‘ల్యాప్స్ పాలసీ’ల ఆధారంగా లూటీ
* బీమా మొత్తం ఇప్పిస్తామంటూ మోసాలు
* ఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన గ్యాంగ్
* పది మందిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్
* రూ.7.3 లక్షలు స్వాధీనం. రూ.1.5 కోట్ల ఫ్రీజ్
సాక్షి, హైదరాబాద్: ల్యాప్స్ అయిన ఇన్సూరెన్స్ పాలసీ డేటానే ఆధారం... ఢిల్లీలోని మీట్‌నగర్‌లోని కాల్‌సెంటర్ కేంద్రం... ఆరుగురు సూత్రధారులు... సీన్ కట్ చేస్తే దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు కోల్పోయిన బాధితులు... ఈ ఘరానా గ్యాంగ్ గుట్టును రట్టు చేసిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు పది మంది నిందితుల్ని అరెస్టు చేశారు.
వీరి నుంచి రూ.7.3 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, వివిధ బ్యాంక్ ఖాతాల్లోని ఉన్న రూ.1.54 కోట్లు ఫ్రీజ్ చేశామని సంయుక్త పోలీసు కమిషనర్ టి.ప్రభాకరరావు వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్‌ఎంకే ఇస్మాయిల్‌తో కలసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సేల్స్ ప్రమోషన్‌తో షురూ: ఢిల్లీలోని మీట్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు సూత్రధారులు రెండు నెలల క్రితం ఎమరిక్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యునిక్ యాంబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఖాతాదారులను వెతికే సేల్స్ ప్రమోషన్ ఈ కాల్‌సెంటర్ల ఉద్దేశం.
ఇందుకు 200 మంది టెలీకాలర్స్‌ను నియమించారు. ఈ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో మోసాలకు తెరలేపారు. గతంలో వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేసి, వాటి కస్టమర్స్ డేటాను సంపాదించగలిగే ఏడుగుర్ని పాత్రధారులుగా చేశారు. వీరి ద్వారా ఆయా కంపెనీల్లో ‘ల్యాప్స్ పాలసీదారుల’ వివరాలు సేకరించారు.
వివిధ ‘పేర్ల’తో టోకరా...
ఈ డేటాబేస్ ఆధారంగా టెలీకాలర్స్ ల్యాప్స్ అయిన పాలసీ వివరాలు చెప్తూ ఖాతాదారులకు ఫోన్ చేసి నమ్మకం కలిగిస్తారు. బీమా మెచ్యూరిటీ మొత్తాన్ని ఇప్పిస్తామంటూ వల వేస్తారు. ఆకర్షితులైన వారికి దాని నిమిత్తం తమ సంస్థల్లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని షరతు విధిస్తారు. ఇండియా వాల్యూ కార్డ్ సహా 14 స్కీములు, సంస్థల పేరు చెప్పి డబ్బు డిపాజిట్ చేయించుకుంటారు.
ఇలా నగదు డిపాజిట్ చేయడానికి అవసరమైన 45 బ్యాంకు ఖాతాలను లక్నోకు చెందిన ముగ్గురు నిందితులు తెరిచారు. డబ్బు డిపాజిట్ అయిన తరువాత వారి నెంబర్లు బ్లాక్ చేసేస్తారు. ఈ పంథాలో హైదరాబాద్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి మహ్మద్ లియాఖత్ అలీఖాన్‌కు కూడా టోకరా వేశారు. రూ.8.15 లక్షలు మోసపోయిన ఆయన గత నెల 24న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
పది మంది అరెస్టు: సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతాలతో సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఢిల్లీలో ఏడుగురు పాత్రధారులు, లక్నోలో ముగ్గురు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన వారిని అరెస్టు చేసింది. వీరి నుంచి పోలీసులు రూ.7.3 లక్షలు, మూడు ల్యాప్‌టాప్‌లు, 11 హార్డ్‌డిస్క్‌లు, 37 సెల్‌ఫోన్లు, 11 రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
సూత్రధారులు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ అరోరా, దీపక్ అరోరా, రాహుల్ విర్మానీ, జ్ఞానేశ్వర్, సమ్రత్ గుప్తా, పియూష్‌లు పరారీలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా మోసపోయిన వారి వివరాలు హార్డ్‌డిస్క్‌లు విశ్లేషించడం ద్వారా తెలుస్తాయని ప్రభాకరరావు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసు స్టేషన్లు లేదంటే సైబర్ క్రైమ్ పోలీసులకు 9490616648 (ఇన్‌స్పెక్టర్ ప్రసాద్), 9490616622 (ఏసీపీ ఇస్మాయిల్)కు ఫిర్యాదు చేయాలని కోరారు.
చిక్కింది వీరే:ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్ మిశ్రా, ఉదయ్ మహాజన్, సర్దుల్ సిద్ధు, రాజీవ్‌సింగ్, రాజీవ్ వర్మ, దిల్బార్ కైంతురా, సరోజ్ కుమార్, లక్నో వాసులు అలోక్ శుక్లా, రమేష్ యాదవ్, ఇఫ్తెకారుద్దీన్.
ఈ కంపెనీల పేర్లతోనే మోసాలు: ఇండియన్ వాల్యూ కార్డ్స్, ఇండియన్ సొల్యూషన్స్, యునిక్ సొల్యూషన్స్, స్టార్ క్లబ్, క్యాపిటల్ వాల్యూ, సిటీ వాల్యూ కార్డ్స్, స్టాండర్డ్ వాల్యూ, స్టాండర్డ్ సొల్యూషన్స్, ద అవెన్యూ, ఆమ్రో సొల్యూషన్స్, ఫ్యూచర్ సొల్యూషన్స్, యునిక్ యాంబిష్ ప్రైవేట్ లిమిటెడ్, సావరిన్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాలెడ్జ్ యాంబిషన్స్.