మాయ లేడీ | Young woman Cheating with Matrimonial sites | Sakshi
Sakshi News home page

మాయ లేడీ

Published Thu, Mar 23 2017 3:56 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

మాయ లేడీ

మాయ లేడీ

మాట్రిమోనియల్‌ పేరుతో మోసం
అందమైన యువతి ఫొటోతో ప్రొఫైల్‌
పెళ్లి పేరుతో సిటీకి చెందిన ఇద్దరికి టోకరా
అదుపులోకి తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌


సాక్షి, సిటీబ్యూరో: అందమైన ఫొటోలు పెట్టడం... లేని విద్యార్హతలు, ఆస్తుల్ని ఆపాదించుకోవడం... వీటి ఆధారంగా మాట్రిమోనియల్‌ సైట్లలో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చెయ్యడం... ఆకర్షితులైన యువతుల్ని నిలువునా ముంచడం... ఇలాంటి మోసాలకు పాల్పడిన అరెస్టైన యువకుల కేసుల్ని ఇప్పటి వరకు చూశాం. అయితే ఇక్కడ సీన్‌ రివర్సయ్యింది. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఇదే పంథాను అనుసరిస్తూ దేశ వ్యాప్తంగా 2600 మందికి గాలం వేసింది.

ఈమె చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ మోసపోయారు. దీంతో రంగంలోకి దిగిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సదరు యువతిని బుధవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన శ్రీలత అనే యువతి మాట్రిమోనియల్‌ సైట్‌ ఆధారంగా భారీ మోసానికి తెరలేపింది. తన పేరును సుస్మితగా పేర్కొంటూ ఇంటర్‌నెట్‌ నుంచి అందమైన యువతి ఫొటో డౌన్‌లోడ్‌ చేసుకుంది. వీటిని వినియోగించి ఓ మాట్రిమోనియల్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుంది.

2600 మందికి టోకరా
ఆ ప్రొఫైల్‌లో తనను హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువతిగా పేర్కొన్న శ్రీలత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తోందని పేర్కొంది. దీంతో ఆమె ప్రొఫైల్‌లో దేశ వ్యాప్తంగా 2600 మంది లైక్‌ చేయడంతో పాటు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అలా ఆకర్షితులైన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ ఉన్నారు. సిటీకి చెందిన ఓ యువకుడితో కొన్ని రోజుల పాటు ఫోన్‌లో మాట్లాడిన ‘సుస్మిత’ తనపై నమ్మకం పెంచుకుంది. హఠాత్తుగా ఓ రోజు తన పర్సు పోగొట్టుకున్నానంటూ రూ.40 వేలు అడిగింది. అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన సదరు యువకుడు నగదు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశాడు. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు అడగటంతో అనుమానం వచ్చిన అతను సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు డబ్బు డిపాజిట్‌ అయిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేశారు.

సోదరుడి ఖాతాతో డబ్బు వసూలు
‘సుస్మిత’ డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి తన సోదరుడి ఖాతాను వాడింది. దీన్ని పోలీసులు ఫ్రీజ్‌ చేయించడంతో కంగుతిన్న అతడు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి డీ–ఫ్రీజ్‌ చేయాల్సిందిగా కోరాడు. నగర యువకుడితో సంభాషించడానికి సుస్మిత వాడిన ఫోన్‌ నెంబర్‌ను ఇతడికి చూపించిన అధికారులు ఆరా తీయగా... తన సోదరికి చెందినదిగా పేర్కొంటూ శ్రీలత ఫోటో చూపించాడు. దీన్ని చూసిన బాధితుడు ఒకింత షాక్‌కు లోనయ్యాడు.

ఈ దర్యాప్తు సాగుతుండగానే నగరానికి చెందిన మరో ‘సుస్మిత’ బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొంతకాలం మాట్లాడిన ఆమె తన సమీప బంధువు చనిపోయాడంటూ రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయించుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసుల్ని నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపారు. బుధవారం శ్రీలతను అదుపులోకి తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈమె మా ట్రిమోనియల్‌ ప్రొఫైల్‌పై 2600 మంది ఆకర్షితులు కావడంతో వారిలో ఎందరు బాధితులుగా మారారనేదానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement