మాట్రిమోనియల్‌ మోసం: పోలీసుల నిర్లక్ష్యమే చంపేసింది!  | Matrimonial Fraud: Woman Commit Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

మాట్రిమోనియల్‌ మోసం: పోలీసుల నిర్లక్ష్యమే చంపేసింది! 

Published Thu, Sep 23 2021 1:16 PM | Last Updated on Thu, Sep 23 2021 1:29 PM

Matrimonial Fraud: Woman Commit Suicide In Hyderabad - Sakshi

నిందితుడు కిరణ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్‌): విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు మాట్రిమోనియల్‌ సైట్స్‌ ద్వారా టార్గెట్‌ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నిందితుడు కిరణ్‌కుమార్‌ను పట్టుకోవడంలో సైబరాబాద్‌ పోలీసులు విఫలమయ్యారు. అతడి చేతిలో మోసపోయిన ఓ అభాగ్యురాలు అవమానభారం తట్టుకోలేక కన్న కొడుకు ముందే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

నిందితుడిని పట్టుకోవడంలో ఆలస్యం ఎందుకైందంటూ మృతురాలి కుటుంబీకులు బాచుపల్లి పోలీసులను నిలదీశారు. బందోబస్తు విధులే కారణమంటూ అధికారులు తప్పించుకోవాలని చూస్తున్నారని మృతురాలి కుటుంబీకులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. దాదాపు 14 మందిని ఇదే పంథాలో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్‌ కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి రాచకొండ పరిధిలోని నాచారం ఠాణాకు మరో బాధితురాలు వెళ్లింది. అక్కడ ఆమెకూ అవమానమే ఎదురైంది.  

వరుసగా మోసాలు చేసిన కిరణ్‌.. 
ములుగు జిల్లా ఇంచర్లకు చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్‌ రెడ్డి(29) హైదరాబాద్‌లోని ఎల్‌అండ్‌టీ కంపెనీలో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. వివిధ మాట్రిమోనియల్‌ సైట్స్‌లో రెండో వివాహం అంటూ రిజిస్టర్‌ చేసుకున్నాడు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలు, వితంతు మహిళలను ఆకర్షించాడు. వారికి రకరకాల సమస్యలు చెప్పి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటాడు. ఇప్పటికి 14 మంది మహిళల నుంచి రూ.30 లక్షల నగదు, 10 తులాల ఆభరణాలు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

► కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి భర్తకు దూరంగా ఉంటూ నిజాంపేటలో కుటుంబీకులతో కలిసి ఉండేది. కిరణ్‌ బారినపడిన ఈ బాధితురాలు రూ.3.12 లక్షలు మోసపోయింది. దీనిపై గత నెల 22న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆపై ఈ కేసును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ‘ఒంటరి మహిళలే టార్గెట్‌’ శీర్షికన ఈ నెల 9న కథనం ప్రచురించింది. అయినప్పటికీ పోలీసుల్లో స్పందన లేకపోవడంతో ఠాణా చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ‘మహిళల రక్షణకు కీలక ప్రాధాన్యం ఇస్తాం.. మహిళలపై జరిగే నేరాలను ఉపేక్షించం’ పోలీసులు చేసే ఇలాంటి ప్రకటనలు నిజమని నమ్మిన బాధితురాలికి నిరాశే ఎదురైంది.  

విసిగి వేసారి తనువు చాలించింది.. 
అప్పటికే దురలవాట్లకు బానిసైన భర్తకు దూరంగా ఉండటం, కుమారుడి పోషణ బాధ్యతలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. మరోపక్క కిరణ్‌కుమార్‌ చేతిలో దారుణంగా మోసపోయి మరింత కుంగిపోయింది. కేసు నమోదు చేసినా నిందితుడిని పట్టుకోకపోవడంతో పోలీసులు నిర్లక్ష్యం వహించడాన్ని అవమానంగా భావించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకుంది.  

► ఈమె తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం ఆమెతో పాటు అమ్మమ్మ ఆసుపత్రికి వెళ్లారు. అలా ఇంట్లో ఒంటరిగా మిగిలిన బాధితురాలు తన కుమారుడు చూస్తుండగానే బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన తల్లి, అమ్మమ్మలకు మనవడు ఏడుస్తూ కనిపించాడు. దీంతో ఆందోళకు గురైన వాళ్లు లోపలకు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వారిద్దరూ గుండెలు బాదుకుంటూ స్థానికులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి మృతదేహాన్ని కిందికి దింపారు.  
► తండ్రి దూరమై.. తల్లి మరణించడంతో ఇప్పుడు ఆ ఐదేళ్ల చిన్నారి అనాథగా మారాడు. ఈమె లాగే కిరణ్‌ చేతిలో మోసపోయిన మరో బాధితురాలు నాచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇటీవల వెళ్లారు. ఆమెకూ అక్కడ ఛీత్కారాలే ఎదురయ్యాయి. ‘మీలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి. వాడికి డబ్బులు ఎందుకిచ్చావు’ అంటూ అక్కడి పోలీసులు తనను అవమానించారని ఆమె ‘సాక్షి’కి తెలిపారు.  

చదవండి: వన్‌డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టు బాత్రూంలో స్పై క్యామ్‌: వెలుగులోకి సంచలన విషయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement