సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న పది మందిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు బిహార్‌కు చెందినవారు కాగా మిగిలిన ఐదుగురు మంచిర్యాల జిల్లావాసులు. వీరి దగ్గర నుంచి 42 ఫోన్లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు, 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, 2 రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు రూ.2 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత సెప్టెంబర్‌లో దుండగుడు కార్తీక్ అనే పేరుతో ఓ వ్యక్తికి ఫోన్ చేసి అతడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత పోస్ట్ కార్డులో అతడికో స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో మీరు టాటా సఫారీ కారును గెలుచుకున్నారు అని రాసి ఉంది. కానీ కోవిడ్ వల్ల డెలివరీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. దీంతో నిందితుడు డెలివరీ, వివిధ చార్జీల కింద రూ. 45 వేల రూపాయలు పంపించమన్నాడు. బాధితుడు ఆ మత్తాన్ని అతడి ఖాతాలో జమ చేశాడు. అలా విడతల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం 95.45 వేల రూపాయలు జమ చేశాడు. అయినప్పటికీ తనకు ఇంకా డెలివరీ చేయకుండా డబ్బులు అడగటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా కీలక అంశాలు వెలుగు చూశాయి.
ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని కుమార్‌గా గుర్తించారు. అతడు వివిధ ఈ కామర్స్ వెబ్‌సైట్లు షాప్‌క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, నాప్టాల్ నుంచి పలువురి ఫోన్ నంబర్లు సేకరించాడు. ఇందుకోసం ఆలోక్, తీరాంజు అనే మరో ఇద్దరు నిందితుడికి సహాయం చేశారు. వీళ్లు తరుణ్ కుమార్ మోహిత్‌తో కలిసి గిఫ్ట్ కార్డులు తయారు చేస్తారు. ఈ గిఫ్ట్ కార్డులను స్క్రాచ్ చేసి కార్డుపై ఉన్న నంబర్‌కు కాల్ చేయమని ఉంటుంది. దీంతో కస్టమర్ కాల్ చేసి మాట్లాడిన భాష ప్రకారం టెలీకాలర్స్‌లా మాట్లాడి వారిని సులువుగా నమ్మించి డబ్బులు గుంజుతారు. గిఫ్ట్ పంపకుండా మోసానికి పాల్పడుతారు. ఒక్క సైబరాబాద్‌లోనే ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయని సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment