సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా లండన్‌లో నివసిస్తున్న కృష్ణకుమార్‌గా నగర యువతికి పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి, కస్టమ్స్ అధికారుల డ్రామా ఆడి రూ.10.65 లక్షలు కాజేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన ఆఫ్రికా జాతీయుడు కాబ్రెల్ ఎడ్మాండో సైబరాబాద్ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. జీడిమెట్లకు చెందిన వ్యాపారి నుంచి గతేడాది రూ.46.35 కాజేసింది కూడా ఇతడేనని ఇన్‌స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ గుర్తించారు. దీంతో ఇతడిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
- కాబ్రెల్ కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్‌లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు.
- జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వ్యాపారి మనోహర్‌కు గతేడాది మే 13న వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. లండన్‌లోని బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన ఎలిజిబెత్ జియోబార్జ్ పేరుతో ఇది వచ్చింది. తమ కంపెనీకి భారత్ నుంచి నిత్యం బయాస్మా యాక్టివ్ లిక్విడ్ సరఫరా అవుతుందని అందులో పేర్కొన్నాడు.
- దీన్ని తమకు నాగ్‌పూర్ కేంద్రంగా పని చేసే కేఎస్ ఎంటర్‌ప్రైజెస్ సరఫరా చేస్తోందని జియోబార్జ్ చెప్పాడు. అనివార్య కారణాల వల్ల తాము నేరుగా ఖరీదు చేయలేకపోతున్నామన్నాడు. ఆ సంస్థ నుంచి మీరు సమీకరించుకుని మాకు సరఫరా చేస్తే లీటర్ రూ.95 వేలకు ఖరీదు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ 300 లీటర్లకు పర్చేజ్ ఆర్డర్ కూడా పంపాడు.
- ఇది చూసిన మనోహర్ కేఎస్ ఎంటర్‌ప్రైజెస్ వివరాలు కోరాడు. జియోబార్జ్ రెండు ఫోన్ నెంబర్లను పంపాడు. బాధితుడు వీటిలో సంప్రదించగా ఆ సంస్థకు చెందిన వారుగా ఇద్దరు మాట్లాడారు. తనకు ఒక లీటర్ బయాస్మా యాక్టివ్ లిక్విడ్ పంపాలని కోరడంతో వాళ్లు పంపారు. దీన్ని ఈయన జియోబార్జ్ చెప్పిన వారికి మహారాష్ట్రలోనే అందించాడు.
- బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులుగా చెప్పుకున్న వాళ్లు సదరు ఆయిల్ పరీక్షించామని, నాణ్యమైనదిగా తేలిందని చెప్పారు. తొలిదఫా 300 లీటర్లు పంపితే లండన్ చేరుస్తామన్నారు. దీంతో మనోహర్ మళ్లీ కేఎస్ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించారు. తనకు ఆ పరిమాణంలో బయాస్మా యాక్టివ్ లిక్విడ్ కావాలని ఆర్డర్ చేశాడు.
- దీని నిమిత్తమంటూ ఆయన నుంచి రూ.46,35,600 ఆన్‌లైన్‌లో కాజేసిన నిందితులు ఆపై తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిపై బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది అక్టోబర్ 14న కేసు నమోదైంది. కాబ్రెల్ ఎడ్మాండో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.
- ఇతడిని విచారించిన నేపథ్యంలోనే అప్పట్లో జియోబార్జ్‌గా నగదు కాజేసింది సైతం ఇతడేనని బయటపడింది. ఇతడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం సిటీ సైబర్ కాప్స్ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇది పూర్తయిన తర్వాత సైబరాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు.
(చదవండి: చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం)
Comments
Please login to add a commentAdd a comment