 హెక్టార్ల వరి చేళ్లు దెబ్బుతిన్నట్లు అప్పట్లో జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా నివేదికలో పేర్కొంది. తుది అంచనాల్లో మాత్రం 3.48 హెక్టార్లలోనే చూపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల ధాటికి నేలకొరిగిన పంటలు ఆ తర్వాత క్రమంగా కోలుకుంటాయి. అయితే, దెబ్బతిన్న మొత్తం పంటలు కోలుకున్నట్లు తుది నివేదికలో చూపడమే అనుమానాలకు తావిస్తోంది. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం అకాల వర్షాలకు ఉద్యాన రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 1676.95 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానవన శాఖ లెక్క గట్టింది. దీంతో 2023 మంది రైతులు నష్టపోవడంతో పెట్టుబడి రాయితీ కింద రూ.1.98 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఉద్యాన శాఖ తుది అంచనా నివేదిక ప్రకారం.. చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, ములుగు, సిద్దిపేట, తొగుట, వెల్దుర్తి, జహీరాబాద్, కోహీర్ మండలాల పరిధిలో 1193.85 హెక్టార్లలో కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. గజ్వేల్, తూప్రాన్, కల్హేర్, మెదక్, ములుగు, వెల్దుర్తి, జహీరాబాద్, కోహీర్ మండలాల పరిధిలో 396.04 హెక్టార్లలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. అదే విధంగా 75.86 హెక్టార్లలో అరటి, 2.6 హెక్టార్లలో బొప్పాయి, 2.80 హెక్టార్లలో ద్రాక్ష, 5.40 హెక్టార్లలో బంతి, 0.40 హెక్టార్లలో చామంతి తోటలు దెబ్బతిన్నాయి. -
వాతావరణంలో అనిశ్చితి వల్లే వడగళ్ల వర్షం
సాక్షి, విశాఖపట్నం: మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడు ఒకేసారి భూమికి దగ్గరగా రావడం వల్ల వాతావరణంలో అనిశ్చితి పెరిగి వడగళ్ల వర్షం కురుస్తోందని విశాఖలోని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ‘భూమ్మీద ఉన్న తేమ ఎక్కువగా ఆకాశంలోకి వెళ్లటం వల్ల ఎక్కువ ప్రభావం చూపే మేఘాలు ఏర్పడతాయి. దీనినే క్యూములోనింబస్ అంటారు. వేడి ప్రాంతాలు, అరణ్యాలు, కొండలు విస్తరించిన చోట్ల ఇవి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల తేమ ఎక్కువై భూమి నుంచి ఆకాశానికి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు మేఘాలు ఏర్పడుతున్నాయి. సాధారణ వర్షాల సమయంలో మే ఘాలు భూమి నుంచి అయిదు కిలోమీటర్ల వరకే విస్తరిస్తే, ఈ మేఘాలు అంతకుమించి దూరం ప్రయాణిస్తాయి. ఇవి ఎత్తుకు వెళ్లేకొద్దీ పైనున్న వాతావరణం మైనస్ డిగ్రీలకు చేరుకుని వడగళ్లుగా మారతాయి. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు ఇవే కారణమ’ని విశాఖ వాతావరణ నిపుణులు భానుప్రకాశ్ విశ్లేషించారు. క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడ్డానికి గంట పడుతుంది. ఇవి చినుకులు రూపంలో పడ్డానికి మరో గంట పడుతుంది. కాని ఈ ప్రక్రియ వేగంగా జరగడంతో వడగళ్లు పడుతున్నాయని విశాఖలోని విశ్రాంత వాతావరణ నిపుణులు అచ్యుతరావు విశ్లేషించారు. -
అకాల వర్షం.. భారీగా పంట నష్టం
మెదక్ టౌన్, న్యూస్‌లైన్: మెదక్‌లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారా యి. ప్రధాన కూడలి అయిన రాందాస్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా, ఆటో నగర్, పోస్టాఫీస్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డుపై మోకాలు లోతు నీరు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. ఫుట్‌పాత్ వ్యాపారులు నానా అవస్థలు పడ్డారు. పలు కోచింగ్‌లకు వెళ్లే విద్యార్థులు తడుస్తూ వెళ్లారు. వాటర్ ట్యాంక్ పై కూలిన చెట్టు మెదక్ రూరల్: మండల పరిధిలోని పలుగ్రామాలలో ఆదివారం భారీ వర్షం కురవగా.. మరికొన్ని గ్రామాల్లో వడగండ్ల వర్షం పడింది. మండల పరిధిలోని శమ్నాపూర్, హవేళిఘణపూర్, మక్తభూపతిపూర్, చౌట్లపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం పడగా చాలా గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో చౌట్లపల్లిలో గ్రామంలో వాటర్ ట్యాంక్‌పై ఓ చెట్టు కూలిపోగా నల్లా పైపులు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా మరికొన్ని గ్రామాల్లో రాళ్ల వర్షానికి మామిడి పూత, పిందెలు నేలరాలాయి. దీంతో మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలులు, వడగండ్ల వర్షం రామాయంపేట: మండలంలోని ఆదివారం ఈదురు గాలులు, వడగండ్ల వాన కారణంగా సుమారు 30 ఎకరాల్లో సాగు చేసిన వివిధ పంటలు చేతికి అందకుండా పోయాయి. దంతేపల్లి తీన్ నంబర్ సేవాదాస్ తండా రైతు పాత్లోత్ శంకర్ మూడెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, రెండెకరాల్లో సాగు చేసిన ఆముదం, అర ఎకరం ఉల్లి పంటలు నేలకొరిగాయి. అదేవిధంగా సభావత్ వేవీ సింగ్ సాగు చేసిన అర ఎకరం మొక్కజొన్న, సభావత్ భిక్షపతికి చెందిన అర ఎకరం మిరప పంట, రెండెకరాల మొక్కజొన్న, రైతు మెగావత్ రవి ఎకరంలో సాగు చేసిన మొక్కజొన్న పంట తుడిచిపెట్టుకుపోయాయి. మరో రైతు సభావత్ కమ్లియా అర ఎకరంలో సాగు చేసిన మొక్కజొన్న, పాత్లోత్ చాస్లీ అరెకరంలో సాగు చేసిన మొక్కజొన్న, సభావత్ అమ్రియాకు చెందిన రెండెకరాల మొక్కజొన్న, సభావత్ బానీకి చెందిన ఎకరం మొక్కజొన్న పంటలు వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంటలు పూర్తిగా నేల కొరిగాయి. అదేవిధంగా ఈదురు గాలులు, వడగండ్ల వానతో విద్యుత్ వైర్లు, స్తంభాలు నేలకొరిగినట్లు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండలంలో వర్ష బీభ త్సం చిన్నకోడూరు: అకాల వర్షానికి మండలంలో మిర్చి, ఉల్లిగడ్డ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలకు చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్, గంగాపూర్, రంగాయపల్లి తదితర గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో మిర్చి, ఉల్లిగడ్డ, బీర్నీసు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు నష్టం వాటిల్లింది. కొందరు రైతులు తడిసిన పంటను కాపాడుకోవడాని కి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. పాపన్నపేటలో వడగళ్ల వర్షం పాపన్నపేట : మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. మండలం అంతటా ఓ మోస్తరు వర్షం పడింది. రెండు రోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలతో మామిడి పిందెలు రాలిపోయాయి. ఏడుపాయల జాతరలో భక్తులు నానా అవస్థలు పడ్డారు. కాగా ఈ వర్షంతో వరి పంటకు రోగాలు పోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సన్నగా కురిసిన వడగళ్లతో కొంతమేర మొక్కజొన్న, ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది.