సాక్షి, సిటీబ్యూరో: నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిస్థిరపడిన ఓ నైజీరియన్ మాట్రిమోనియల్ సైట్ ఆధారంగా నగరానికి చెందిన యువతిని మోసం చేశాడు. తాను లండన్‌లో ఉంటున్నట్లు నమ్మించి వివాహం, బహుమతుల పేరుతో రూ.16.37 లక్షలు గుంజాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడైన ఒనియనోర్ ఎలోనియం బ్రైట్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం వెల్లడించారు. నైజీరియా నుంచి వలసవచ్చిన ఒనియనోర్ పశ్చిమ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఇతడు జీవన్‌సాథీ.కామ్ అనే మాట్రిమోనియల్ సైట్‌లో తాను లండన్‌లో ఉంటున్నట్లు, తన పేరు బాసిమ్‌కరీం అని ప్రొఫైల్ క్రియేట్ చేశాడు.
నగరానికి చెందిన యువతి ప్రొఫైల్‌ను లైక్ చేసిన అతడు ఆమెతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఓ దశలో వివాహం చేసుకుందామంటూ ప్రతిపాదించాడు. హఠాత్తుగా తాను తన వద్ద ఉన్న భారీ నగదు, బహుమతులతో ఇండియా వస్తున్నానని సమాచారం ఇచ్చాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులం అంటూ అతడి అనుచరులు ఈ యువతికి కాల్ చేశారు. కరీం అనే వ్యక్తి లండన్ నుంచి వచ్చాడని, వస్తూ విలువైన వస్తువులు తేవడంతో ఆపేశామని చెప్పారు. ఆ వస్తువులు, నగదుతో సహా పంపాలంటే పన్ను చెల్లించాలన్నారు. ఆమె ఈ మాటలు నమ్మడంతో వివిధ పన్నుల పేర్లు చెప్పి దఫదఫాలుగా రూ.16.37 లక్షలు గుంజారు. మోసపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒనియనోర్ నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment