Matrimonial sites
-
మాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలకు ఎర..
ముంబై: మ్యాట్రిమోనియల్ సైట్లలో అవివాహిత మహిళలను వేధిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఘరానా మోసగాడికి కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పబ్బం గడుపుకోవడమే అలవాటుగా మార్చుకున్నాడంటూ మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా వసాయ్‌కి చెందిన ఇమాదుద్దీన్ ఇర్ఫాన్ షేక్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జి జయేంద్ర జగ్దలే వ్యాఖ్యానించారు. మోసం, వేధింపులు, లైంగిక దాడికి యత్నం తదితర సెక్షన్ల కింద పోలీసులు ఇతడిపై కేసు పెట్టారు. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వైద్యురాలైన బాధితురాలికి నిందితుడు ఇర్ఫాన్ షేక్ పరిచయమయ్యాడు. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇర్ఫాన్ షేక్‌కు అప్పటికే పెళ్లయి, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం మాత్రం బాధితురాలికి చెప్పకుండా దాచాడు. కొన్ని రోజుల తర్వాత మోసం బయటపడింది. అప్పటి నుంచి అతడి నుంచి వేరుగా ఉంటోంది. నిందితుడు మాత్రం వాట్సాప్ కాల్స్‌తో వేధించడం మానలేదు. ఆమె వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానంటూ బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో 2024 జూన్‌లో బాధితురాలి కారులోకి బలవంతంగా చొరబడ్డ ఇర్ఫాన్ షేక్ తుపాకీ లాంటి ఆయుధంతో బెదిరించి, లైంగిక దాడికి యతి్నంచాడు. తనను కాదని వేరెవరిని పెళ్లి చేసుకున్నా పరిణామాలు దారుణంగా ఉంటాయని వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇర్ఫాన్ షేక్ గతంలో మ్యాట్రిమోనియల్ సైట్లలో బ్యాంక్ ఉద్యోగినంటూ ఒకరిని మోసం చేసినట్లు గుర్తించారు. పోలీసు అధికారి పేరుతో, న్యాయశాఖ చిహ్నాన్ని తన వాహనంపై అతికించుకుని వసూళ్లకు పాల్పడ్డాడని తేల్చారు.మ్యాట్రిమోనియల్ సైట్‌కు సంబంధించిన మరో కేసులో తెలంగాణ పోలీసులు ఇతడిని అరెస్ట్ కూడా చేశారని కోర్టుకు పోలీసులు నివేదించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న జడ్జి జయేంద్ర..ఇతడి నేర చరిత్రను వెలికి తీసేందుకు, మున్ముందు ఇతడి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇతడిపై అభియోగాలు తీవ్రమైనవని, అందుకు తగు ఆధారాలు సైతం ఉన్నాయన్నారు. బెయిలిస్తే విచారణకు అవరోధం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించారు. -
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు..విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లికి సిద్ధం
సాక్షి, కంటోన్మెంట్: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లి కొడుకు బాగోతం బోయిన్‌పల్లిలో కలకలం సృష్టించింది. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వంశీ కృష్ణ (39) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిల్కుష్ నగర్‌లోని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇతను గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకుని వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడు. తాజాగా మూడో పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీని సంప్రదించాడు. నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ మీనారెడ్డికి ఏడాది క్రితమే వివాహం జరగ్గా ఇటీవలే భర్త చనిపోయాడు. ఈమె కూడా అదే మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకుంది. మ్యాట్రిమోనీ ద్వారా ఒకరి వివరాలు మరొకరికి అందడంతో, గత నెలలోనే వంశీకృష్ణ నెల్లూరుకు వెళ్లి మీనారెడ్డినికి కలిశాడు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి నగరానికి తిరిగొచ్చాడు. ఈ నెల 4వ తేదీన నగరానికి వచ్చిన మీనారెడ్డిని కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల అనంతరం నెల్లూరుకు వెళ్లికిన మీనా రెడ్డి ఈ నెల 24న మళ్లీ తిరిగొచ్చి వంశీకృష్ణ ఇంటికి చేరుకుంది. అయితే అప్పటికే వంశీకృష్ణ తనకు మీనారెడ్డితో వివాహ బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేదంటూ చెప్పి, ఓ గదిలో బంధించాడు. మళ్లీ వివాహం కోసం మ్యాట్రిమోనీని సంప్రదించాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వంశీకృష్ణ మళ్లీ పెళ్లికోసం దరఖాస్తు చేసుకోవడంతో మ్యాట్రీమోనీ నిర్వాహకులు మీనారెడ్డిని ఫోన్లో సంప్రదించారు. ఆమె చెప్పిన వివరాలతో పాటు వంశీకృష్ణపై ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె వంశీకృష్ణ చెరనుంచి తప్పించుకుని బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వంశీకృష్ణ మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో అతని కుటుంబ సభ్యులు పాత్రపై కూడా ఆరాతీస్తున్నారు. (చదవండి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్) -
‘కిలాడి కపుల్’.. పెళ్లి పేరుతో 35 మందికి ట్రాప్.. కోటికిపైగా వసూల్!
లక్నో: మ్యారేజ్ బ్యూరోల్లో నకిలీ వివరాలతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగుచూసింది. నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రోఫైల్స్ ద్వారా ఓ కిలాడి జంట ఏకంగా 35 మందిని మోసం చేసింది. వారికి సుమారు రూ.1.6 కోట్లకు టోకరా వేశారు దంపతులు. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న జంటను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మహిళ, జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 35 మందిని మోసగించారు. వారి నుంచి సుమారు రూ.1,63,83,000లు దోచుకున్నారు. ‘వివాహం పేరుతో తన కూతురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్నారని ఓ సైనికాధికారి మొరాదాబాద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ టీంతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దర్యాప్తు చేపట్టిన టీం ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాం. గత ఏడాదిన్నరగా సుమారు 35 మందిని మోసగించినట్లు తేలింది. అందమైన ఫోటోలతో మ్యాట్రిమేనియల్ సైట్స్‌లో ఆకర్షించేలా ప్రోఫైల్స్ పెడతారు. ఎవరైనా వారి కాంటాక్ట్‌లోకి వస్తే వారిని మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాలతో డబ్బులు అడుగుతారు. అరెస్ట్ చేసిన వారు జార్ఖండ్‌కు చెందిన బబ్లూ కుమార్, బిహార్‌కు చెందిన పూజా కూమారిగా గుర్తించాం. ఇరువురికి వివాహం జరిగింది ’ అని వివరాలు వెల్లడించారు డీఎస్పీ అనూప్ కుమార్. ఇదీ చదవండి: Squid Game: ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు.. -
బార్బర్ టు సైబర్ క్రిమినల్!
సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా లండన్‌లో నివసిస్తున్న కృష్ణకుమార్‌గా నగర యువతికి పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి, కస్టమ్స్ అధికారుల డ్రామా ఆడి రూ.10.65 లక్షలు కాజేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన ఆఫ్రికా జాతీయుడు కాబ్రెల్ ఎడ్మాండో సైబరాబాద్ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. జీడిమెట్లకు చెందిన వ్యాపారి నుంచి గతేడాది రూ.46.35 కాజేసింది కూడా ఇతడేనని ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ గుర్తించారు. దీంతో ఇతడిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబ్రెల్ కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వ్యాపారి మనోహర్‌కు గతేడాది మే 13న వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. లండన్‌లోని బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన ఎలిజిబెత్ జియోబార్జ్ పేరుతో ఇది వచ్చింది. తమ కంపెనీకి భారత్ నుంచి నిత్యం బయాస్మా యాక్టివ్ లిక్విడ్ సరఫరా అవుతుందని అందులో పేర్కొన్నాడు. దీన్ని తమకు నాగ్‌పూర్ కేంద్రంగా పని చేసే కేఎస్ ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తోందని జియోబార్జ్ చెప్పాడు. అనివార్య కారణాల వల్ల తాము నేరుగా ఖరీదు చేయలేకపోతున్నామన్నాడు. ఆ సంస్థ నుంచి మీరు సమీకరించుకుని మాకు సరఫరా చేస్తే లీటర్ రూ.95 వేలకు ఖరీదు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ 300 లీటర్లకు పర్చేజ్ ఆర్డర్ కూడా పంపాడు. ఇది చూసిన మనోహర్ కేఎస్ ఎంటర్ప్రైజెస్ వివరాలు కోరాడు. జియోబార్జ్ రెండు ఫోన్ నెంబర్లను పంపాడు. బాధితుడు వీటిలో సంప్రదించగా ఆ సంస్థకు చెందిన వారుగా ఇద్దరు మాట్లాడారు. తనకు ఒక లీటర్ బయాస్మా యాక్టివ్ లిక్విడ్ పంపాలని కోరడంతో వాళ్లు పంపారు. దీన్ని ఈయన జియోబార్జ్ చెప్పిన వారికి మహారాష్ట్రలోనే అందించాడు. బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులుగా చెప్పుకున్న వాళ్లు సదరు ఆయిల్ పరీక్షించామని, నాణ్యమైనదిగా తేలిందని చెప్పారు. తొలిదఫా 300 లీటర్లు పంపితే లండన్ చేరుస్తామన్నారు. దీంతో మనోహర్ మళ్లీ కేఎస్ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించారు. తనకు ఆ పరిమాణంలో బయాస్మా యాక్టివ్ లిక్విడ్ కావాలని ఆర్డర్ చేశాడు. దీని నిమిత్తమంటూ ఆయన నుంచి రూ.46,35,600 ఆన్లైన్లో కాజేసిన నిందితులు ఆపై తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిపై బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది అక్టోబర్ 14న కేసు నమోదైంది. కాబ్రెల్ ఎడ్మాండో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని విచారించిన నేపథ్యంలోనే అప్పట్లో జియోబార్జ్గా నగదు కాజేసింది సైతం ఇతడేనని బయటపడింది. ఇతడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం సిటీ సైబర్ కాప్స్ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇది పూర్తయిన తర్వాత సైబరాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. (చదవండి: చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం) -
మ్యాట్రిమొనిలో ఎన్నారై పేరుతో మోసం! చివరకు..
ఎన్నారై సంబంధాలకు ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని ఓ విదేశీయుడు హైదరాబాద్‌కు చెందిన యువతిని బురిడీ కొట్టించాడు. మాయ మాటలు, కట్టుకథలు అల్లి ఆమె నుంచి లక్షల రూపాయలు కాజేశాడు. మోసపోయినట్టు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. చివరకు అరెస్టై కటకటాలు లెక్కపెడుతున్నాడు. విదేశీ మోసగాడు ఐవరీ కోస్టు దేశానికి చెందిన అమర ఫ్యానీ(24) అనే యువకుడు మ్యాట్రిమొని సైట్లో తనను తాను ఓ ఎన్నారైగా పేర్కొంటూ తప్పుడు పేరు, అడ్రస్‌తో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీన్ని చూసి నమ్మిన హైదరాబాద్‌కి చెందిన యువతి అతనితో సంభాషణ ప్రారంభించింది. ఈ క్రమంలో హైదరాబాదీ యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెబుతూ నమ్మకం కలిగించాడు. కస్టమ్స్ పేరుతో ఉన్నట్టుండి హైదరాబాదీ యువతకి ఒకరోజు కస్టమ్స్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. తనను చూసేందుకు ఇండియా వస్తున్న అమర ఫ్యానీని అక్రమంగా ఫారెన్స్ కరెన్సీ ఉన్నందువల్ల అరెస్ట్ చేసినట్టు తెలిపారు... ఈ వివాదం నుంచి బయట పడేందుకు ఆ యువతి వివిధ బ్యాంకు ఖాతాల నుంచి ఫ్యాన్నీ తెలిపిన నంబర్లకు రూ.11 లక్షల వరకు మనీ సెండ్ చేసింది. ఆ తర్వాత అటువైపు నుంచి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. పరారీ యత్నం కొన్ని రోజులకు మోసపోయినట్టు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా విచారణలో అమర ఫ్యానీతో పాటు అతని స్నేహితుడు నైజీరియన్ ఐకే ఫినిచ్ (32)కి కూడా ఈ మోసంలో భాగం ఉన్నట్టు గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా భవనం దూకి పారిపోయే క్రమంలో ఫినిచ్ తీవ్రంగా గాయపడి కోలుకుంటుండగా.. అమరఫ్యానీ పోలీసుల అదుపులో ఉన్నాడు. వీరిద్దరు ఎన్నారై పేరుతో చాలా మందిని మోసం చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వీరి గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. చదవండి: వలస కార్మికుల కోసం హెల్ప్ డెస్క్ -
వయసు 23 నుంచి 32..పెళ్లిపై ఫుల్ క్లారిటీ.. సాఫ్ట్వేర్ అయితే ఓకే..
సాక్షి, హైదరాబాద్: జీవిత భాగస్వామి ఎంపికలో భద్రమైన భవిష్యత్తుకే నవతరం ఓటేస్తోంది. ఉన్నత చదువులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్న జీవిత భాగస్వామినే ప్రస్తుత యువత కోరుకుంటున్నారని ప్రముఖ పెళ్లి సంబంధాల వేదిక తెలుగు మ్యాట్రిమోని నివేదికలో వెల్లడైంది. జీవిత భాగస్వామి ఎంపికలో ఏయే అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అనే దానిపై నివేదిక ఆసక్తికరమైన వివరాలను తెలిపింది. అవి ఏంటంటే.. ► గడిచిన 12 నెలల్లో మొత్తం మ్యాట్రిమోని రిజిస్ట్రేషన్లలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది ప్రొఫైల్స్‌ని స్వయంగా నమోదు చేసుకోవడం చూస్తే యువతలో తమ వైవాహిక జీవితం పట్ల స్పష్టత తెలుస్తోంది. సామాజికంగా రకరకాల మార్పులు వస్తున్నప్పటికీ వధూవరుల ఎంపికలో ఇరువైపులా చదువే ప్రథమ స్థానంలో ఉంది. మంచి చదువుతో పాటు చేసే ఉద్యోగం, అందుకు తగిన వేతనం ఎంపికలో అగ్రస్థానంలో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌కు సై.. వెబ్సైట్లలో నమోదు చేసుకున్న పురుషులు 45 శాతం సాఫ్ట్వేర్ వృత్తిలోని భాగస్వామిని కోరుకున్నారు. 43 శాతం మంది మహిళలు కూడా సాఫ్ట్వేర్ రంగం పట్లే ఆసక్తి కనబరిచారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు టీచర్లు, డాక్టర్లు తదితర రంగాల వారూ ఉన్నారు. కులానికి తగ్గిన ప్రాధాన్యం.. మంచి చదువు, వేతనం ఉంటే ఇరువైపులా కుల వ్యత్యాసాల గురించి పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. నివేదిక పేర్కొన్న ప్రకారం 16.4శాతం స్త్రీలు వేరే కులం వారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండగా, 24.3 శాతం పురుషులు తాము కూడా అన్య కులస్తులకు సై అంటున్నారని నివేదిక వెల్లడించింది. ‘పదేళ్ల క్రితం కులాంతర వివాహం పట్ల ఆసక్తి కనబరించిన వారిలో ఒకరో ఇద్దరో ఉండగా ప్రతియేటా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ కులాంతర వివాహాల వైపు దూసుకు వెళుతోంది’ అని మ్యాట్రిమోని సైట్స్ తమ జాబితాలో ఉన్న సభ్యుల నివేదిక ద్వారా తెలియజేస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే నవతరం కులం కన్నా మిగిలిన అన్ని విషయాల్లో సమవుజ్జీలకే తగిన ప్రాధాన్యమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈడుంటేనే జోడు ► జీవిత భాగస్వామిని కోరుకునే మహిళల్లో 74.1 శాతం మంది 23 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు వారు కాగా, 72.3 శాతం మంది పురుషులు 23 నుంచి 32 సంవత్సరాల వయసు వారున్నారు. దీనిని బట్టి ఆధునికులు తమ వివాహ వయసును ఇదమిత్థంగా నిర్దేశించుకుంటున్నారని తేలుతోంది. ► మ్యాట్రిమోని.కామ్ ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అర్జున్ భాటియా ప్రస్తుత వధూవరుల వివాహ ఎంపిక గురించి తెలియజేస్తూ ‘జీవిత భాగస్వామిని కనుగొనే విషయంలో ఇది అత్యంత విశ్వసనీయ ఎంపికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది తెలుగువారి నమ్మకాన్ని సంపాదించినట్టుగా’ వివరించారు. ► పెళ్లి కోసం వివరాలను నమోదుచేసుకుంటున్న వారిలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. విజయవాడ, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, గుంటూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఆ వివరాలు తెలపాలంటూ మాట్రీమోనియల్ యాడ్.. నెటిజన్ల ఆగ్రహం
మాట్రీమోనియల్ సైట్లు, యాప్‌ల సాయంతో పలువురు యువతి, యువకులు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. యువతియువకులు తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలతో పాటు కుటుంబ వివరాలతో కూడిన ఫ్రొఫైల్ యాడ్‌ను మాట్రీమోనియల్ సైట్లలో అప్లోడ్ చేస్తుంటారు. అయితే చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిలు.. తమకు కాబోయేవారు ఎలా ఉండాలి? ఎలాంటి అభిరుచులు కలిగి ఉండాలి? అనే దానిపై చాలా స్పష్టత కనబరుస్తారు. మంచి క్వాలిటీస్ ఉన్న వారు తమ జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటూరు. అయితే ముఖ్యంగా రంగు, ఎత్తు, అందం విషయంలో వెనక్కు తగ్గరు కూడా. అయితే ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా.. తనకు భార్యగా కాబోయే అమ్మాయి ఎత్తు, బరువు, పాదాలు, నడుము సైజ్‌ను తనకు నచ్చిన మెజర్మెంట్లతో ఉండాలని ప్రొఫైల్‌లో పొందుపరిచాడు. అక్కడితో ఆగకుండా బ్రా సైజ్‌ను కూడా పేర్కొన్నాడు. ఇంకా కొన్ని విచిత్రంగా అనిపించే.. క్వాలిటీస్‌ను కూడా అందులో జతచేశాడు. అటువంటి అమ్మాయి వధువుగా రావాలని తెలిపాడు. అయితే ముందుగా ఈ పోస్ట్ రెడ్డిట్ అనే సైట్లో అప్లోడ్ కాగా.. దాన్ని చూసిన నెటిజన్లు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ మండిపడుతున్నారు. ‘ఇలాంటివి ఎలా అడుగుతున్నావ్రా బాబు. నాకు విచిత్రంగా ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఓ ట్విటర్ యూజర్ సంబంధిత మాట్రామోనియల్ యాప్‌కు ట్యాగ్ చేయగా.. అతనిపై తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. -
మాట్రిమోనియల్ మోసం: పోలీసుల నిర్లక్ష్యమే చంపేసింది!
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు మాట్రిమోనియల్ సైట్స్ ద్వారా టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నిందితుడు కిరణ్‌కుమార్‌ను పట్టుకోవడంలో సైబరాబాద్ పోలీసులు విఫలమయ్యారు. అతడి చేతిలో మోసపోయిన ఓ అభాగ్యురాలు అవమానభారం తట్టుకోలేక కన్న కొడుకు ముందే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పట్టుకోవడంలో ఆలస్యం ఎందుకైందంటూ మృతురాలి కుటుంబీకులు బాచుపల్లి పోలీసులను నిలదీశారు. బందోబస్తు విధులే కారణమంటూ అధికారులు తప్పించుకోవాలని చూస్తున్నారని మృతురాలి కుటుంబీకులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. దాదాపు 14 మందిని ఇదే పంథాలో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి రాచకొండ పరిధిలోని నాచారం ఠాణాకు మరో బాధితురాలు వెళ్లింది. అక్కడ ఆమెకూ అవమానమే ఎదురైంది. వరుసగా మోసాలు చేసిన కిరణ్.. ములుగు జిల్లా ఇంచర్లకు చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్ రెడ్డి(29) హైదరాబాద్‌లోని ఎల్అండ్టీ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో రెండో వివాహం అంటూ రిజిస్టర్ చేసుకున్నాడు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలు, వితంతు మహిళలను ఆకర్షించాడు. వారికి రకరకాల సమస్యలు చెప్పి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటాడు. ఇప్పటికి 14 మంది మహిళల నుంచి రూ.30 లక్షల నగదు, 10 తులాల ఆభరణాలు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ► కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి భర్తకు దూరంగా ఉంటూ నిజాంపేటలో కుటుంబీకులతో కలిసి ఉండేది. కిరణ్ బారినపడిన ఈ బాధితురాలు రూ.3.12 లక్షలు మోసపోయింది. దీనిపై గత నెల 22న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆపై ఈ కేసును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ‘ఒంటరి మహిళలే టార్గెట్’ శీర్షికన ఈ నెల 9న కథనం ప్రచురించింది. అయినప్పటికీ పోలీసుల్లో స్పందన లేకపోవడంతో ఠాణా చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ‘మహిళల రక్షణకు కీలక ప్రాధాన్యం ఇస్తాం.. మహిళలపై జరిగే నేరాలను ఉపేక్షించం’ పోలీసులు చేసే ఇలాంటి ప్రకటనలు నిజమని నమ్మిన బాధితురాలికి నిరాశే ఎదురైంది. విసిగి వేసారి తనువు చాలించింది.. అప్పటికే దురలవాట్లకు బానిసైన భర్తకు దూరంగా ఉండటం, కుమారుడి పోషణ బాధ్యతలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. మరోపక్క కిరణ్‌కుమార్ చేతిలో దారుణంగా మోసపోయి మరింత కుంగిపోయింది. కేసు నమోదు చేసినా నిందితుడిని పట్టుకోకపోవడంతో పోలీసులు నిర్లక్ష్యం వహించడాన్ని అవమానంగా భావించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ► ఈమె తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం ఆమెతో పాటు అమ్మమ్మ ఆసుపత్రికి వెళ్లారు. అలా ఇంట్లో ఒంటరిగా మిగిలిన బాధితురాలు తన కుమారుడు చూస్తుండగానే బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన తల్లి, అమ్మమ్మలకు మనవడు ఏడుస్తూ కనిపించాడు. దీంతో ఆందోళకు గురైన వాళ్లు లోపలకు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వారిద్దరూ గుండెలు బాదుకుంటూ స్థానికులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి మృతదేహాన్ని కిందికి దింపారు. ► తండ్రి దూరమై.. తల్లి మరణించడంతో ఇప్పుడు ఆ ఐదేళ్ల చిన్నారి అనాథగా మారాడు. ఈమె లాగే కిరణ్ చేతిలో మోసపోయిన మరో బాధితురాలు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఇటీవల వెళ్లారు. ఆమెకూ అక్కడ ఛీత్కారాలే ఎదురయ్యాయి. ‘మీలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి. వాడికి డబ్బులు ఎందుకిచ్చావు’ అంటూ అక్కడి పోలీసులు తనను అవమానించారని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: వన్‌డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు బాత్రూంలో స్పై క్యామ్: వెలుగులోకి సంచలన విషయాలు -
పెళ్లి చేసుకుని అమెరికా వెళ్దామన్నాడు.. తీరా చూస్తే
పెళ్ళి సంబంధాలు చూసే క్రమంలో మ్యాట్రిమోనియల్ సైట్లో తన పేరు రిజిస్టర్ చేసుకుంది లావణ్య (పేరు మార్చడమైనది). వచ్చిన వాటిలో మధు (పేరు మార్చడమైనది) ప్రొఫైల్ నచ్చింది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఫార్మాలో ఉద్యోగం చేస్తున్నానని, ప్రస్తుతం కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నానని, అమెరికాలో స్థిరపడాలన్నది తన ఆలోచనగా చెప్పాడు మధు. లావణ్య కూడా తన వివరాలన్నీ తెలిపింది. ఇద్దరి అభిరుచులూ కలిశాయి. ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్ మొదలైంది. ∙∙ మధు విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి అమ్మానాన్నలు మాట్లాడుతారంటూ మధుకి ఫోన్లో చెప్పింది లావణ్య. ఫోన్లోనే పరిచయాలు అయ్యాయి. ‘అబ్బాయి మాటతీరు, వారి వివరాలన్నీ బాగున్నాయి. మంచి రోజు చూసుకొని రమ్మని చెబుదాం’ అంది లావణ్య తల్లి. ‘అలాగేనమ్మా!’ అంది ఆనందంగా లావణ్య. కూతురి సంతోషం చూసిన తల్లి ‘మా అమ్మాయికి పెళ్లి కళ వచ్చేసిందీ..’ అంది మురిపెంగా! ∙∙ తెల్లవారు జామున మోగుతున్న ఫోన్‌ని నిద్రమత్తులోనే ఎత్తింది. అవతలి నుంచి మధు గొంతు కంగారుగా ఉండటంతో ఏమైందని అడిగింది లావణ్య. ‘మా నాన్నకు హార్ట్ ఎటాక్. రేపు మీ కుటుంబసభ్యులను కలిసి, పెళ్లి సంబంధం మాట్లాడుదామనుకున్నాం. ఇంతలో ఇలా జరిగింది’ అన్నాడు మధు. ‘ముందు మామయ్యగారి ఆరోగ్యం ముఖ్యం. అడ్రస్ చెబితే మేం హాస్పిటల్‌కి వచ్చేస్తాం’ అంది లావణ్య. ‘లావణ్యా మీరుండేది హైదరాబాద్‌లో... మేం ఉండేది వైజాగ్‌లో. ఎందుకు హైరానా? ఏదైనా ఉంటే నేను చెబుతాలే’ అన్నాడు మధు. ‘సరే’ అంది లావణ్య. ∙∙ రోజూ మధు తండ్రి ఆరోగ్యం గురించి కనుక్కుంటూనే ఉంది లావణ్య. ‘ఇప్పుడు బాగానే ఉంది లావణ్య. పెళ్లయ్యాక ఎలాగూ మనం అమెరికా వెళ్లాలి. ఇప్పుడే వీసా ప్రకియ మొదలుపెట్టాలి. నా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. నీవు ఇంటర్నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసి, కొంత మనీని ట్రాన్స్ఫర్ చేయి. నీ వీసా ప్రక్రియ కూడా మొదలుపెడతాను’ అన్నాడు మధు. అతను చెప్పిన వివరాలతో అంతర్జాతీయ బ్యాంక్‌లో ఆధార్, పాన్‌కార్డ్.. అన్నీ జత చేసి వాటిని మధుకు పంపించింది. మరుసటి రోజు మధు ఫోన్ చేసి ‘మా నాన్న అకౌంట్ నుంచి నీ అకౌంట్లోకి రూ.10 లక్షల రూపాయలు వస్తాయి. వాటిని వెంటనే తిరిగి నా అకౌంట్‌కు పంపు’ అన్నాడు మధు. అలాగేనంటూ మధు చెప్పిన అకౌంట్‌కు మనీని ట్రాన్స్ఫర్ చేసింది. ‘వీసా ప్రక్రియ పూర్తికాగానే, అందరం కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పాడు’ మధు. సంతోషంగా సరే అంది లావణ్య. మరుసటి రోజు నిద్రలేచిన లావణ్యకు ఫోన్ లో మధు నుంచి ఎలాంటి మెసేజ్ లేకపోవడంతో తనే మెసేజ్ చేసింది. ఎంతకీ రిప్లై లేదు. ఏమై ఉంటుందీ... అని ఫోన్ చేసింది. మధు ఫోన్ స్విచ్డాఫ్ వస్తోంది. వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగాలేదుగా పాపం. మళ్లీ ఏమైనా ప్రమాదం ముంచుకొచ్చిందేమో అనుకుంది. మధ్యాహ్నం అయ్యింది, సాయంత్రం అయ్యింది. రాత్రి అయ్యింది. వారం గడి చింది. మధు నుంచి ఎలాంటి ఫోన్ లేదు. తను ఫోన్ చేస్తే స్విచ్డాఫ్. నెల రోజులు గడిచాయి. ఇంతలో బ్యాంక్ నుంచి తీసుకున్న 10 లక్షల రూపాయలకు ఈఎమ్ఐ చెల్లించాలంటూ మెసేజ్ వచ్చింది. తన పేరుతోనే మధు లోన్ తీసుకుని, ఆ అమౌంట్‌నే తన తండ్రి అకౌంట్నుంచి వచ్చినట్టుగా నమ్మబలికి చేసిన మోసం గురించి అప్పుడర్థమైంది లావణ్యకు. తనకు జరిగింది మోసం అని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. మధు అనే వ్యక్తి వైజాగ్‌లోనే లేనట్టు తెలిసి, మరింత షాకైంది లావణ్య. వెనకడుగులోనూ బలం ఉండాలి నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి పెళ్లి కావలసిన అమ్మాయిలకు కాబోయే వరుడిగా నటిస్తూ, స్నేహం చేస్తారు. ఇంటి బాధ్యతలు, తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారిలా నమ్మబలుకుతారు. ఏదో ఒక అత్యవసర పరిస్థితిని సృష్టించి, బ్యాంకు నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు. డబ్బు బదిలీ కాగానే, అదృశ్యమవుతారు. వీరు వ్యక్తిగతంగా కలవడానికి ఇష్టపడరు. ఆస్తులు, ఆదాయం గురించి విచారిస్తారు. పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్‌చేసిన తర్వాతనే ముందడుగు వేయాలి. అవతలి వ్యక్తి మిమ్మల్ని ఏ విషయాల్లోనైనా త్వరపెడుతున్నట్టుగా అనిపిస్తే వెనకడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నగదు బదిలీ చేయవద్దు. మీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి సరైన URLని మీ విండో బ్రౌజర్లో టైప్ చేయండి. ఎస్సెమ్మెస్, వాట్సప్ ద్వారా అవతలి వ్యక్తి పంపిన ‘షార్ట్’ లింక్‌లపై క్లిక్ చేయవద్దు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ నిజనిర్ధారణ తప్పనిసరి మ్యాట్రిమోని సైట్లలో ఉన్న ప్రొఫైల్స్ పైనే ఆధారపడకుండా, అవతలి వ్యక్తి చిరునామా నిజమైనదేనా అనేది నిర్ధాణ చేసుకోవాలి. అతను/ఆమె చేస్తున్న ఉద్యోగాల గురించి వాకబు చేయాలి. ఇలాంటి వాటిల్లో ఆర్థిక మోసం ఒకటైతే, తమ వాంఛ తీర్చుకోవడానికి వలపన్నే వారుంటారు. మంచిగా ఉంటూనే నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించి వాటిని పోర్న్‌సైట్స్‌లో పెట్టి, బెదిరించి డబ్బులు లాగుతారు. మోసాలు ఎలా జరుగుతాయో తల్లిదండ్రులు పెళ్లీడు పిల్లలకు వివరించాలి. పొరపాటున కూడా బ్యాంకు వివరాలు షేర్ చేయకూడదు. ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్. చదవండి: Cow Dung: పేడంటే పేడా కాదు! -
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా; విలువైన కానుకలు పంపిస్తున్నా
బనశంకరి: నిత్యజీవితంలో డిజిటల్ సాంకేతికత పాత్ర పెరిగేకొద్దీ సైబర్ మోసగాళ్ల పని సులువవుతోంది. అమాయకులను ఎంచుకుని లక్షలాది రూపాయలు దోచుకోవడం సిలికాన్ సిటీలో పరిపాటైంది. నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నర్సుకు రూ.2 లక్షల నష్టం మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఆగంతకుడు, యువతికి రూ.2.07 లక్షలు టోపీ వేశాడు. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్లు యువతి బెంగాలీ షాదీ డాట్‌కామ్‌లో ఖాతా తెరిచింది. ఓ వ్యక్తి పరిచయమై విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని, మీకు ఢిల్లీకి ఖరీదైన కానుకలు పంపించానని చెప్పాడు. కస్టమ్స్ ఫీజుల కింద ఆమె నుంచి రూ.2.07 లక్షలు ఆన్లైన్లో లాగేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలు దక్షిణ విభాగ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేవైసీ అని రూ.27 లక్షలు స్వాహా ఓ వృద్దుడు సిమ్‌కార్డు కేవైసీ అనివచ్చిన కాల్‌ను నమ్మి రూ.27 లక్షలు పోగొట్టుకున్నాడు. బాణసవాడిలోని 80 ఏళ్ల రిటైర్డు ఉద్యోగికి ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ మొబైల్ సిమ్‌కార్డు కేవైసీ చేసుకోవాలని, లేకపోతే బ్లాక్ అవుతుందని తెలిపాడు. నిజమేననుకున్న వృద్ధుడు అతడు అడిగిన డెబిట్‌కార్డు సమాచారం ఇవ్వగా, బ్యాంకు ఖాతాలో నుంచి రూ.27 లక్షల నగదు కాజేశాడు. బాధితుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రుణం పేరుతో రూ.5.17 లక్షలు ఓ వ్యాపారికి ఫోన్ చేసిన మోసగాడు ముద్రా రుణ విభాగం నుంచి మాట్లాడుతున్నానని నమ్మించాడు. అతన్ని నమ్మిన వ్యాపారిని రుణ మంజూరు పేరుతో దశలవారీగా రూ.5.17 లక్షలు తమ అకౌంట్లు జమచేసుకున్నారు. రుణం మంజూరు కాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నగదు రెట్టింపు అని రూ.7.30 లక్షలు కంపెనీలో పెట్టుబడి పెడితే నిర్ణీత అవధిలోగా రెట్టింపు ఇస్తామని ఆశచూపించిన వంచకులు రూ.7.30 లక్షలు కైంకర్యం చేశారు. దేవనహళ్లి కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి అల్టా ఎంపైర్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధినని ఫోన్ వచ్చింది. తమ కంపెనీలు పెట్టుబడి పెడితే త్వరలోనే రెట్టింపు చేసి ఇస్తామని తెలిపారు. నిజమేననుకుని అతడు రూ.1.80 లక్షలు, స్నేహితుల ద్వారా రూ.5.40 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. తరువాత ఫోన్ కంపెనీ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించారు. -
ఇంజనీర్ నీచ బుద్ధి.. 12 మంది యువతులను..
ముంబై: బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక మెకానికల్ ఇంజనీర్ తప్పుబాటను ఎంచుకున్నాడు. పెళ్లి పేరుతో మాట్రియోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి యువతులను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అలా 12 మంది యువతులను వేధించిన మహేష్ అలియాస్ కరణ్ గుప్తాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముంబైలోని మలాద్ ప్రాంతానికి చెందిన మహేష్ ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ లను సృష్టించాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా యువతులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని ఫోన్లలో సంప్రదించి పబ్, రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్ లలో సమావేశం అయ్యేవాడు. మొదట వారితో చనువుగా ఉంటూ వారి ఫోన్ నెంబర్లను సంపాదించేవాడు. అనంతరం లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఇదే విషయమై డీసీపీ సురేష్ మెన్ గేడ్ మాట్లాడుతూ.. ప్రతీసారి నేరానికి పాల్పడే ముందు కొత్త మొబైల్ నంబరును ఉపయోగించేవాడు. ప్రతీసారి తన సిమ్‌ను మార్చుకుంటూ ఓలా లేదా ఉబెర్ ఉపయోగించి క్యాబ్‌లను బుక్ చేసేవాడు. పైగా అతను ఉపయోగించే సిమ్లన్ని తన పేరిట ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో హ్యాకర్ గా పనిచేసిన మహేష్ కంప్యూటర్లపై మంచి పరిజ్ఞానం ఉంది. కానీ మహేష్ దానిని తప్పడు మార్గంలో ఉపయోగిస్తున్నాడు.'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడు మహేష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ తెలిపారు. చదవండి: ఆన్లైన్ పోర్న్ సినిమాలకు బానిసై.. విపరీత చేష్టలు -
Matrimonial Fraud: జాగ్రత్తగా చేరుకున్నావా డియర్!
భిన్నాభిప్రాయాల కారణంగా ఇటీవల విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత వారు ఒంటరి జీవితాన్ని భరించలేక మళ్లీ పెళ్లి చేసుకోవడానికి మ్యారేజీ బ్యూరో సైట్స్‌ను ఆశ్రయిస్తుంటారు, ఈ సైట్స్ ద్వారా ముక్కూ మొఖం తెలియని వారితో పరిచయాలు పెంచుకోవడంతో ఇటీవల మోసపోతున్నవారి సంఖ్యా పెరుగుతోంది. వాణి (పేరు మార్చడమైంది) ఉదయం లేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. సురేష్ (పేరు మార్చడమైంది) నుంచి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ తిరుగు రిప్లై ఇచ్చింది. టీ, కాఫీ ముగించేసి, తిరిగి ఫోన్ చూస్తే అప్పటికే పాతికకు పైగా మెసేజ్‌లు ఉన్నాయి. తన పట్ల అతను చూపుతున్న శ్రద్ధకు ముచ్చటేసింది వాణికి. రిప్లై మెసేజ్ చేసి, ఆఫీసుకు బయల్దేరింది. ఆఫీసులో వర్క్ స్టార్ట్ చేయబోతుండగా ఫోన్. ‘జాగ్రత్తగా చేరుకున్నావా డియర్’ అంటూ. ‘ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్, పదినిమిషాలకు ఒకసారి మెసేజ్ చేసి తన మంచీ చెడు కనుక్కోవడం, తిన్నావా అని అడగడం.. తన జీవితంలోకి సంతోషంలా సురేష్ వచ్చాడు అనిపిస్తోంది వాణీకి. ఇంతకు మించిన ఆనందం మరేమీ అక్కర్లేదు. త్వరలో సురేష్‌ని పెళ్లి చేసుకుంటే అంతా హ్యాపీ..’ అనుకుంటూ పనిలో పడిపోయింది. వాణి తన భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకొని ఏడాదిన్నర అవుతోంది. తల్లిదండ్రులు దూరంగా పల్లెలో ఉంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వాణికి ఆఫీసులో ఉన్నంతసేపు సమయం బాగానే గడిచిపోతుంది. ఇంటికి వెళుతూనే ఒంటరితనం బాధిస్తుంది. రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి మ్యాట్రిమోనియల్ సైట్లో తన వివరాలు ఇచ్చింది. అప్పుడే సురేష్ వాణి జీవితంలోకి ఎంటరయ్యాడు. సురేష్ మాటలు, తన పట్ల చూపే కేరింగ్ వాణికి బాగా నచ్చాయి. నెలరోజులుగా తనకు అసలు టైమ్ ఎలా గడుస్తుందో కూడా తెలియనంతగా సురేష్‌కి మానసికంగా దగ్గరైపోయింది. నెల తర్వాత ఓ రోజు... వాణి పోలీసుస్టేషన్‌కి వెళ్లింది.. ‘సర్, సురేష్ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాను. అంటూ కళ్ల నీళ్లు తిరుగుతుండగా జరిగిందంతా చెప్పుకొచ్చింది వాణి. ‘సురేష్ కిందటేడాది జూన్ 16న మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను హెచ్ఎస్బిసిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, తన భార్య 2017లో కారు ప్రమాదంలో చనిపోయిందని చెప్పాడు. అతను న్యూజిలాండ్ వెళ్లడానికి కంపెనీ ద్వారా ఆఫర్ వచ్చిందని, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్ డీటెయిల్స్ ఇస్తే టికెట్స్ బుక్ చేస్తానని చెప్పాడు. మెయిల్ ద్వారా ఆ పేపర్స్‌ని అతనికి పంపాను. వీసా ప్రక్రియ మొదలుపెట్టాక, బ్యాంక్ స్టేట్మెంట్ చూపాల్సి ఉంది. అందుకు నా పేరుతో ఒక యాప్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినా దాన్నుంచే చేస్తే మంచిదని చెప్పాడు. ముందు నేను కాదన్నాను. కానీ, తనకూ ఆ యాప్‌లో అకౌంట్ ఉందని, ఆ వివరాలన్నీ నాకు షేర్ చేశాడు. దాంతో నేను పూర్తిగా నమ్మాను. అతను చెప్పిన మొత్తాన్ని అతని యాప్ అకౌంట్‌కి సెండ్ చేశాను. జూలై 17, 18, 19, 20 నాలుగు రోజుల్లో మూడు లక్షల ఎనభై వేలు నాచేత అతని అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతని వివరాలేవీ తెలియడం లేదు’ అంటూ వాపోయింది వాణి. విపరీతమైన కేరింగ్ తను తప్ప ఈ ప్రపంచంలో కావల్సినవారెవ్వరూ లేరన్నంతగా నమ్మబలుకుతారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేనున్నానంటూ భరోసా మాటలు మాట్లాడుతారు. ఇటీవల 34 ఏళ్ల యువతి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం అయిన వ్యక్తికి కష్టం వచ్చిందని, తల్లిదండ్రులను డబ్బు ఇమ్మని వేధించింది. డబ్బులు ఇవ్వకపోతే తను చనిపోతానని బెదిరించింది. 28 లక్షలు ఆ సదరు వ్యక్తి అకౌంట్‌కి దఫదఫాలుగా చెల్లించారు ఆమె తల్లీదండ్రి. ఆ తర్వాత అతని సమాచారం ఎక్కడా లేదు. కస్టమ్స్ డ్యూటీ అంటూ... మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయ మైన వ్యక్తిని నమ్మి కమల అనే 46 ఏళ్ల మహిళ రెండు నెలల్లో రూ.16లక్షలు కోల్పోయింది. ‘కాబోయే వరుడు’ విదేశాల్లో ఉన్నాడు. అతను ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా పంపినట్లు, కస్టమ్ డ్యూటీలు చెల్లించాలని ఆమెను ఆకట్టుకున్నాడు. అతని మాటలకు ఆకర్షితురాలైన ఆమె తన ఖాతా నుండి అతను చెప్పిన ఖాతాలో అంత డబ్బూ వేసింది. ఇటీవల 66 ఏళ్ల రిటైర్డ్ నర్సు కూడా ఇదేవిధమైన మోసానికి గురైంది. ఒంటరిగా ఉన్న ఆమె విదేశీయుడు అయిన ఫేస్బుక్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మింది. అతను తన మాటల గారిడీలో పెట్టి పదిహేడున్నర లక్షల రూపాయలు కాజేశాడు. నకిలీ ఫ్రొఫైల్స్ సృష్టి కేటుగాళ్లు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తారు. ఇతరుల వివరాలను, వారి ఆర్థిక సామర్థ్యాన్ని గమనిస్తారు. వారి మొదటి ప్రాధాన్యత వితంతువులు, విదేశాలలో స్థిరపడాలనుకునే యువతులు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఉన్నత విద్యావంతులు కూడా ఈ సాధారణ ఉచ్చులో పyì మోసపోవడం. క్లియరెన్స్ తప్పనిసరి అంటూ.. విదేశాల్లో ఉన్న తాము పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఖరీదైన బహుమతులు పంపుతున్నామని చెబుతారు. ఆ బహుమతుల ప్యాకేజీ వీడియోలు కూడా తీసి, పంపుతారు.. ఆ వీడియో చూసి నిజమని నమ్ముతారు. రెండు రోజుల్లో విదేశీ మారకం కథను సృష్టిస్తారు. కస్టమ్స్ విమానాశ్రయంలో ఆపేశారు. ‘క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు అత్యవసరంగా డబ్బు అవసరం’ అంటారు. అలాగే, (ఎ) కస్టమ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (బి) మనీలాండరింగ్ సర్టిఫికేట్ వంటి సాకుతో డబ్బు వసూలు / దోపిడీ చేస్తారు. వీడియో చాట్స్ చేయరు ► ‘భారతీయ సంప్రదాయం, సంస్కృతి అంటే ఎనలేనంత ఇష్టమని, అవి తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు’గా చెబుతారు. వీరి ఇష్టాయిష్టాలను తెలుసుకొని, అవే తమకూ ఇష్టమని నమ్మబలుకుతారు. ‘ఇంతమంచిదానివి, నిన్ను కాదనుకున్న మూర్ఖులు ఎవ్వరూ ఉండరంటూ’ ప్రేమను ఒలకబోస్తారు. ► వీడియోలు, ఫొటోలు షేర్ చేయించుకుంటారు. వాటిని అడ్డుగా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు లాగుతారు. ► మ్యారేజ్ ఫ్రాడ్‌లో సదరు వ్యక్తులు వీడియో చాట్స్ చేయరు. వారి వాయిస్ మాత్రమే ఉంటుందని గమనించాలి. ► ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ ఫౌండర్ చదవండి: ప్రధాని పెళ్లి డేట్ కొద్ది గంటల క్రితమే ఫిక్స్ అయింది! -
ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ
చండీగఢ్: కొద్ది రోజుల క్రితం హర్యానా పానిపట్‌లోని ఓ ఇంట్లో మూడు అస్థిపంజరాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పానిపట్ పోలీసులు నాలుగు రోజుల్లోనే ఈ మిస్టరీని చేధించారు. దీనికి సంబంధించి యూపీకి చెందిన అశాన్ సైఫీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చింది అంటే నాలుగు రోజుల క్రితం సరోజ్ అనే మహిళ పానిపట్ శివ్ నగర్లో తాను గతంలో కొన్న ఇంటిని రెన్నోవేషన్ చేస్తుండగా మూడు అస్థిపంజరాలు బయపటడ్డాయి. సరోజ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అశాన్ని అరెస్ట్ చేశారు. అతడు గతంలో ఈ ఇంటి ఓనర్. అశాన్ పవన్ అనే వ్యక్తికి తన ఇంటిని అమ్మాడు. ఆ తర్వాత 2017లో పవన్ వద్ద నుంచి సరోజ్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి పాత యజమానుల గురించి చట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. అశాన్ ప్రవర్తన సరిగా ఉండేది కాదని తెలిపారు. దాంతో అతడి మీద అనుమానంతో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల క్రితం తానే ఈ ముగ్గురిని హత్య చేసి పానిపట్‌లోని తన పాత ఇంటిలో పూడ్చి పెట్టానని.. సరోజ్‌కు కనిపించిన అస్థి పంజరాలు అవేనని తెలిపాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే తన రెండో భార్య, ఆమె కుమారుడు.. మరో బంధువు 15 ఏళ్ల కుర్రాడు అని వెల్లడించాడు అశాన్. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘కార్పెంటర్‌గా పని చేసే అశాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేవాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిని మోసం చేసేవాడు. ఈ క్రమంలో అశాన్‌కు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైకి చెందిన నజ్నీన్‌తో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే అతడికి వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య, ఆమె సంతానం యూపీలో నివసిస్తుండేవారు. ఈ క్రమంలో అశాన్ తనకు పెళ్లి అయిందనే విషాయన్ని దాచి నజ్నీన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం అశాన్ పానిపట్‌కు తన మకాం మార్చాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు మొదటి భార్య వద్దకు వెళ్లి వస్తుండేవాడు’’ అని తెలిపారు పోలీసులు. ‘‘ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అశాన్ మొదటి వివాహం గురించి నజ్నీన్కు తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆమె మొదటి భార్య వద్దకు వెళ్లనివ్వలేదు. దాంతో ఆగ్రహానికి గురైన అశాన్ రెండో భార్య, ఆమె కుమారుడు, మరో 15 ఏళ్ల పిల్లాడిని చంపాలని డిసైడ్ అయ్యాడు. వారికి విషం పెట్టాడు. మరణించిన అనంతరం వారిని పానిపట్‌లో తాను నివాసం ఉన్న ఇంట్లో పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత ఈ ఇంటిని పవన్‌కు అమ్మాడు. అనంతరం ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకుని ప్రస్తుతం యూపీ భదోహిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్థిపంజరాలు వెలుగు చూడటం.. ఇరుగుపొరుగు వారు చెప్పిన దాని ప్రకారం అశాన్ మీద అనుమానం రావడంతో యూపీ వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి’’ అని పోలీసులు తెలిపారు. చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం యువకుడిని రాడ్డుతో కొడుతూ చిత్ర హింసలు పెట్టి.. -
ఈ–మోసగాడు.. నిండా ముంచాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు సైబర్ నేరాలు జరిగే తీరుతెన్నులపై పోలీసులు అవగాహన కల్పిస్తుండగానే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ అవుతున్నారు. తమ పంథా ఎప్పటికప్పుడు మారుస్తూ ఈ నేరాలపై అవగాహన ఉన్న వారికీ అనుమానం రాకుండా అందినకాడికి దండుకుంటున్నారు. బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన ప్రైవేట్ ఉద్యోగిని కేసే దీనికి తాజా ఉదాహరణ. ఈమెను మాటలతో మాయ చేసిన ఈ–మోసగాడు రూ.9.1 లక్షలు కాజేశాడు. నగరానికి చెందిన ఓ యువతి ప్రైవేట్ ఉద్యోగం చేయడంతో పాటు కొన్నాళ్లుగా సొంతంగా కొన్ని ప్రాజెక్టులు సైతం చేస్తున్నారు. ఆమెకు ప్రస్తుతం వివాహంపై ఆసక్తి లేనప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు భారత్ మాట్రిమోని సైట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ప్రొఫైల్‌ను ప్రస్తుతం కెనాడాలో నివసిస్తున్న పంజాబ్‌కు చెందిన జాన్ అనే వ్యక్తిగా చెప్పుకొంటూ ఒకరు లైక్ చేశారు. అక్కడి ఎయిర్‌బస్ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నానని చెప్పుకొన్న అతడు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరూ తమ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్, ఫోన్లు మొదలయ్యాయి. నమ్మకం కలిగేలా.. విద్యాధికురాలైన నగర యువతి దృష్టిలో సైబర్ నేరాలపై పోలీసు విభాగం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత జాన్‌ను కూడా అనుమానించిన ఆమె అతడిని పరీక్షించే ఉద్దేశంతో చాటింగ్ చేశారు. డబ్బు ఏమైనా అవసరమా? అంటూ అతడిని ప్రశ్నించారు. అతడి నుంచి ఔనంటూ సమాధానం వస్తే వెంటనే బ్లాక్ చేయాలని భావించారు. దీనికి నో అంటూ సమాధానం ఇచ్చిన సైబర్ నేరగాడు తనపై నమ్మకం కలిగేలా చేశాడు. సాధారణంగా మాట్రిమోనియల్ ఫ్రాడ్స్‌లో నేరగాళ్ళు బహుమతులు పంపుతున్నామని, తామే వస్తున్నామంటూ చెప్పడం, ఆపై విమానాశ్రయం నుంచి అంటూ కస్టమ్స్ అధికారులుగా ఫోన్లు చేయడం, పన్నుల పేరుతో డబ్బు డిపాజిట్ చేయించుకోవడం.. చేస్తుంటారనే విషయాలపై ఆమెకు అవగాహన ఉంది. వీటిలో జాన్ ఏ పంథాను అనుసరించినా దూరంగా ఉండాలని భావించారు. అయితే ఈ పంథాలకు భిన్నంగా వ్యవహరించిన సైబర్ నేరగాడు ఆమెకు టోకరా వేశాడు. ఎయిర్‌బస్ సంస్థలో భారీ స్కాం జరిగిందని, దాన్ని జీర్ణించుకోలేని నేపథ్యంలో తాను దాని నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు చెప్పాడు. సొంతంగానే కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నానని పేర్కొన్నాడు. ఆపై ఆమెకు టోకరా వేయడానికి అసలు కథ ప్రారంభించాడు. విమాన యానానికి సంబంధించి తన ప్రాజెక్టులో అనేక మంది దినసరి కూలీలు పని చేస్తున్నారని, వారికి రోజువారీ చెల్లింపులు ఇబ్బందిగా ఉందని చెప్పాడు. దీనికోసం 10 వేల డాలర్లు అప్పుగా ఇవ్వాలంటూ కోరాడు. అంత మొత్తం తన వద్ద లేవని చెప్పిన యువతి రూ.2 లక్షలు పంపింది. అతడు మోసం చేస్తే చందా ఇచ్చానని భావించాలని ఆమె అనుకున్నారు. ఉద్యోగి చనిపోయాడంటూ నటన.. ఆ తర్వాత మూడు నెలల వరకు జాన్ నుంచి డబ్బు ప్రస్తావన రాలేదు. ఓ రోజు వాట్సాప్ కాల్ చేసిన జాన్... తన వద్ద పని చేసే ఓ ఉద్యోగి చనిపోయాడని, అతనికి ఇన్సూరెన్స్ చేయించక పొరపాటు చేశానంటూ ఏడుస్తున్నట్లు మాట్లాడాడు. దీంతో తనకు ఇబ్బందులు ఎదురుకానున్నాయని, తాను త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఇబ్బంది తనకు అడ్డంకిగా మారుతుందని వాపోయాడు. ఈ మాట లు నమ్మిన బాధితురాలు వివిధ దఫాల్లో రూ.7.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ మరో కారణం చెబుతూ డబ్బు ప్రస్తావన రావడంతో ఆమె అనుమానించారు. అతడి ఫోన్ నంబర్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా.. అనేక మంది బాధితులు పెట్టిన కామెంట్ ఆమె దృష్టికి వచ్చాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న జి.వెంకట రామిరెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వాడిన ఫోన్ నంబర్, బాధితురాలు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితుడు నైజీరియన్ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. -
వితంతు మహిళకు బురిడీ
పెళ్లి సంబంధాల వ్యవహారం పేరయ్యలను దాటి ఇంటర్నెట్లోకి ప్రవేశించాక మోసగాళ్ల పంట పడింది. పెద్ద చదువులు, ఉన్నత కుటుంబం, మంచి ఉద్యోగం, విదేశాల్లో జీవితం అని మాయమాటలతో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. వారి మాటలను నమ్మి ఇట్టే డబ్బు, బంగారం ఇవ్వవద్దు, జాగ్రత్తగా వ్యవహరించాలనిపోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, బనశంకరి: వధూవరుల అన్వేషణ వెబ్సైట్లలో వంచకుల హవా పెచ్చుమీరింది. అందమైన ఫోటోలు, పేరుపొందిన కంపెనీలు, ఉన్నత ఉద్యోగాలు, భారీ వేతనం, విదేశాల్లో నివాసం అని నమ్మించి అమాయకులను నిలువునా దోచుకుంటుననారు. అనేకమంది బాధితులు చెప్పుకుంటే పరువు పోతుందని మోసాన్ని బయటపెట్టడంలేదు. అయినప్పటికీ ఇటీవల సైబర్‌క్రైం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీనిని బట్టి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ బాధితుల సంఖ్య పెరిగింది. ఎలా జరుగుతోంది ముఖ్యంగా పురుష మోసగాళ్లు.. యువతులను, మహిళలకు వలవేసి వంచనకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్టవేయాలని పెళ్లి సంబంధాల సంస్థలు, వెబ్సైట్లకు లేఖ రాసినప్పటికీ వంచకుల హవా మాత్రం తగ్గడం లేదని సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. బంధుమిత్రుల్లో సంబంధాలు లభించని పక్షంలో కొత్త సంబంధాల కోసం కుటుంబసభ్యులు ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ సంస్థలను, వెబ్సైట్లను ఆశ్రయించడం కొంతకాలంగా ఎక్కువైంది. కొందరు విద్యావంతులు, మంచి ఉద్యోగం, శ్రీమంతులు, అందంగా ఉండే జంటతో వివాహం జరిపించాలనే ఆశతో విస్తృతంగా ఆన్లైన్లో గాలిస్తుంటారు. అలాంటివారు లక్ష్యంగా వంచకులు అందమైన యువతీ యువకుల ఫోటోలు ఆప్‌లోడ్ చేసి, విదేశాల్లో డాక్టర్లు, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలని, దండిగా జీతం, విలాసవంతమైన కార్లు, ఇళ్లు ఉన్నాయని ప్రొఫెల్ పెడతారు. తప్పుడు అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అప్లోడ్ చేస్తారు. అక్కడినుంచి మోసం మొదలవుతుంది. యువతీయువకుల తల్లిదండ్రులు ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు, తీయని మాయమాటలతో వలలో మరిన్ని అబద్దాలతో అమాయకులను, కుటుంబసభ్యులను బుట్టలో వేసుకుంటారు. తమదీ మీ కులమేనని, పెళ్లికి రెడీ అని నమ్మించి, అత్యవసర పని పడిందని, పాస్పోర్ట్స్, వీసాలు, విలువైన గిప్టులు, పార్శిల్ పంపించామని విమానాశ్రయంలో కస్టమ్ అధికారులకు పన్నులు చెల్లించాలని భారీగా డబ్బు అకౌంట్లలో వేయించుకుని పత్తా లేకుండా పోతారు. వితంతుకు బురిడీ నగరంలో ఇటీవల మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న 49 ఏళ్ల వితంతు మహిళకు ఒక స్టీల్ కంపెనీ పారిశ్రామికవేత్త అని వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మరుసటిరోజు కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె వద్ద 70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు తీసుకుని పత్తా లేడు. బాధితురాలు జీవన బీమానగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతులు, మహిళలే అధికం వంచకుల బుట్టలో పడేవారిలో ఉద్యోగస్తులు, యువతి లేదా వితంతువు మహిళలు అధికం. పేరుపొందిన కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరి చేతినిండా డబ్బు సంపాదించి వైవాహిక జీవితంపై చాలా ఆశలు, కలల్లో ఉంటారు. కుటుంబసభ్యులు, బందువుల మాటలను లెక్కచేయకుండా వెబ్సైట్లలో సంబంధాలను గాలిస్తూ వంచకుల చేతుల్లో మోసపోతున్నారు. రెండో పెళ్లి చేసుకోవాలనుకునే మహిళలు సులభంగా వలలో చిక్కుకుంటున్నారు. అమాయక యువకులకు అర్ద నగ్న ఫోటోలు సేకరించి, వాటిని ఇంటర్నెట్లో పెడతామని బెదిరించడం, సాధ్యమైనంత దండుకోవడం వంటి కేసులు నమోదవుతున్నాయి. అప్రమత్తత అవసరం ♦ మ్యాట్రిమోనియల్ సైట్లో వ్యవహారాలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి ♦ తల్లిదండ్రుల సమక్షంలో ముఖాముఖి కూర్చుని చర్చలు జరపాలి ♦ ఒకటికి రెండుసార్లు పూర్తి వివరాలు, సమాచారం సేకరించాలి ♦ నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వరాదు ♦ తీయని మాయమాటలకు మోసపోవద్దు -
మ్యాట్రిమొని వెబ్సైట్లో చూసి
కర్ణాటక, బనశంకరి:‘హలో నేను మీ కులం వాడినే. మాది మీ ఊరే. మనిద్దరం పెళ్లి చేసుకుంటే చక్కని జంట అవుతాం’అని నమ్మించి ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీ మహిళా ఐటీ ఇంజనీరుకు రూ.24 లక్షలు బురిడీ వేసిన సంఘటన నగరంలో వెలుగుచూసింది. బాధితురాలు న్యాయంకోసం వనితా సహాయవాణిని ఆశ్రయించింది. మ్యాట్రిమొని వెబ్సైట్లో చూసి వివరాలు.. ఉత్తరకన్నడ జిల్లాకు చెందిన యువతి ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో టెక్కీ. ఆమె వివాహ సంబంధాల కోసం తన వివరాలను ఒక మ్యాట్రిమొని వెబ్సైట్లో నమోదు చేయగా, 28 ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు. వైట్‌ఫీల్డ్‌లో ఉన్న ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగి అని పరిచయం చేసుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ మీ మాట తీరు, ప్రవర్తన ఎంతో నచ్చిందని, తాను కూడా ఉత్తర కన్నడ జిల్లాకు చెందినవాడినే మీ కులానికి చెందిన వాడినేనని ఆమెను బుట్టలో వేసుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడడం, కలవడం చేసేవాడు. మన భవిష్యత్ కోసం ఒక ప్లాట్ చూశానని, కొంచెం డబ్బు తక్కువగా ఉంది అని చెప్పి ఆమె నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. అలా 13 సార్లు యువతి నుంచి డబ్బు లాగేశాడు. అనంతరం మార్కెట్లోకి కొత్తకారు వచ్చిందంటూ దాని కొనుగోలు కోసం ఆమె నుంచి డబ్బు తీసుకున్నాడు. యువతి పేరుతో క్రెడిట్‌కార్డు కూడా తీసుకుని ఇష్టానుసారం కొనుగోళ్లు చేశాడు. ఇలా మొత్తం రూ.24 లక్షలను ఆమె నుంచి దోచుకున్నాడు. డబ్బు లేదనడంతో.. మే నెలలో యువతి తన వద్ద ఇక డబ్బు లేదని, ఇవ్వలేనని చెప్పడంతో అప్పటి నుంచి మోసగాడు ముఖం చాటేశాడు. యువతి ఫోన్ చేస్తే తప్పించుకుని తిరగాడు. ఇతడి ప్రవర్తన పట్ల అమానంతో అతని ఫేస్బుక్ ఖాతాలోని స్నేహితున్ని విచారించగా ఇతనికి గతంలోనే పెళ్లయినట్లు తెలిసింది.దీంతో బాధిత యువతి మహిళా సహాయవాణికి ఫిర్యాదు చేసింది. సహాయవాణి చీప్ రాణిశెట్టి, మోసగానికి ఫోన్ చేసి కౌన్సిలింగ్ కు రావాలని చెప్పారు. వస్తానని తెలిపిన వంచకుడు నెలరోజులు గడిచినా ఇంకా రాలేదు. ఇతడిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు రాణిశెట్టి సూచించారు. -
మాట్రి‘మోసగాడు’!
సాక్షి, సిటీబ్యూరో: నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిస్థిరపడిన ఓ నైజీరియన్ మాట్రిమోనియల్ సైట్ ఆధారంగా నగరానికి చెందిన యువతిని మోసం చేశాడు. తాను లండన్‌లో ఉంటున్నట్లు నమ్మించి వివాహం, బహుమతుల పేరుతో రూ.16.37 లక్షలు గుంజాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడైన ఒనియనోర్ ఎలోనియం బ్రైట్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం వెల్లడించారు. నైజీరియా నుంచి వలసవచ్చిన ఒనియనోర్ పశ్చిమ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఇతడు జీవన్సాథీ.కామ్ అనే మాట్రిమోనియల్ సైట్లో తాను లండన్‌లో ఉంటున్నట్లు, తన పేరు బాసిమ్కరీం అని ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. నగరానికి చెందిన యువతి ప్రొఫైల్‌ను లైక్ చేసిన అతడు ఆమెతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఓ దశలో వివాహం చేసుకుందామంటూ ప్రతిపాదించాడు. హఠాత్తుగా తాను తన వద్ద ఉన్న భారీ నగదు, బహుమతులతో ఇండియా వస్తున్నానని సమాచారం ఇచ్చాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులం అంటూ అతడి అనుచరులు ఈ యువతికి కాల్ చేశారు. కరీం అనే వ్యక్తి లండన్ నుంచి వచ్చాడని, వస్తూ విలువైన వస్తువులు తేవడంతో ఆపేశామని చెప్పారు. ఆ వస్తువులు, నగదుతో సహా పంపాలంటే పన్ను చెల్లించాలన్నారు. ఆమె ఈ మాటలు నమ్మడంతో వివిధ పన్నుల పేర్లు చెప్పి దఫదఫాలుగా రూ.16.37 లక్షలు గుంజారు. మోసపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒనియనోర్ నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
మ్యాట్రి‘మనీ’ మోసాలు
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లిళ్లకు ఆన్లైన్ వేదికైన మ్యాట్రిమోనియల్ సైట్లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ సృష్టించి యువతులను మోసం చేస్తున్న పలువురు ఎన్నారైలు, సిటీవాసులపై సైబరాబాద్ షీ బృందాలు కేసులు నమోదు చేశాయి. గతంలోనే వివాహం జరిగినా విషయం దాచి పెళ్లి పేరుతో యువతులతో సన్నిహిత్యం పెంచుకొని, అదే నమ్మకంతో భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం డబ్బుల కోసమే మ్యాట్రిమోనీ సైట్లో తప్పుడు ప్రొఫైల్స్‌తో యువతులకు వల వేసి మోసం చేస్తున్నట్లు పలు కేసులు స్పష్టం చేస్తున్నాయని షీటీమ్స్ ఇన్చార్జి అనసూయ అన్నారు. ఈ విషయంలో యువతులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వరుడిని నేరుగా కలిసి అన్నీ వివరాలు తెలుసుకున్న తర్వాతే పెళ్లి విషయంలో అడుగు ముందుకు వేయాలని ఆమె సూచించారు. మరో యువతితో సంబంధం కొనసాగిస్తూనే... మాదాపూర్‌కు చెందిన ఓ యువతి భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం కొత్త జీవితం కోసం మ్యాట్రిమోనీలో డైవోర్స్డ్ పీపుల్స్ పేజీలో రిజిష్టర్ చేసుకుంది. అదే సైట్లో రిజిష్టరైన ఎన్ఆర్ఐ ప్రవీణ్ కుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నానని తాను కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రొఫైల్‌లో పొందుపరిచాడు. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవడంతో పాటు ఆరు నెలల పాటు వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులకు అతడిని పరిచయం చేయడంతో పెళ్లికి అంగీకరించారు. అయితే అతను ఇండియాకు రాకపోవడంతో బాధితురాలే అతడిని కలిసేందుకు దుబాయ్‌కి వెళ్లింది. ఆమెతో నెలరోజుల పాటు హోటల్ గదిలో సహజీవనం చేశాడు. అదే సమయంలో అతను మరో యువతితో సెల్ఫోన్లో చాటింగ్ చేస్తుండటాన్ని గుర్తించిన బాధితురాలు తనను మోసం చేశాడంటూ సైబరాబాద్ షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో రూ.లక్షలు వసూలు... అల్కపూరి టౌన్‌షిప్‌కు చెందిన బాధితురాలు 2017లో భర్త నుంచి విడాకులు తీసుకొంది. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. అప్పటికే ఆ సైట్లో రిజిస్టర్ చేసుకున్న నిందితుడు ఈమె ప్రొఫైల్‌ను లైక్ చేశాడు. సొంత వ్యాపారం చేస్తున్న తాను ఆర్థికంగా బాగున్నట్లు నమ్మబలికాడు. రోజూ సెల్లో చాటింగ్ చేస్తూ తన కుటుంబసభ్యులందరినీ పరిచయం చేశాడు. కొన్ని రోజుల తర్వాత కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నానని కొంత సహాయం చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు పలు దఫాలుగా రూ.12 లక్షలు ఇచ్చింది.ఓ రోజూ బాధితురాలి ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితు రాలుషీ బృందానికి ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ ఠాణాలో కేసు నమోదు చేసి నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తగినవాడు కాదన్నందుకు... బీహెచ్ఈఎల్ ఆశోక్‌నగర్‌కు చెందిన ఓ యువతికి ఐదు నెలల క్రితం మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా వినయ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. సెల్ఫోన్లో చాటింగ్ చేసుకోవడమేగాక పలుమార్లు వ్యక్తిగతంగా కలిశారు. అయితే అతడి ప్రవర్తన నచ్చక తనకు సరైనవాడు కాదని ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు వేరొక పెళ్లి చేయాలని నిశ్చయించారు. బాధితురాలి ఎంగేజ్మెంట్ విషయం తెలుసుకున్న నిందితుడు ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయడంతో నిశ్చితార్థం ఆగిపోయింది. తనను కలిసినప్పుడు సెల్ఫోన్లో తీసిన ఫొటోలు, చాటింగ్ మెసేజ్‌లను చూపించి బెదిరించడంతో బాధితురాలి షీ బృందానికి ఫిర్యాదు చేసింది. ఆర్సీపురం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారంతో మోసం... షాపూర్‌నగర్‌కు చెందిన యువతి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఓ వ్యక్తి ప్రొఫైల్ నచ్చడంతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. నిశ్చితార్థం సమయంలో సొంతిళ్లు ఉందని, ఇసుక వ్యాపారం చేస్తానని చెప్పిన నిందితుడు రోజుకు రూ.6వేల ఆదాయం ఉంటుందని నమ్మించాడు. అయితే మూడురోజుల తర్వాత బాధితురాలి తల్లిదం డ్రులు నిందితుడి తల్లిని సంప్రదించగా ఇల్లు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పింది.దీంతో అనుమానం వచ్చిన వారు విచారణ చేయగా నిందితుడికి ఎలాంటి ఆదాయం లేదని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలడంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో తననే పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఆమె నగ్నచిత్రాలను సృష్టించి ఇతరులకు పంపుతానంటూ బెదిరించడంతో బాధితురాలు షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. జీడిమెట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానంటూ... కొండాపూర్‌కు చెందిన బాధితురాలికి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను ఆమెను ఢిల్లీకి పిలిపించాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెను కలిసి గుర్గావ్లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. వారం రోజుల పాటు అక్కడే ఉంచుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌కు వచ్చి పెళ్లి చేసుకుంటానని అతను తిరిగిరాకపోవడంతో బాధితురాలు నేరుగా గుర్గావ్లోని అతడి ప్లాట్‌కు వెళ్లింది. తాను గర్భవతిని అని చెప్పడంతో మాత్రలు ఇచ్చి అబార్షన్ అయ్యేలా చూశాడు. ఆ తర్వాత అతడికి అప్పటికే వివాహం జరిగిందని, కుమార్తె కూడా ఉన్నట్లు తెలుసుకున్న బాధితురాలు షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. -
పెళ్లి చూపులూ ‘ఫిక్స్’ చేశారు..
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలు కావాలంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు జారీ చేయడం... ఆసక్తి చూపిన వారితో తియ్యగా మాట్లాడి పూర్తి నమ్మకం కలిగించడం... ఆపై గిఫ్ట్‌లు పంపిస్తున్నానంటూ చెప్పి, పన్నుల పేరుతో దండుకోవడం... ఏళ్లుగా సాగుతున్న ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్‌లో పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమార్తె మాత్రమే బాధితులుగా ఉంటారు. ఇటీవల ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు మరో అడుగు ముందుకు వేశారు. విదేశీ పెళ్లి కుమార్తె పేరు చెప్పి స్వదేశీ పెళ్లి కుమారుడి తండ్రి నుంచి రూ.80 వేలు కాజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు స్థానిక గ్యాంగ్ ప్రమేయాన్ని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ‘లైక్’ చేయడంతో షురూ..... నగరానికి చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన తెలుగు మ్యాట్రిమోనీ.కామ్‌లోనూ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో నిహారికారెడ్డి పేరుతో వచ్చిన ప్రకటన అతడిని ఆకర్షించింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ పూర్తి చేసిన నిహారిక ప్రస్తుతం అమెరికాలోని హెచ్‌పీ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్లు అందులో ఉంది. ఆమె తండ్రి నారాయణరెడ్డి బెంగళూర్‌లో రెవెన్యూ ఉద్యోగి అని, తల్లి సుశీల కేంద్రీయ విద్యాలయకు వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నట్లు నేరగాళ్లు పొందుపరిచారు. వీరి స్వస్థలం నంద్యాల అని పేర్కొనడంతో ఆసక్తి చూపిన శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రొఫైల్‌ను లైక్ చేశారు. నారాయణరెడ్డి పేరుతో కాల్ చేసి... ఆ తర్వాత కొద్ది రోజులకు శ్రీనివాస్‌రెడ్డికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తాను బెంగళూరు నుంచి నారాయణరెడ్డిని మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి తన కుమార్తె నిహారిక ఇటీవల అమెరికా నుంచి వచ్చిందని, త్వరలో తిరిగి వెళ్లిపోతుందని తెలిపాడు. ఆ లోపే మంచి సంబంధం చూసి నిశ్చితార్థం సైతం చేసేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా తన కుటుంబీకులతోనూ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంతో సంప్రదింపులు జరిపించాడు. పెళ్లి కుమారుడితోనూ పెళ్లి కుమార్తె నిహారికగా చెప్పుకుంటూ ఓ యువతి మాట్లాడింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి తాము పెళ్లి చూపుల కోసం బెంగళూరు వస్తున్నట్లు నారాయణరెడ్డితో చెప్పారు. అందుకు ఆనందంగా అంగీకరించినట్లు నారాయణరెడ్డి అనే వ్యక్తి బిల్డప్ ఇచ్చాడు. పట్టుచీర పేరుతో స్వాహా... అప్పుడు అసలు కథ ప్రారంభించాడు. తమ ఆచారం ప్రకారం పెళ్లి చూపుల సమయంలో పెళ్లి కుమార్తె కట్టుకునే చీరను పెళ్లి కుమారుడి తరఫు వారే కొనాలని చెప్పాడు. దీనికోసమంటూ నగదు కోరడంతో శ్రీనివాస్‌రెడ్డి రెండు దఫాల్లో రూ.80 వేలు నారాయణరెడ్డిగా చెప్పుకున్న వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశాడు. పెళ్లి చూపుల కోసం గత నెల 24న రమ్మంటూ నారాయణరెడ్డి ఆహ్వానిస్తూ బెంగళూరులోని చిరునామా సైతం ఇచ్చాడు. ఆ రోజు అక్కడకు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అది బోగస్ చిరునామాగా గుర్తించారు. వారి తరఫు ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో తాము మోసపోయినట్లు గుర్తించారు. తిరిగి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీసా పేరుతో రూ.7.66 లక్షలు... కెనడాకు వీసాతో పాటు ఉద్యోగం సైతం ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.7.66 లక్షలు కాజేశారు. భోలక్‌పూర్‌లోని కృష్ణానగర్‌కు చెందిన శ్రీకాంత్ నిరుద్యోగి. విదేశాల్లో సూపర్వైజర్ ఉద్యోగం కోసం ఆయన క్వికర్.కామ్‌లో తన బయోడేటాను అప్లోడ్ చేశారు. దీనికి స్పందనగా జేమ్స్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. శ్రీకాంత్‌ను మూడు రౌండ్ల టెలిఫోన్ ఇంటర్వ్యూ సైతం చేశాడు. ఆపై కెనడాలో సూపర్వైజర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు చెప్పిన జేమ్స్ వీసా, వర్క్ పర్మిట్ కోసం అయ్యే ఖర్చు నీవే భరించాలంటూ చెప్పడంతో శ్రీకాంత్ అంగీకరించాడు. దీంతో కొన్ని డాక్యుమెంట్లు సైతం పంపించిన జేమ్స్... విమాన టిక్కెట్లు కూడా బుక్ చేశానంటూ బోగస్‌వి స్కాన్ చేసి ఈ–మెయిల్ చేశాడు. ఆపై వివిధ ఫీజులు, పన్నుల పేరుతో రూ.7,66,900 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై ఇండియన్ వీసా అధికారినంటూ శ్రీకాంత్‌కు కాల్ వచ్చింది. అతడు చండీఘడ్ నుంచి కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ చెప్పాడు. ఈ నెల 1న అందుకు సిద్ధమైన శ్రీకాంత్ కెనడా ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా వివరాలు లేకపోవడంతో. తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
మాయ లేడీ
► మాట్రిమోనియల్ పేరుతో మోసం ► అందమైన యువతి ఫొటోతో ప్రొఫైల్ ► పెళ్లి పేరుతో సిటీకి చెందిన ఇద్దరికి టోకరా ► అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: అందమైన ఫొటోలు పెట్టడం... లేని విద్యార్హతలు, ఆస్తుల్ని ఆపాదించుకోవడం... వీటి ఆధారంగా మాట్రిమోనియల్ సైట్లలో ప్రొఫైల్స్ క్రియేట్ చెయ్యడం... ఆకర్షితులైన యువతుల్ని నిలువునా ముంచడం... ఇలాంటి మోసాలకు పాల్పడిన అరెస్టైన యువకుల కేసుల్ని ఇప్పటి వరకు చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్సయ్యింది. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఇదే పంథాను అనుసరిస్తూ దేశ వ్యాప్తంగా 2600 మందికి గాలం వేసింది. ఈమె చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ మోసపోయారు. దీంతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సదరు యువతిని బుధవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన శ్రీలత అనే యువతి మాట్రిమోనియల్ సైట్ ఆధారంగా భారీ మోసానికి తెరలేపింది. తన పేరును సుస్మితగా పేర్కొంటూ ఇంటర్నెట్ నుంచి అందమైన యువతి ఫొటో డౌన్లోడ్ చేసుకుంది. వీటిని వినియోగించి ఓ మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. 2600 మందికి టోకరా ఆ ప్రొఫైల్‌లో తనను హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువతిగా పేర్కొన్న శ్రీలత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తోందని పేర్కొంది. దీంతో ఆమె ప్రొఫైల్‌లో దేశ వ్యాప్తంగా 2600 మంది లైక్ చేయడంతో పాటు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అలా ఆకర్షితులైన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ ఉన్నారు. సిటీకి చెందిన ఓ యువకుడితో కొన్ని రోజుల పాటు ఫోన్లో మాట్లాడిన ‘సుస్మిత’ తనపై నమ్మకం పెంచుకుంది. హఠాత్తుగా ఓ రోజు తన పర్సు పోగొట్టుకున్నానంటూ రూ.40 వేలు అడిగింది. అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన సదరు యువకుడు నగదు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు అడగటంతో అనుమానం వచ్చిన అతను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు డబ్బు డిపాజిట్ అయిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. సోదరుడి ఖాతాతో డబ్బు వసూలు ‘సుస్మిత’ డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తన సోదరుడి ఖాతాను వాడింది. దీన్ని పోలీసులు ఫ్రీజ్ చేయించడంతో కంగుతిన్న అతడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి డీ–ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరాడు. నగర యువకుడితో సంభాషించడానికి సుస్మిత వాడిన ఫోన్ నెంబర్‌ను ఇతడికి చూపించిన అధికారులు ఆరా తీయగా... తన సోదరికి చెందినదిగా పేర్కొంటూ శ్రీలత ఫోటో చూపించాడు. దీన్ని చూసిన బాధితుడు ఒకింత షాక్‌కు లోనయ్యాడు. ఈ దర్యాప్తు సాగుతుండగానే నగరానికి చెందిన మరో ‘సుస్మిత’ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొంతకాలం మాట్లాడిన ఆమె తన సమీప బంధువు చనిపోయాడంటూ రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసుల్ని నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపారు. బుధవారం శ్రీలతను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈమె మా ట్రిమోనియల్ ప్రొఫైల్‌పై 2600 మంది ఆకర్షితులు కావడంతో వారిలో ఎందరు బాధితులుగా మారారనేదానిపై ఆరా తీస్తున్నారు.