ప్రపంచం 21వ శతాబ్దంలో ఉంది. విశ్వమంతా అరచేతిలో ఇమిడిపోయినంత టెక్నాలజీతో స్మార్ట్‌గా జీవిస్తోంది ప్రపంచం. మదిలో మెదిలిన సందేహానికి సమాధానాన్ని నిమిషంలో తెలుసుకోగలిగినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయినప్పటికీ గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియని జీవితాలు ఇంకా ఉన్నాయి.
భారతీయ సైన్యంలో మహిళల బృందం ఇటీవల వారిని సమావేశపరిచి ప్రెగ్నెన్సీ అవేర్‌నెస్ సెషన్ నిర్వహించింది. అత్యంత ఆసక్తిగా వినడంతోపాటు ఇంత వరకు తమకు ఈ సంగతులు చెప్పిన వాళ్లు లేరని, మొదటిసారి వింటున్నామని ఆనందం వ్యక్తం చేశారా మహిళలు. ఇంతకీ ఇంతటి వెనుకబాటులో మగ్గిపోతున్న వాళ్లెవరంటే ఆఫ్రికా ఖండంలోని అబేయీ వాసులు.
ఆల్ ఉమెన్ ప్లాటూన్ చొరవ
సూడాన్, సౌత్ సూడాన్‌ల మధ్య తలెత్తిన వివాదంలో అబేయీ నలిగిపోతోంది. అబేయీలో శాంతి స్థాపన కోసం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనదేశం నుంచి గత ఏడాది ఆల్ ఉమెన్ ప్లాటూన్ అబేయీలో అడుగుపెట్టింది. ఆ బృందం పేరు ‘యునైటెడ్ నేషన్స్ ఇంటిరిమ్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ అబేయీ (యూనిస్‌ఫా)’. మన మహిళా సైనికులు అబేయీలో శాంతి స్థాపనతోపాటు ప్రజారోగ్యం కోసం కూడా పని చేస్తోంది.
అందులో భాగంగా కెప్టెన్ జస్‌ప్రీత్ కౌర్, ఇండియన్ బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ మేజర్ అభిజిత్ ఎస్‌లు అబేయీలోని రుమాజక్ గ్రామంలో స్థానిక మహిళలను సమావేశపరిచి వారికి గర్భధారణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణి తీసుకోవాల్సిన పోషకాహారం, ఈ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్‌లు, ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో తీసుకోవాల్సిన శ్రద్ధ మొదలైన విషయాలను వివరించారు.
సేఫ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ గురించి బొమ్మలతో వివరిస్తూ ప్రచురించిన చిన్న పుస్తకాలను కూడా పంచారు. భారతీయ సైనిక మహిళల బృందం చొరవను, స్థానిక మహిళల ఆనందాన్ని యూఎన్ మిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
(చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..)
Comments
Please login to add a commentAdd a comment