లెక్క తేలింది | Untimely rains calculations were finalized | Sakshi
Sakshi News home page

లెక్క తేలింది

Published Wed, Mar 19 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

Untimely rains calculations were finalized

సాక్షి, సంగారెడ్డి: అకాల నష్టంపై లెక్కలు తేలాయి. ఫిబ్రవరి 27-మార్చి 9 మధ్య కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జిల్లాలో 3697.7 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. నష్టపోయిన రైతులను ఆదుకోడానికి రూ.3.35 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.  రెండు వారాల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో జిల్లాలోని 19 మండలాల పరిధిలో 2021.7 హెక్టార్లలో వ్యవసాయ పంటలు ధ్వంసం కావడంతో  4,819 మంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు పెట్టుబడి రాయితీ కింద రూ. 1.35 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.

 నో వర్రీ ..?
 వడగండ్ల వానల వల్ల జిల్లాలో 919 హెక్టార్ల వరి చేళ్లు దెబ్బుతిన్నట్లు అప్పట్లో జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా నివేదికలో పేర్కొంది.  తుది అంచనాల్లో మాత్రం 3.48 హెక్టార్లలోనే చూపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల ధాటికి నేలకొరిగిన పంటలు ఆ తర్వాత క్రమంగా కోలుకుంటాయి. అయితే, దెబ్బతిన్న మొత్తం పంటలు కోలుకున్నట్లు తుది నివేదికలో చూపడమే అనుమానాలకు తావిస్తోంది.

 ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం
 అకాల వర్షాలకు ఉద్యాన రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 1676.95 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానవన శాఖ లెక్క గట్టింది. దీంతో 2023 మంది రైతులు నష్టపోవడంతో పెట్టుబడి రాయితీ కింద రూ.1.98 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఉద్యాన శాఖ తుది అంచనా నివేదిక ప్రకారం.. చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, ములుగు, సిద్దిపేట, తొగుట, వెల్దుర్తి, జహీరాబాద్, కోహీర్ మండలాల పరిధిలో 1193.85 హెక్టార్లలో కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. గజ్వేల్, తూప్రాన్, కల్హేర్, మెదక్, ములుగు, వెల్దుర్తి, జహీరాబాద్, కోహీర్ మండలాల పరిధిలో 396.04 హెక్టార్లలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. అదే విధంగా 75.86 హెక్టార్లలో అరటి, 2.6 హెక్టార్లలో బొప్పాయి,  2.80 హెక్టార్లలో ద్రాక్ష, 5.40 హెక్టార్లలో బంతి, 0.40 హెక్టార్లలో చామంతి తోటలు దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement