తండ్రిని చంపిన వాడిని హతమార్చేందుకు పోలీసుగా మారి పట్టుకోవడం వంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. ప్రతికారం తీర్చుకోవడానికి ఎలాంటి పాట్లు పడి హీరో పైకి వచ్చి విలన్‌ని చంపుతాడో చూసి హ్యాపీగా ఫీలవ్వుతాం. అంతే కానీ ఇదే ఘటన రియల్ లైఫ్‌లో జరిగితే..ఔను మీరు వింటుంది నిజమే. ఓ మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం పోలీసుగా మారింది. మరీ ఆ హంతకుడిని పట్టుకుని హీరోలా శిక్షించిందా అంటే..
ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. బ్రెజిల్‌లో రోరైమాలోని గిస్లేనే సిల్వా డి డ్యూస్ అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసుగా మారింది. దారుణ హత్యకు గురైన తండ్రికి ఎట్టకేలకు న్యాయం జరిగేలా చేసింంది. అందుకోసం ఆమె 25 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి నిందితుడిని పట్టుకుని తన కుటుంబం పడ్డ బాధకు తెరపడేలా చేసింది. అసలేం జరిగిందంటే..సదరు మహిళా పోలీసు అధికారి తండ్రి జోస్ విసెంటే ఫిబ్రవరి 1999లో జస్ట్ 20 పౌండ్ల అప్పు కోసం కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన స్థానిక బార్‌లో చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోస్ సూపర్ మార్కెట్ యజమాని.
ఆయన స్థానిక బార్‌లో తన స్నేహితుడితో కలిసి పూల్ ఆడుతున్న సమయంలో ఈ దిగ్బాంతికర ఘటన జరిగింది. తన తండ్రి మార్కెట్‌కి సంబంధించిన సరఫరదారుడు రైముండో అల్వెస్ గోమ్స్ చేతిలోనే హత్యకు గురయ్యాడు. నిజానికి గోమ్స్ తన అప్పు చెల్లించాలని డిమాండ్ చేయగా ఫ్రీజర్‌తో సరిపెట్టుకోమని సూచించాడట జోస్. అయితే అందుకు గోమ్స్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో గోమ్స్ క్షణికావేశంలో తుపాకీతో జోస్ తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో అక్కడికక్కేడే చనిపోయాడు జోస్.
అయితే 2013లో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోమ్స్‌ని పట్టుకుని 12 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ జైలు శిక్షను తప్పించుకున్నాడు. 2016లో అతని చివరి అప్పీల్‌ను తిరస్కరణకు గురై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే గోమ్స్ పట్టుబడకుండా తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇదంతా జరిగినప్పుడూ జోస్ కూతురు డ్యూస్‌కు తొమ్మిదేళ్లు. అప్పుడే ఆమె నిశ్చయించుకుంది ఎలాగైన తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించాలని తీవ్రంగా నిశ్చయించుకుంది.
అందుకోసం బోయా 18 ఏళ్ల వయసుకే న్యాయశాస్త్రం అభ్యసించింది. తర్వాత పోలీసు దళంలో చేరింది. తన తండ్రిని హతమార్చిన వాడిని ఎలాగైన న్యాయస్థానానికి తీసుకురావలన్న సంకల్పంతో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించింది. నిందితుడి ఆచూకీకై అలుపెరగని పోరాటం చేసింది డ్యూస్. చివరికి నిందితుడు బోయా విస్టాకు సమీపంలో ఉన్న నోవా సిడేడ్ ప్రాంతంలోని ఒక పొలంలో దాక్కున్నట్లు గుర్తించి సెప్టెంబర్ 25న అరెస్టు చేసింది. 60 ఏళ్ల వయసులో గోమ్స్‌ని జైలుకి పంపిచాను. అంతేగాదు అతడితో నా కారణంగానే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అతడి చెంప పగిలేట్టు చెప్పగలిగాను అని ఉద్వేగంగా చెప్పింది డ్యూస్.
తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని సంకెళ్లు వేసిన క్షణంలో డ్యూస్‌కి కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చేశాయి. నిజాయితీపరుడైన తండ్రిని కోల్పోవడంతో తన కుటుంబం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో మర్చిపోలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన అమ్మ ఎట్టిపరిస్థితుల్లోనూ సరైన మార్గంలోనే పయనించండి అదే మీకు మంచి చేస్తుంది అనేది. అదే ఇవాళ నిజమయ్యింది అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది డ్యూస్. సెప్టెంబర్ 26, 2024న అల్వెస్ గోమ్స్ నేరారోపణకుగాను 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిజం నిప్పులాంటిది అంటే ఇదే కదూ..!.
(చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!)
Comments
Please login to add a commentAdd a comment