cyberabad crime police
-
బార్బర్ టు సైబర్ క్రిమినల్!
సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా లండన్‌లో నివసిస్తున్న కృష్ణకుమార్‌గా నగర యువతికి పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి, కస్టమ్స్ అధికారుల డ్రామా ఆడి రూ.10.65 లక్షలు కాజేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన ఆఫ్రికా జాతీయుడు కాబ్రెల్ ఎడ్మాండో సైబరాబాద్ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. జీడిమెట్లకు చెందిన వ్యాపారి నుంచి గతేడాది రూ.46.35 కాజేసింది కూడా ఇతడేనని ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ గుర్తించారు. దీంతో ఇతడిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబ్రెల్ కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వ్యాపారి మనోహర్‌కు గతేడాది మే 13న వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. లండన్‌లోని బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన ఎలిజిబెత్ జియోబార్జ్ పేరుతో ఇది వచ్చింది. తమ కంపెనీకి భారత్ నుంచి నిత్యం బయాస్మా యాక్టివ్ లిక్విడ్ సరఫరా అవుతుందని అందులో పేర్కొన్నాడు. దీన్ని తమకు నాగ్‌పూర్ కేంద్రంగా పని చేసే కేఎస్ ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తోందని జియోబార్జ్ చెప్పాడు. అనివార్య కారణాల వల్ల తాము నేరుగా ఖరీదు చేయలేకపోతున్నామన్నాడు. ఆ సంస్థ నుంచి మీరు సమీకరించుకుని మాకు సరఫరా చేస్తే లీటర్ రూ.95 వేలకు ఖరీదు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ 300 లీటర్లకు పర్చేజ్ ఆర్డర్ కూడా పంపాడు. ఇది చూసిన మనోహర్ కేఎస్ ఎంటర్ప్రైజెస్ వివరాలు కోరాడు. జియోబార్జ్ రెండు ఫోన్ నెంబర్లను పంపాడు. బాధితుడు వీటిలో సంప్రదించగా ఆ సంస్థకు చెందిన వారుగా ఇద్దరు మాట్లాడారు. తనకు ఒక లీటర్ బయాస్మా యాక్టివ్ లిక్విడ్ పంపాలని కోరడంతో వాళ్లు పంపారు. దీన్ని ఈయన జియోబార్జ్ చెప్పిన వారికి మహారాష్ట్రలోనే అందించాడు. బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులుగా చెప్పుకున్న వాళ్లు సదరు ఆయిల్ పరీక్షించామని, నాణ్యమైనదిగా తేలిందని చెప్పారు. తొలిదఫా 300 లీటర్లు పంపితే లండన్ చేరుస్తామన్నారు. దీంతో మనోహర్ మళ్లీ కేఎస్ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించారు. తనకు ఆ పరిమాణంలో బయాస్మా యాక్టివ్ లిక్విడ్ కావాలని ఆర్డర్ చేశాడు. దీని నిమిత్తమంటూ ఆయన నుంచి రూ.46,35,600 ఆన్లైన్లో కాజేసిన నిందితులు ఆపై తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిపై బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది అక్టోబర్ 14న కేసు నమోదైంది. కాబ్రెల్ ఎడ్మాండో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని విచారించిన నేపథ్యంలోనే అప్పట్లో జియోబార్జ్గా నగదు కాజేసింది సైతం ఇతడేనని బయటపడింది. ఇతడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం సిటీ సైబర్ కాప్స్ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇది పూర్తయిన తర్వాత సైబరాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. (చదవండి: చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం) -
స్క్రాచ్ కార్డు: అడిగినంత పంపితే కారు నీదే!
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న పది మందిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు బిహార్‌కు చెందినవారు కాగా మిగిలిన ఐదుగురు మంచిర్యాల జిల్లావాసులు. వీరి దగ్గర నుంచి 42 ఫోన్లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు, 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, 2 రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు రూ.2 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత సెప్టెంబర్‌లో దుండగుడు కార్తీక్ అనే పేరుతో ఓ వ్యక్తికి ఫోన్ చేసి అతడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత పోస్ట్ కార్డులో అతడికో స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో మీరు టాటా సఫారీ కారును గెలుచుకున్నారు అని రాసి ఉంది. కానీ కోవిడ్ వల్ల డెలివరీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. దీంతో నిందితుడు డెలివరీ, వివిధ చార్జీల కింద రూ. 45 వేల రూపాయలు పంపించమన్నాడు. బాధితుడు ఆ మత్తాన్ని అతడి ఖాతాలో జమ చేశాడు. అలా విడతల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం 95.45 వేల రూపాయలు జమ చేశాడు. అయినప్పటికీ తనకు ఇంకా డెలివరీ చేయకుండా డబ్బులు అడగటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని కుమార్‌గా గుర్తించారు. అతడు వివిధ ఈ కామర్స్ వెబ్సైట్లు షాప్‌క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, నాప్టాల్ నుంచి పలువురి ఫోన్ నంబర్లు సేకరించాడు. ఇందుకోసం ఆలోక్, తీరాంజు అనే మరో ఇద్దరు నిందితుడికి సహాయం చేశారు. వీళ్లు తరుణ్ కుమార్ మోహిత్‌తో కలిసి గిఫ్ట్ కార్డులు తయారు చేస్తారు. ఈ గిఫ్ట్ కార్డులను స్క్రాచ్ చేసి కార్డుపై ఉన్న నంబర్‌కు కాల్ చేయమని ఉంటుంది. దీంతో కస్టమర్ కాల్ చేసి మాట్లాడిన భాష ప్రకారం టెలీకాలర్స్‌లా మాట్లాడి వారిని సులువుగా నమ్మించి డబ్బులు గుంజుతారు. గిఫ్ట్ పంపకుండా మోసానికి పాల్పడుతారు. ఒక్క సైబరాబాద్‌లోనే ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయని సజ్జనార్ తెలిపారు. చదవండి: ట్రాన్స్జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ -
పోలీసుల అదుపులో నటుడు శివాజీ
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో సినిమా నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్సీఎల్టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారు. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని..ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర పన్ని..పాత తేదీతో నకిలీ షేర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తితోపాటు డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు హరి, ఏబీసీఎల్ ఫైనాన్స్ అధికారి మూర్తి, మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను పోలీసులు గుర్తించారు. ఈ- మెయిళ్ల ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాష్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ..సైబర్ క్రైం పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానంతో వాటిని వెలికి తీశారు. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో రవిప్రకాశ్‌తో పాటు శివాజీపై గతంలో పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లేందుకు శివాజీ ప్రయత్నించడంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ...’దేశం పాటి వెళ్లాలని శివాజీ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నాం. శివాజీని అరెస్ట్ చేయము. కోర్టు ఆదేశాల మేరకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశాం. శివాజీని విచారణకు సహకరించాలని కోరాం. నోటీసులు ఆధారంగా ఆయనను విచారణ చేస్తాం.’ అని తెలిపారు. ఇప్పటికే శివాజీపై లుక్ఔట్ నోటీసులు ఉన్నాయి. శివాజీ అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి రాగా...ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. శివాజీకి మరోసారి నోటీసులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరోసారి నటుడు శివాజీకి నోటీసులు జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆయనను బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి...ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని శివాజీకి సూచించారు. నోటీసులు అందుకున్న అనంతరం ఆయన పీఎస్ నుంచి వెళ్లిపోయారు. -
ఆ వీడియోలతో బ్లాక్మెయిల్: శాడిస్ట్ భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ , సిటీబ్యూరో : కుటుంబకలహాల కారణంగా దూరంగా ఉంటున్న భార్య నగ్నచిత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఒడిశాకు చెందిన ప్రభుత్వోద్యోగిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా కథనం ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన చిలకపాటి సునీల్‌కుమార్ ఒడిస్సాలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతనికి 2007లో శేర్లింగంపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులుకు వారి మధ్య మనస్పర్థలు రావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. అనంతరం సునీల్ కుమార్ విడాకులు కోరుతూ కోర్టు కెళ్లగా, భరణం చెల్లించాలంటూ బాధితురాలు విశాఖపట్నం కోర్టులో కేసు వేసింది . కోర్టుల్లో విచారణ నడుస్తుండగానే సునీల్ కుమార్ బాధితురాలిని కలిసేందుకు ప్రయత్నించాడు. తన ఉద్యోగానికి ఇబ్బంది కలిగించేలా ఉన్న కేసులను వెనక్కి తీసుకోవాలని ఆమెను బెదిరించడమేగాక అసభ్యంగా మాట్లాడాడు. ఈ నెల 11న బాధితురాలు నగ్న ఫొటోలు, వీడియోలను ఆమె సోదరుడు వాట్సాప్ నంబర్‌కు పంపాడు. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఆ ఫొటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. సదరు ఫొటోలు, వీడియోలు తన చెల్లెలు పరువును దిగజార్చేలా ఉండటంతో ఈ నెల 19న బాధితురాలి సోదరుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడి కాల్‌డేటా, ఐపీ ఆధారంగా యాదయ్యగౌడ్ నేతృత్వంలోని బృందం ఒడిశాకు వెళ్లి సునీల్‌కుమార్‌ను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
'సెంచరీ' చెంచులక్ష్మి చిక్కింది
మేడ్చల్: గడ్డం లక్ష్మి అలియాస్ చెంచులక్ష్మి ఉరఫ్ గుండ్ల పోచమ్మ. 34 ఏళ్ల ఈ మహిళ తన 14వ ఏట నుంచే దొంగతనాలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు 100 చోరీలకు పాల్పడిన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితురాలినుంచి రూ.7.75 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న చెంచు లక్ష్మికి సంబంధించిన వివరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ విభాగం ఏసీసీ ఉషారాణిలు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నగరంలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన గడ్డం లక్ష్మి అలియూస్ చెంచులక్ష్మి అలియూస్ గుండ్లపోచవ్ము (34) తన 14వ ఏట నుంచే దొంగతనాలు చేయుడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ కూలీ పనిచేస్తున్నట్లు నమ్మిస్తూ.. తాళం వేసిన ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ.. దొంగిలించిన సొమ్మును తన వదిన అరుణ అలియాస్ మంగమ్మ వద్ద దాచిపెట్టేది. గత ఏడాది నిరుడు జూలై లో మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్, వినాయుక్నగర్, వెంకటరామయ్యు కాలనీల్లో తాళం వేసి ఉన్న పలు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కువూర్, బాలానగర్ నేరవిభాగం ఏసీపీ ఉషారాణి, సైబరాబాద్ సీసీఎస్ (క్రైమ్ కంట్రోల్ స్టేషన్) సీఐ సైదులు, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరపగా.. పాత నేరస్తురాలైన చెంచులక్ష్మి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సోవువారం ఉదయుం మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో చెంచులక్ష్మి, మంగవ్ములను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. లక్ష్మి చేసే దొంగతనాల రూటే వేరు.. పగటిపూట కాలనీల్లో తిరుగుతూ రెక్కీ జరిపే లక్ష్మి.. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాను చేయాలనుకున్నట్టుగా దొంగతనానికి స్కెచ్ వేస్తుంది. రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించి చాకచక్యంగా ఇంటి ఆవరణలోకి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా తాళం పగులగొట్టి దర్జాగా ఇంట్లోకి చొరబడుతుంది. ఇంటిలోకి వెళ్లి మొదట బీరువా తాళం చెవి కోసం ఇల్లంతా వెతికి.. దొరికితే బీరువాను దోచుకోవడం.. లేదంటే ఇంట్లో ఉన్న విలువైన సామగ్రిని దోచుకెళ్లడం ఆమె స్టైల్. దొంగతనం చేసిన సొత్తును సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో ఉండే తన వదిన మంగవ్ము వద్ద దాచిపెట్టి సవుయూన్ని బట్టి వాటిని విక్రయిస్తుండేది. 100 కేసుల్లో లక్ష్మి నిందితురాలు.. మేడ్చల్, కేపీహెచ్‌బీ, దుండిగల్, శామీర్‌పేట్, జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్, వుహబూబ్‌నగర్ జిల్లా అయిజ, కర్నూలు జిల్లా చెగలవుర్రి పోలీస్స్టేషన్ల పరిధిలో లక్ష్మి గత జులై నుంచి 11 దొంగతనాలకు పాల్పడింది. గతంలో ఆమెపై హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలోని ఆసిఫ్‌నగర్, హువూయుున్నగర్, నల్లకుంట, లంగర్‌హౌజ్, వులక్‌పేట్, కుల్సుంపుర, తిరువులగిరి, బోరుున్‌పల్లి, సైబరాబాద్ పరిధిలోని చందానగర్, ఉప్పల్, వుల్కాజిగిరి, రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, సనత్‌నగర్, మెదక్ జిల్లా రావుచంద్రాపురం, వుహబూబ్‌నగర్ జిల్లా అమ్మిగనూరు పోలీస్స్టేషన్ల పరిధిలో దాదాపు 100 నేరాలకు పాల్పడి పలువూర్లు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆమెపై నాన్‌బెరుులబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. లక్ష్మిపై పీడీ యూక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
ఫేస్బుక్ కీచకుడి ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యువతులను వేధిస్తున్న బీటెక్ చదివిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురిలి ఫిర్యాదు మేరకు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నర్వ సాయి శాంతన్‌ను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..నర్వ సాయి శాంతన్ తెలిసిన అమ్మాయిలను ఫాలో అవుతూ వారి కదలికలను సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసేవాడు. టెలిఫోన్ కాల్స్‌ను కూడా రికార్డు చేసి తన కోరిక తీర్చాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. అయినా లొంగకపోవడంతో వారి పేరు మీదనే నకిలీ ఎఫ్బీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సదరు బాధిత అమ్మాయిల ఫొటోలతో పాటు అసభ్యకర వ్యాఖ్యలను పోస్ట్ చేసేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడి ఫ్లాట్‌పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది మహిళలపై అతను వేధింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. -
సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులపై కాల్పులు
అసోం: అసోంలో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులపై గురువారం ఓ ముఠా కాల్పులకు తెగబడింది. గౌహతి పల్టాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీసులపై ఆన్లైన్ కాంట్రాక్ట్ ముఠా కాల్పులకు యత్నించింది. దాంతో ప్రమాదం తప్పింది. ఈ కాల్పుల నేపథ్యంలో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు.. చాకచక్యంగా ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రేపు (శుక్రవారం) హైదరాబాద్‌కు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తరలించనున్నారు. పట్టుబడిన నిందితులు విపుల్ అలీ, భాస్కర్ చక్రవర్తిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.