జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై హైకోర్టు అగ్రహం
అక్రమ నిర్మాణాలు జరుగుతోంటే ఏం చేస్తున్నారు?
ప్రజలు ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే ఎలా?
మీపై ప్రజలకు కనీస విశ్వాసం లేకుండాపోతోంది
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పలు సూచనలు చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఆదేశిస్తే తప్ప అధికారులు పని చేయడం లేదని, మీ విధులు కూడా న్యాయస్థానాలే నిర్వహించాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేసింది. అధికారుల వద్దకు వచ్చే ప్రజల ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో వారు విధిలేక కోర్టులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది.
కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడంలోనూ అదే నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడింది. ఈ ఒక్క కోర్టు(15వ కోర్టు)లోనే ధిక్కరణ కేసులు 110 ఉన్నాయని చెప్పింది. కోర్టుల ఆదేశాలు, రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు చదువుతూ.. ఆ మేరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెడుతూ వారికి తగిన సూచనలు అందించాలని కమిషనర్‌ను ఆదేశించింది.
హైదరాబాద్ టోలిచౌకిలోని కాశీష్ దుకాణం ముందు అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తమ ముందు హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను పలు ప్రశ్నలు అడగడంతోపాటు అక్రమ నిర్మాణాలపై అనుసరించాల్సిన విధానంపై సూచనలు చేశారు.
ఆస్తి పన్ను వసూలుకే పరిమితమా?
‘కేవలం ఆస్తి పన్ను వసూలుకే జీహెచ్‌ఎంసీ అధికారులు ఉన్నారనే భావన ప్రజల్లో రానివ్వొద్దు. రోజురోజుకు మీపై వారిలో విశ్వాసం లేకుండాపోతోంది. కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. చాలాచోట్ల స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత విధానాన్ని పాటించకుండా నిద్రపోతున్నారు.
సీజ్ చేసినా చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూల్చివేత అంటూ రెండు రంధ్రాలు చేస్తే సరిపోతుందా? దానికి ఓ నిర్దిష్ట ప్రక్రియను అనుసరించకుంటే ఎలా? మీరు పెట్టిన రంధ్రాలను పూడ్చివేసి మళ్లీ నివాసం ఉంటున్నారు. అలా అని బుల్డోజర్ సిద్ధాంతాన్ని సమర్థించం. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా అర్ధరాత్రి పూటనో లేదా వేకువజామున నాలుగు గంటలకో నిర్మాణం చేస్తున్నారు.
నేను నివాసం ఉంటున్న కుందన్‌బాగ్ ప్రాంతంలో కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? విద్యా సంవత్సరం కొనసాగుతున్నందున ఒక్క విద్యా సంస్థలకు తప్ప ఇతర అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం అధికారులు చర్యలు చేపట్టవచ్చు’అని పేర్కొన్నారు.
సివిల్ కోర్టుల నోటీసులపై స్పందనేది?
‘సివిల్ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లలో నోటీసులు జారీ చేసినప్పుడు స్పందించకుంటే ఎలా? కొన్నిసార్లు స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా హాజరుకావడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సివిల్ కోర్టు ఎక్స్‌పార్టీ అని పేర్కొంటూ, ఇతర పార్టీ లకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాల్సివస్తోంది. మీ నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణదారులు లబ్దిపొందుతున్నారు.
కొందరు అధికారులు, కౌన్సిల్స్ చట్టం, సెక్షన్లు తెలియకుండా కౌంటర్లు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి స్పందన లేక కోర్టులకు వస్తున్న కేసులు 70 నుంచి 80 శాతమున్నాయి. మీరే అన్ని నిర్ణయాలు తీసుకోలేరు. ఆ మేరకు చట్టంలో మార్పులు చేసేలా ప్రిన్సిపల్ సెక్రెటరీని కోరండి. సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు.. అంతా కూర్చొని మాట్లాడండి.
అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలో ప్రణాళిక రూపొందించుకోండి. అలాగే వివాదాస్పదమైన టోలీచౌకి నిర్మాణంపై జనవరి 22లోగా నివేదిక ఇవ్వండి’అని కమిషనర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, రాజీ కుదిరిందని పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. అక్రమ నిర్మాణంపై రాజీనా అని ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment