అన్నదాతకు కడగండ్లు
► వడగండ్ల వానతో కుదేలైన రైతన్న
► మామిడి, టమాట రైతులకు భారీ నష్టం
► ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వడగండ్ల వాన రైతులకు కన్నీటిని మిగులుస్తోంది. వాయువేగంతో వీచిన పెనుగాలులకు వడగండ్ల వాన తోడవడంతో మామిడి, టమాట పంట రాలిపోతుంది. అరకొరగా పండిన మామిడికాయలు నేలరాలిపోగా, భారీ వృక్షాలు సైతం కూలిపోతున్నాయి. ఇప్పటికి దాదాపు 700 హెక్టార్లకు పైగా మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దీనికితోడు బొప్పాయి, అరటి, టమాట, పొద్దుతిరుగుడు, వరి పంటలకు సైతం కొన్ని మండలాల్లో నష్టం వాటిల్లింది. జిల్లా మొత్తం మీద రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.
జిల్లాలో 1లక్ష హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి 75 వేల హెక్టార్లలో మామిడి తోటలు కాపునకు వచ్చాయి. మిగతావి వివిధ దశలో ఉన్నాయి. గత ఏడాది ఎకరాకు సరాసరి దిగుబడి 9 నుంచి 10 టన్నులు రాగా, ఈ ఏడాది కేవలం 8 టన్నులు లోపు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే తవణంపల్లె, బంగారుపాళ్యెం, పాకాల, వీకోట, మదనపల్లి, దామలచెరువు, పూతలపట్టు, కుప్పం ,శాంతిపురం మండలాల్లో 20 వేల ఎకరాల్లో కాపు దశలో ఉన్న మామిడి చెట్లు ఎండుదశకు చేరుకున్నాయి.
మిగతా చోట్ల అరకొర కాసిన ఈ మామిడి కాయలు సైతం అకాల వర్షం, వడగండ్ల వానకు నేలపాలవుతున్నాయి. రొంపిచెర్ల, యర్రావారిపాళెం, పుంగనూరు, గంగవరం, పెద్దపంజాణి, వీకోట, ములకలచెరువు, రామసముద్రంలలో గత వారంలో కురిసిన వడగండ్ల వానకు 500 హెక్టార్లకు పైగా మామిడి పంట దెబ్బతింది. ఈనెల 23వ తేదీ కురిసిన వర్షానికి పెనుమూరులో 80 హెక్టార్లు, పుత్తూరు 18 హెక్టార్లు, వడమాలపేటలో 280 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
కొంత వరకు ఉపయోగమే:
ఇటీవల కురిసిన వర్షాలు ఎండిపోయే దశలో ఉన్న 20 వేల ఎకరాల మామిడితోటలకు కొంత మేర ఉపయోగమే. ఇప్పటికి జిల్లాలో పలు మండలాల్లో వడగండ్ల వాన వల్ల మామిడి, టమోటా పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది. మామిడి పిందెల దశలో వర్షం కురియడంతో కాయ బాగా వృద్ధి చెంది అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది. - ధర్మజ, ఉద్యానవన ఉపసంచాలకులు, చిత్తూరు.