సైబర్ బృందాన్ని అభినందిస్తున్న సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఫేస్‌బుక్ ద్వారా తప్పుడు పనులు చేస్తున్నారా..? ‘గుర్తించలేరు.. పట్టుకోలేరు..’ అనుకుంటున్నారా..? సైబర్ ల్యాబ్ టీం.. మీపై ఓ కన్నేసి ఉంచింది...! ఏ క్షణాన్నయినా మీ ‘ఫేస్’ను ‘బుక్’ చేస్తుంది..!! నమ్మలేకపోతున్నారా..? అసాధ్యమనుకుంటున్నారా...? అయితే, మీరు తప్పకుండా ఇది చదవాల్సిందే...
ఖమ్మంక్రైం: ఫేస్‌బుక్ నకిలీ అకౌంట్లతో అమ్మాయిలను మోసగిస్తున్న ఇద్దరిని ఖమ్మం సైబర్ ల్యాబ్ బృందం ‘బుక్’ చేసింది. ఈ సైబర్ ల్యాబ్ బృందాన్ని పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీర్ ఇక్బా ల్ అభినందించారు. నగరంలో గురువారం విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాలు...
ప్రేమ.. పెళ్లి.. ప్రమాదం.. లక్షలు.. స్వాహా
ఖమ్మం నగరానికి చెందిన కృష్ణ (అసలు పేరు కాదు) ఫేస్‌బుక్ అకంట్‌ను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ జులాయి హ్యాక్ చేశాడు. అందులోగల కృష్ణ, ఫోటోలు, వివరాలతో నకిలీ ఖాతా తెరిచాడు. తాను డాక్టర్‌నని పరిచయం చేసుకుంటూ ఎన్‌ఆర్‌ఐలు, డాక్టర్లయిన యువతులతో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్ వాయిస్ కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ ద్వారా వారికి దగ్గరయ్యాడు. ప్రేమ.. పెళ్లి పేరుతో వల విసిరాడు.
పెళ్లి వరకు తీసుకొచ్చాడు. అప్పుడు, తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందనో.. రోడ్డు ప్రమాదం జరిగిందనో అబద్ధాలు చెప్పేవాడు. అత్యవసర చికిత్స కోసం డబ్బు కావాలనేవాడు. ఇదంతా నిజమేనని అవతలి వారు నమ్మేవారు. ‘‘నువ్వు నా కాబోయే భార్యవే కదా..! నీ డబ్బొకటి.. నా డబ్బొకటా..?!’’ అనేవాడు. అవతలి వారు పూర్తిగా పడిపోయి, అతడి అకౌంట్‌లో డబ్బులు వేసేవారు. ఇలా కొందరిని నుంచి లక్షల రూపాయలు గుంజాడు.
తన అకౌంట్ హ్యాక్ చేశారన్న విషయం ఖమ్మంలోని కృష్ణకు తెలియలేదు. దీనిని, విదేశాలలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అతడి మిత్రురాలైన ఓ యువతి ముందుగా గమనించింది. వెంటనే కృష్ణను అప్రమత్తం చేసింది. అతడు నేరుగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశాడు. కమిషనర్ ఆదేశాలతో కేసు నమోదైంది. ఖమ్మం సైబర్ ల్యాబ్ బృందం రంగంలోకి దిగింది. నిందితుడు కేవలం ఫేస్‌బుక్ లో చాటింగ్ చేస్తున్నాడు. వీడియో కాల్ మాట్లాడేవాడు కాదు. అయినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ మోసగాడిది ఆదిలాబాద్ జిల్లాగా సైబర్ ల్యాబ్ బృందం కనిపెట్టింది.
ఖాతా హ్యాక్.. ఫొటోల తస్కరణ...
ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతి ఫేస్‌బుక్ ఖాతాను ఒకడు హ్యాక్ చేశాడు. ఆమె పేరుతో అసభ్యకరమైన ఫొటోలను అందులో నుంచి అందరికీ పంపుతున్నాడు. ఒకసారి ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో ఈ ఫోటోలను ఆమె సోదరుడు చూశాడు. ఆమెను నిలదీశాడు. తనకు ఏ పాపం తెలియదని, ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని ఆమె నెత్తీనోరు బాదుకుంది. తన సోదరుడితో కలిసి పోలీసులను ఆమె ఆశ్రయించింది. కేసు నమోదైంది. ఖమ్మం సైబర్ ల్యాబ్ కేంద్రం రంగంలోకి దిగింది. ఆ మోసగాడిని, ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నట్టుగా కనుగొంది.
మోసగాడి గుర్తింపు
కారేపల్లికి చెందిన వాడి పేరు నవీన్ కుమార్. అదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమపేరుతో నమ్మించాడు. ఆమెను తీసుకుని ఎటో వెళ్లిపోయా డు. తన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆ బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సైబర్ ల్యాబ్ బృందం రంగంలోకి దిగింది. ‘సోషల్ మీడియా అనాలిసిస్ టూల్స్’ ద్వారా వారిద్దరూ తిరువూరు వద్ద ఉన్నట్టుగా కనిపెట్టారు. అతడిని వెంటనే అరెస్ట్ చేశారు.
ఇప్పటికి 43 కేసులు కొలిక్కి..
జిల్లాలోని సైబర్ ల్యాబ్ బృందం గణనీయ ఫలితాలు సాధిస్తోంది. ఇది ఇప్పటివరకు 43 కేసులను ఛేదించింది. ఈ సైబర్ ల్యాబ్ బృందం ఎస్‌ఐ చంద్రమోహన్, సిబ్బంది శ్రీనివాస్, సురేష్, ప్రసాద్, వైవి.కృష్ణారావు, రాధాకృష్ణను పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీల్ ఇక్బాల్ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దిగితే... సోషల్ అనాలసిస్ టూల్స్ ద్వారా మొత్తం సమాచారం మాకు కొన్ని క్షణాల్లోనే తెలిసిపోతుంది, కాబట్టి.. అనవసరమైన విషయాలు, సంఘ వ్యతిరేకమైన పోస్టింగులతో ఇబ్బందులుపాలు కావద్దు’’ అని సీపీ హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment