రెక్కల కష్టం నీటిపాలు | farmers got heavy loss due to untimely rains | Sakshi
Sakshi News home page

రెక్కల కష్టం నీటిపాలు

Published Wed, Mar 5 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

farmers got  heavy loss due to untimely rains

సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలు అన్నదాతల వెన్నువిరిచాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా జిల్లాలో 3,292 హెక్టార్లలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు రూ.10.57 కోట్ల నష్టం వాటిల్లింది. గత నెల 27 నుంచి ఈనెల 5 వరకు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.  మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, గోధుమ, జొన్న, మినుము పం టలతోపాటు పండ్లు, కూరగాయల తోటలు నీట ముంచాయి. ఈ వర్షాల వల్ల 1,941 హెక్టార్లలో వ్యవసాయ పంటలతోపాటు 1,350 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖలు తేల్చాయి.

కాగా 44,573 క్వింటాళ్ల దిగుడులకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక నివేదికను పంపించాయి. వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న గృహాల సంఖ్య 369కు పెరిగింది. అందులో 10 పూర్తిగా, ఐదు తీవ్రంగా, 354 పాక్షికంగా దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వ్యవసాయం, పశు సంపదకు జరిగిన నష్టంపై  కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరుపుతున్నారు.

 కూరగాయల రైతు  విలవిల
 అకాల వర్షాల వల్ల 1,350 హెక్టార్లలో కూరగాయల తోటలతోపాటు మామిడి, అరటి, బొప్పాయి, బత్తా యి, ద్రాక్ష తోటలకు నష్టం వాటిల్లింది. పం టలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి రూ.4.60కోట్ల పెట్టుబడి రాయితీ కోసం ఉద్యాన శాఖ ప్రభుత్వానికి నివేదించింది. 965.20 హెక్టార్లలో కూరగాయల తోటలు ధ్వంసం కావడంతో రైతులకు రూ.1.91 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పం పారు. వంద హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.24లక్షలు, 20 హెక్టార్లలో బొప్పాయి తోటలకు గాను రూ.2 లక్షలు, 20 హెక్టార్లలో ద్రాక్ష తోటలకు గాను రూ.1.8 లక్షలు, 4హెక్టార్లలో బత్తాయి తోటలకు గాను రూ.60 వేల ఇన్‌పుట్ సబ్సిడీ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా వడగళ్ల వాన వల్ల జిల్లాలో 32 మేకలు, 22 గొర్రెలు, ఓ గేదె మృత్యువాత పడ్డాయి. దీంతో పెంపకందారులకు రూ.1.40 లక్షల నష్టం వాటిల్లిందని పశు సంవర్థక శాఖ తేల్చింది.

 సగటు వర్షపాతం 11.5 మి.మీటర్లు
 జిల్లాలో మంగళవారం 11.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా నర్సాపూర్‌లో గరిష్టంగా 42.2 మిల్లీమీటర్లు, దౌల్తాదాలో 38 మి.మీటర్లు, కోహీర్‌లో 35మి.మీ., చిన్నశంకరంపేటలో 33మి.మీ., కొండపాకలో 30 మి.మీటర్ల వర్షం కురిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement