gift card
-
అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్ కార్డు బహుమానం
న్యూయార్క్: తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఒక్కో తుపాకీకి 500 డాలర్ల విలువైన గిఫ్ట్ కార్డు ఇస్తామని ప్రకటించి, అందుకు గాను 9 కేంద్రాలను శనివారం ఏర్పాటు చేసింది. వీటికి పౌరుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వివిధ రకాల అసాల్ట్ రైఫిళ్లు, ఘోస్ట్ గన్స్ కలిపి 3 వేలకు పైగా తుపాకులను పౌరులు అప్పగించినట్లు న్యూయార్క్ అధికారులు తెలిపారు. మొదటి ఆయుధానికి 500 డాలర్లు, ఆపై ప్రతి ఆయుధానికి 150 డాలర్ల చొప్పున అందజేశామన్నారు. బ్రూక్లిన్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మూడు గంటల్లోనే 90 గన్లను సరెండర్ చేయగా, సిరాక్యుజ్లో అత్యధికంగా 751 ఆయుధాలను అప్పగించారన్నారు. తమ వద్దకు చేరిన ప్రతి ఆయుధంతో ఒక జీవితాన్ని కాపాడినట్లే, ఒక ప్రమాదకర కాల్పుల ఘటనను నివారించినట్లేనన్నారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. ఇదేం పెళ్లి! -
గిఫ్ట్ కార్డుల పేరుతో వసూలు
చిత్తూరు అర్బన్: గిఫ్ట్‌కార్డుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కార్లు, బైక్‌లు వచ్చాయంటూ నమ్మబలికి.. జీఎస్టీ, ఎన్వోసీ తదితరాల పేర్లతో లక్షలాది రూపాయలు కొట్టేసిన బిహార్, కర్ణాటకకు చెందిన నిందితులను పోలీసులు చిత్తూరులో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వివరాలను బుధవారం చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలు.. బిహార్‌కు చెందిన ముకేశ్‌కుమార్ ఆన్లైన్ ద్వారా పలు వస్తువులు కొనుగోలు చేసిన 5 లక్షల మంది చిరునామాలను సంపాదించాడు. ప్రతి ఒక్కరి అడ్రస్‌కు ఓ ఉత్తరం, ఈ–కామర్స్ కంపెనీల స్టాంప్ ముద్రలతో గిఫ్ట్‌కార్డులు పంపించేవాడు. ఆ బహుమతిని సొంతం చేసుకునేందుకు తమను సంప్రదించాలంటూ ఆ ఉత్తరాల్లో తమ ఫోన్ నంబర్లు ఉంచేవాడు. ఇలా చిత్తూరు జిల్లాలో పలువురికి ఉత్తరాలతో పాటు గిఫ్ట్‌కార్డులు వచ్చాయి. వాటిని స్క్రాచ్ చేసి చూడగా.. కార్లు, బైకులు గెల్చుకున్నట్లు ఉంది. దీంతో వారు ఉత్తరంలోని నంబర్లకు ఫోన్ చేయగా.. కారు పంపించేందుకు గాను జీఎస్టీ కింద రూ.5 వేలు కట్టాలని నమ్మబలికారు. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన 26 మంది.. నిందితుడు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఆ సొమ్మును జమ చేశారు. ఆ తర్వాత ఎన్వోసీ కోసమని, ట్యాక్స్ చెల్లించాలని రకరకాల పేర్లతో మభ్యపెట్టి రూ.లక్షల్లో వసూలు చేశారు. చివరకు తాము మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రిషాంత్‌రెడ్డి.. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు, పెనుమూరు ఎస్ఐ అనిల్‌కుమార్ తదితర సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రధాన నిందితుడు ముకేశ్‌తో పాటు కర్ణాటకకు చెందిన సందేష్, కిరణ్, హెచ్ఎస్ కిరణ్, జైనుల్ అబిద్లను చిత్తూరులోని ఫారెస్టు రోడ్డులో పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ గిఫ్ట్‌కార్డులు, 30 సెల్ఫోన్లు, 30 ఏటీఎం కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, రూ.1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి.. నగదు రివార్డులు అందజేశారు. -
స్క్రాచ్ కార్డు: అడిగినంత పంపితే కారు నీదే!
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న పది మందిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు బిహార్‌కు చెందినవారు కాగా మిగిలిన ఐదుగురు మంచిర్యాల జిల్లావాసులు. వీరి దగ్గర నుంచి 42 ఫోన్లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు, 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, 2 రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు రూ.2 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత సెప్టెంబర్‌లో దుండగుడు కార్తీక్ అనే పేరుతో ఓ వ్యక్తికి ఫోన్ చేసి అతడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత పోస్ట్ కార్డులో అతడికో స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో మీరు టాటా సఫారీ కారును గెలుచుకున్నారు అని రాసి ఉంది. కానీ కోవిడ్ వల్ల డెలివరీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. దీంతో నిందితుడు డెలివరీ, వివిధ చార్జీల కింద రూ. 45 వేల రూపాయలు పంపించమన్నాడు. బాధితుడు ఆ మత్తాన్ని అతడి ఖాతాలో జమ చేశాడు. అలా విడతల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం 95.45 వేల రూపాయలు జమ చేశాడు. అయినప్పటికీ తనకు ఇంకా డెలివరీ చేయకుండా డబ్బులు అడగటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని కుమార్‌గా గుర్తించారు. అతడు వివిధ ఈ కామర్స్ వెబ్సైట్లు షాప్‌క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, నాప్టాల్ నుంచి పలువురి ఫోన్ నంబర్లు సేకరించాడు. ఇందుకోసం ఆలోక్, తీరాంజు అనే మరో ఇద్దరు నిందితుడికి సహాయం చేశారు. వీళ్లు తరుణ్ కుమార్ మోహిత్‌తో కలిసి గిఫ్ట్ కార్డులు తయారు చేస్తారు. ఈ గిఫ్ట్ కార్డులను స్క్రాచ్ చేసి కార్డుపై ఉన్న నంబర్‌కు కాల్ చేయమని ఉంటుంది. దీంతో కస్టమర్ కాల్ చేసి మాట్లాడిన భాష ప్రకారం టెలీకాలర్స్‌లా మాట్లాడి వారిని సులువుగా నమ్మించి డబ్బులు గుంజుతారు. గిఫ్ట్ పంపకుండా మోసానికి పాల్పడుతారు. ఒక్క సైబరాబాద్‌లోనే ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయని సజ్జనార్ తెలిపారు. చదవండి: ట్రాన్స్జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ -
2021: తెగిన బంధాలను దారికి తెద్దాం
కరోనా జపం చేస్తుండగానే ఏడాది గడిచిపోయింది. కాలం, కోవిడ్ కలిపి కొత్త విషయాలు నేర్పాయి. మనిషికి మనిషికి మధ్య దగ్గరితనాన్ని దూరం చేశాయి. ఆత్మీయ స్పర్శ అలవాటును మర్చిపోవాలని చెప్పాయి. మరి కొత్త ఏడాదిలో ఎలా..? చేతులు కలపకూడదు.. కానీ విష్ చేయాలి. ఆలింగనాలు కుదరవు.. కానీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. అందుకు ఉందో దారి. సాంకేతికతను సమర్థంగా గానీ వాడుకుంటే దూరాలను దగ్గర చేసుకోవచ్చు. తెగిన బంధాలను దారికి తెచ్చుకోవచ్చు. హీరోలు, దేవుళ్ల ఫొటోల గ్రీటింగ్ కార్డులు ఇవ్వనక్కర్లేదు.. మన ఫొటోతోనే ఓ కార్డు వాట్సాప్ చేద్దాం. హత్తుకుని విష్ చెప్పనక్కర్లేదు. ఫోన్లో ఓ మంచి మాటను చెవిన వేద్దాం. గిఫ్ట్‌లు ఇవ్వకూడని స్థితిలో గిఫ్ట్‌కార్డులు పంపవచ్చనే సంగతిని గుర్తుంచుకుందాం. కరోనా నిబంధనలను కొత్త పద్ధతి నేర్చుకోవడానికి అనుకూలంగా మార్చుకుందాం. మన జ్ఞాపకాలు పంచుకుందాం.. న్యూ ఇయర్ అనగానే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డు లు, పువ్వుల బొకేలు ఉండేవి. చిన్నచిన్న గ్రామాల్లో కూడా గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసి తమ ఆత్మీయులకు అందించేవారు. ఇప్పుడు వాట్సాప్ అనే సాధనం ద్వారా చేతులు కలపకుండానే గ్రీటింగులు ఇచ్చి పుచ్చుకోవచ్చు. కరోనా కాలంలో ఇదే చక్కటి అలవాటు. ఇందుకు కొంచెం కొత్తగా ఆలోచించాలి. అందరిలా ఫార్వర్డ్ మెసేజీలు కాకుండా.. మన జ్ఞాపకాలను ఎదుటి వారికి చెప్పగలిగేలా మంచి ఫొటోను ఎంపిక చేసుకుని ఆ చిత్రం వెనుక సంఘటనను గుర్తు చేసుకుంటే కొత్త ఏడాది మొదటి రోజు హాయిగా గడిచిపోతుంది. స్నేహితులైతే చిన్నప్పటి చిత్రాలు, బంధువులైతే శుభ కార్యాల్లో సందడి చేసిన చిత్రాలు, తల్లిదండ్రులకైతే వారి పెళ్లి నాటి ఛాయా చిత్రాలు, ప్రేమికులకైతే తొలినాటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఓ సారి వాట్సాప్ చేసి చూడండి. ఆ జ్ఞాపకాల జల్లులో తడుస్తూ కొత్త ఏడాది ఆహ్వానించండి.. ఆనందాన్ని ఆస్వాదించండి. పండ్లు, పువ్వులకు బదులు.. నూతన ఏడాది రోజున ఊరంతా తిరిగి పెద్దలను కలిసి పండ్లు, బొకేలు ఇవ్వడం అందరి కీ అలవాటు. ఆ అలవాటును వదులుకోనక్కర్లేదు. సామగ్రి ని కొద్దిగా మార్చితే చాలు. పండ్లు, బొకేలకు బదులు శానిటైజర్లు, శానిటైజ్ చేసిన చాక్లెట్లతో ఓ అందమైన బహుమతిని సురక్షితంగా ఇవ్వగలిగితే అంతకంటే భాగ్యం ఏముంటుంది? కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూలబు ట్టలో శానిటైజర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపి ఓ చిన్న కార్డుపై మన సందేశాన్ని అందిస్తే అందుకునే వారికి ఎంతో సంతోషం. కరోనా వారియర్స్‌ను మెచ్చుకుంటే.. కొత్త ఏడాది రోజు కొత్త పనులు మొదలుపెట్టడం చాలా మందికి అలవాటు. ఈ ఏడాది కూడా అలాంటి పనులు చేయవచ్చు. ఏడాదిగా కరోనాతో పో రాడుతున్న యోధులను కొత్త ఏడాది రోజు కలిసి శుభాకాంక్షలు చెబితే అంతకంటే ఏడాదికి గొప్ప స్వాగతం ఉండదు. ప్రతి ఊరిలోనే కరోనా యోధు లు ఉంటారు. అలాంటి వారికి నూతన ఏడాది మొదటి రోజు టాప్ ప్రయారిటీ ఇస్తే ఊరూరా వేడుక సఫలమవుతుంది. జీరో నైట్ సందడి.. డిసెంబర్ 31 రాత్రి పడుకుంటే పాపం అన్నంత గా యువత రెచ్చిపోతుంది. కానీ ఈ ఏడాది పరిస్థితులు వేరు. కాస్త శారీరకంగా బలంగా ఉన్న యువకులకు ఏమీ కాకపోవచ్చు. కానీ వయసు మళ్లిన వారికి ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకునైనా జీరో నైట్ వేడుకలు మానుకుంటే మేలు. అలాగని పూర్తిగా వదులుకోనక్కర్లేదు. వీడియో కాల్స్, వర్చువల్ కాలింగ్ పద్ధతులు ఇప్పడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ పద్ధతిలో అందరూ కలిసి వేడుక చేసుకుంటే ఎవరికీ కీడు జరగదు. ఆన్లైన్ షాపింగ్‌తో సర్ప్రైజ్ ఇప్పుడు ట్రెండ్ మారింది. సర్ప్రైజ్ గిఫ్ట్‌లు, సర్ప్రైజ్ సందేశాలు అందించడం అందరికీ ఆనవాయితీగా మారింది. మారిన ట్రెండ్ కరోనా టైమ్‌లో ఆదుకుంటోంది. బహుమతులను షాపుల్లో కొని ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వడం కంటే ఆన్లైన్ షాపింగ్ చేసి వారి అడ్రస్‌కు పంపిస్తే చాలు. శుభాకాంక్షలు అందిపోతాయి. గిఫ్టు కార్డులు కూడా పంపుకునే పద్ధతి వచ్చేసింది. దూరంగా ఉండక తప్పని పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ పద్ధతి ఆ దూరాన్ని ఇలా దగ్గర చేసేస్తుంది. -
గూగుల్ పేలో డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు
పైన్ ల్యాబ్స్ యాజమాన్యంలోని సంస్థ క్విక్ సిల్వర్ భాగస్వామ్యంతో గూగుల్ పే తన ప్లాట్ఫామ్లో డిజిటల్ గిఫ్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఇది 150 కంటే ఎక్కువ ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ బ్రాండ్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను 1500 నగరాల్లోని భారతదేశంలోని ప్రజలకు అందించనున్నట్లు తెలిపింది. ఈ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్, ఉబెర్ ఇ-గిఫ్ట్, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ మరియు గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్ మొదలైనవి ఉన్నాయి. క్విక్ సిల్వర్ మరో కన్జ్యూమర్ బ్రాండ్ అయిన వోహోను గూగుల్ పే స్పాట్ ప్లాట్ ఫాంపై లిస్ట్ చేసింది. దీని ద్వారా ఆఫ్‌లైన్ వ్యాపారాలు గూగుల్ పేలో వర్చువల్ గిఫ్ట్ కార్డులను తయారుచేయవచ్చు. వోహో, గూగుల్ పే భాగస్వామ్యంతో ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్ పెరగనుంది. ఎందుకంటే వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. గూగుల్ పేలో వోహోను సెర్చ్ చేయడం ద్వారా వర్చువల్ బహుమతి కార్డును పంపవచ్చు. అది కాకపోయినా బిజినెస్ ట్యాబ్ లో ఉండే గిఫ్ట్ కార్డ్ స్టోర్ లోని కార్డులలో ఎంచుకుని పంపుకోవచ్చు. ఒక్కసారి కొంటే ఆ డిజిటల్ కార్డును ఈ మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పంపుకోచ్చు. అప్పుడే మనకు రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులం అవుతాం. భారతదేశంలోని 10 బహుమతి కార్డులలో తొమ్మిది కార్డులు ఇ-కామర్స్, కిరాణా మరియు ఫ్యాషన్ విభాగానికి చెందినవి. క్విక్ సిల్వర్.. వోహో డిజిటల్ కార్డ్ స్టోర్ ను ఆన్ చేసి ఉంచింది. బటన్ క్లిక్ చేసి డిజిటల్ గిఫ్టింగ్ విధానం ద్వారా కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్ మరింత బెటర్ గా పొందొచ్చని పైన్ ల్యాబ్స్ ప్రెసిడెంట్ కుమార్ సుదర్శన్ స్టేట్మెంట్లో చెప్పారు. గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం అనేది గతేడాదే లాంచ్ అయింది. వ్యాపారులు తమ స్పాట్‌ను గూగుల్ పేలో సెటప్ చేయడానికి గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం ద్వారా వీలు కల్పించారు. -
ది‘వాహ్’లీ ప్యాక్..
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు గిఫ్ట్‌బాక్సులు ఇచ్చే సంస్కృతి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పండగకు వారం పది రోజుల ముందు నుంచే గిఫ్ట్ బాక్స్‌లను వారికి పంపిస్తుంటారు. దీంతో బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ బాక్సుల విక్రయాలు జోరందుకున్నాయి. అందమైన ప్యాక్‌లలో డిజైన్ చేసి 250, 500, 750 గ్రాముల చొప్పున ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వీటి ధరలు రూ.250 నుంచి రెండు మూడు వేల వరకు అందుబాటులో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ప్యాకింగ్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఉద్యోగులను విధుల్లోకి అనుమతిస్తున్నారు. విక్రయాలు ఊపందుకున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో పండగ పూట గిఫ్ట్‌లు ఇచ్చే సంస్కృతి ఉంది. ప్రస్తుతం నగరంలో కూడా ఉద్యోగులు, వ్యాపారులు గిఫ్ట్‌లు ఇస్తున్నారు. నగర ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా వివిధ సైజుల్లో ఆకర్శణీయమైన ప్యాకింగ్లతో డిజైన్ చేసి విక్రయిస్తున్నాం. ఇప్పటికే విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రజలు పెద్దఎత్తున గిఫ్ట్ బాక్సులను తీసుకెళ్తున్నారు. - రాజ్‌కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని -
గిఫ్టా..? ఓ కార్డిచ్చేద్దాం!!
న్యూఢిల్లీ: వివాహాది శుభకార్యాలు, ఇతరత్రా సందర్భాలకు ఏం గిఫ్టులివ్వాలనేది చాలా మందికి పెద్ద సమస్యే? దానిపై సందర్భాన్ని బట్టి అయితే ఇంట్లో వాళ్లతో, లేకుంటే స్నేహితులతో చర్చోపచర్చలు సహజం. ఇదిగో... ఈ పరిస్థితిని చూశాకే గిఫ్ట్ కార్డుల ట్రెండ్ మొదలయింది. అందరికీ వీటి గురించి అర్థమయ్యాక ఈ ట్రెండ్ బాగా జోరందుకుంది. ఈ ప్రీ–పెయిడ్ గిఫ్ట్ కార్డులు ఇటు కొనుగోలుదారులు.. అటు వ్యాపార సంస్థలు... ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ పెర్సిస్టెన్స్ మార్కెట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా గిఫ్ట్ కార్డ్ మార్కెట్ ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2024 నాటికి 698 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. క్విక్సిల్వర్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం దేశీ మార్కెట్ విలువ సుమారు 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పెరగనుంది. దేశీయంగా గిఫ్ట్ కార్డుల కొనుగోలుకు సంబంధించి 90 శాతం లావాదేవీలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని రీసెర్చ్ సంస్థల అధ్యయనాల్లో వెల్లడైంది. రూ. 3వేల కోట్ల మార్కెట్.. రిటైల్, కార్పొరేట్ కస్టమర్స్‌కు గిఫ్ట్ కార్డ్ సొల్యూషన్స్ అందించే క్విక్సిల్వర్ నివేదిక ప్రకారం.. 2018–19లో 75 కోట్ల పైచిలుకు గిఫ్ట్ కార్డు లావాదేవీలు జరిగాయి. ఈ మార్కెట్ పరిమాణం రూ.3,000 కోట్ల స్థాయిలో ఉంది. వివిధ సందర్భాల్లో బహుమతిగా ఇచ్చేందుకే కాకుండా సొంతానికి కూడా గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పెద్ద మార్కెట్ ప్లేస్‌లు, ఆఫ్‌లైన్ బ్రాండ్ స్టోర్స్ మొదలైన వాటిల్లో గిఫ్ట్ కార్డుల లభ్యత దాదాపు మూడు రెట్లు పెరిగింది. ‘సంప్రదాయ బహుమతులతో పోలిస్తే గిఫ్ట్ కార్డులను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గిఫ్టుల కోసం షాపింగ్ చేయాలంటే బద్ధకించే వారు ఆఖరు నిమిషంలోనే వీటిని ఎంచుకునే వారు. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ మారుతోంది‘ అని క్విక్సిల్వర్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు ప్రతాప్ టీపీ తెలిపారు. బహుమతులు ఇచ్చేవారి ధోరణుల్లో మార్పులను ఈ ట్రెండ్ సూచిస్తోందని మోగే మీడియా చైర్మన్ సందీప్ గోయల్ అభిప్రాయపడ్డారు. ‘సాధారణంగా మనం ఇచ్చే గిఫ్టు అవతలివారికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది, అది వారికి కూడా ఇష్టమైనదేనా అన్నది మనకి కచ్చితంగా తెలిసే అవకాశాలు తక్కువ. అందుకే గిఫ్ట్ కార్డు రూపంలో ఇస్తే.. అందుకునేవారు తమకు కావాల్సినది కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ధోరణి.. సాధారణంగా గిఫ్ట్ కార్డుల మార్గాన్ని ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. దీంతో అమెజాన్ గిఫ్ట్‌కార్డ్స్ వంటి వాటికి కార్పొరేట్ మార్కెట్టే ఎక్కువగా ఉన్నప్పటికీ.. క్రమంగా రిటైల్ కస్టమర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆయా కంపెనీలు కూడా కాస్త వైవిధ్యమైన కార్డులను ప్రవేశపెడుతున్నాయి. అమెజాన్ స్టోర్‌లో తొలిసారిగా షాపింగ్ చేసేవారికి గిఫ్ట్‌కార్డులు అనువైనవిగా ఉంటాయని అమెజాన్ పేమెంట్స్ డైరెక్టర్ షరీక్ ప్లాస్టిక్వాలా తెలిపారు. భౌగోళికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, కర్ణాటకలోని దావణగెరె, మహారాష్ట్రలోని బీడ్ వంటి ప్రాంతాల్లో గిఫ్ట్ కార్డులకు మంచి డిమాండ్ ఉంటోందని ఆయన పేర్కొన్నారు. అమెజాన్ గిఫ్ట్ కార్డులను కేవలం షాపింగ్‌కు మాత్రమే కాకుండా కరెంటు, నీటి బిల్లులు కట్టేందుకు, ఫ్లయిట్స్.. హోటల్ బుకింగ్స్ మొదలైన వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. 35 ఏళ్ల లోపు వారే అధికం.. దేశీయంగా గిఫ్ట్ కార్డు యూజర్లలో 85 శాతం మంది 35 ఏళ్ల లోపు వయస్సుగలవారే. ఈ కార్డుల వినియోగంలో టాప్ 10 మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్, పట్నా, ఇండోర్, జైపూర్, ఆగ్రా, భువనేశ్వర్, చండీగఢ్, కొచి, సోనిపట్, లక్నో ఉన్నాయి. ఈ నగరాల్లో వినియోగం మూడు రెట్ల నుంచి అయిదు రెట్ల దాకా పెరిగింది. కొత్త సీసాలో.. ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్న గిఫ్ట్ కార్డులు వాస్తవానికి గతంలోనూ ఉండేవి. అప్పుడవి గిఫ్ట్ చెక్కుల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్వరూపం మారింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దశాబ్దాలుగా గిఫ్ట్ చెక్కులు జారీ చేసేదని బ్రాండ్ బిల్డింగ్డాట్కామ్ వ్యవస్థాపకుడు అంబి పరమేశ్వరన్ తెలిపారు. షాపర్స్ స్టాప్, క్రాస్‌వర్డ్, లైఫ్‌స్టయిల్ వంటి సంస్థలు గిఫ్ట్ కార్డుల సంస్కృతి పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడిక ఆన్లైన్ గిఫ్ట్ వోచర్లు.. మళ్లీ మార్కెట్లో కొత్త మార్పులు తీసుకొస్తున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. రిటైలర్లకు లాభం.. కొనుగోలుదారులకు గిఫ్ట్ కార్డులు సౌకర్యవంతంగానే ఉంటున్నాయి. అదే సమయంలో వీటిని అమ్మే రిటైల్ సంస్థలకు ఇవి లాభసాటిగా కూడా ఉంటున్నాయి. కార్డులన్నీ ప్రీ–పెయిడ్ కావడం వల్ల .. దాన్ని గిఫ్ట్‌గా అందుకున్న వారు కొనుగోళ్లు జరపడానికి ముందుగానే సదరు రిటైలర్ల ఖాతాలో డబ్బు చేరినట్లే. పైగా .. చాలా మటుకు కార్డుల విలువలో 60–90 శాతం దాకా మాత్రమే వినియోగం ఉంటోంది. ఇలా మిగిలిపోయిన మొత్తం అంతా గిఫ్ట్ కార్డులు జారీ చేసిన సంస్థలకు లాభమే. -
షావోమి న్యూ ప్లాన్: గిఫ్ట్ కార్డ్
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి భారత కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేసింది. ఎంఐ గిఫ్ట్‌కార్డ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమెయిల్ ద్వారా గిఫ్ట్‌లను అందించేలా ఎంఐ గిఫ్ట్‌కార్డ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పుట్టినరోజు, వార్షికోత్సవం, అభినందనలు తెలిపేందుకు లాంటి సందర్భాల్లో ఈ బహుమతులను అభిమానులకు, సన్నిహితులకు పంపుకోవచ్చు. రూ.100నుంచి గరిష్టంగా రూ.10వేల దాకా షావోమి ఉత్పత్తులను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఒక లావాదేవీలో గరిష్ట 10గిఫ్ట్ కార్డులను ఉపయోగించవచ్చు ఎంఐ.కాం, లేదా ఎంఊస్టోర్ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ల నుంచి టెలివిజన్ దాకా స్మార్ట్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీటిని ప్రవేశపెట్టింది. ఎస్ఏఏఎస్ ఆధారిత ప్రీపెయిడ్ కార్డు సొల్యూషన్స్ ప్రొవైడర్ క్విక్కిల్వర్తో జత కట్టింది. అంతేకాదు ఎంఐ.కామ్ లేదా మి స్టోర్ స్టోర్లలో ఈ గిఫ్ట్ కార్డులను..కార్డుల గ్యాలరీ నుంచి ఎంచుకోవచ్చు లేదంటే.. మనకిష్టమైన ఫోటోను, ఇమేజ్ లేదా డిజైన్‌ను అప్లోడ్ చేసి ఆకర్షణీయమైన పెర్సనలైజ్డ్ కార్డ్‌ను కూడా పొందవచ్చు. డిజిటల్ గిఫ్టింగ్ భారతదేశంలో లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో క్విక్కిల్వర్ భాగస్వామ్యంతో డిజిటల్ గిఫ్టింగ్ పథకాన్ని లాంచ్ చేశామని షావోమి ఇండియా ఆన్లైన్ సేల్స్ హెడ్ రఘురెడ్డి వెల్లడించారు. గిఫ్ట్‌కార్డ్ పొందాలంటే: గిఫ్ట్ కార్డును రీడీమ్ చేయడానికి, ఎంఐస్టోర్ యాప్‌లోకి వెళ్లి.. మై అకౌంట్ క్లిక్ చేసి ..యాడ్ గిఫ్ట్‌కార్డ్‌ను ఎంచుకోవాలి. 16 డిజిట్ నెంబర్‌ను, ఈమెయిల్ ద్వారా మనకు అందిన 6డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాడ్ గిఫ్ట్‌కార్డ్‌ను క్లిక్ చేసి మన ఖాతాను చెక్ చేసుకోవచ్చు. దీనిద్వారా కస్టమర్లకిష్టమైన ఉత్పత్తిని ఎంచుకుని గిఫ్ట్‌గా మన కిష్టమైనవారికి పంపుకోవచ్చు. కొనుగోలు ఎలా చేయాలంటే:ఎంఐ గిఫ్ట్ కార్డుద్వారా కొనుగోలు చేయడానికి షావోమి వెబ్సైట్ స్పెషల్ పేజ్‌ను విజిట్ చేయాలి. ఎంఐ గిఫ్ట్ కార్డ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత గిప్ట్ పంపేవారి, గిప్ట్ అందుకునే వారి,చిరునామా,ఇతర సమాచారాన్ని నింపాలి. తరువాత మెసేజ్ , బహుమతి కార్డుతోపాటు డెలివరీ తేదీ వంటి వివరాలను పూరించాలి. ఈ ప్రక్రియ ఒకసారి పూర్తయితే, క్రెడిట్ /డెబిట్ కార్డు/ ఈఎంఐ/ యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, స్వీకర్తకు ఒక ఇమెయిల్ అందుతుంది. దీంతోపాటు లావాదేవీ వివరాలు , గిఫ్ట్కార్డులో ఇంకా మిగిలి ఉన్న బ్యాలెన్స్ వంటి సమాచారం కూడా వినియోగదారుడికి అందుతుంది. ముఖ్యంగా, ఈ కార్డ్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఒకవేళ ప్రొడక్ట్‌ను రిటర్న్ చేస్తే .. దాని విలువ తిరిగి గిఫ్ట్‌కార్డ్ ఖాతాలో జమ అవుతుంది. -
గిఫ్ట్ కొనొద్దు.. కొనుక్కోమనండి!
గిఫ్ట్‌కార్డులతో ముందుకొస్తున్న బ్యాంకులు జారీ... డెలివరీలో కూడా వినూత్న పద్ధతులు కార్డుపై తీసుకునే వారి పేరు; చిరునామాకే డెలివరీ వీసా, మాస్టర్ ఔట్లెట్లలో ఎక్కడైనా వాడుకోవచ్చు ఏడాది నుంచి మూడేళ్ల వరకూ కాల వ్యవధి మ ఔట్లెట్లలో కొనుగోళ్లకు షాపుల సొంత గిఫ్ట్‌కార్డులు నచ్చని గిఫ్ట్‌ల బదులు... నచ్చింది కొనుక్కునే అవకాశం నచ్చని గిఫ్ట్‌లు చేతులు మారుతున్నాయంటున్న సర్వేలు ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించే ఓఎల్ఎక్స్.. ఈ మధ్య ఓ సర్వే చేసింది. జనం ఘనంగా ఇచ్చే బహుమతులు... ఆ తీసుకునేవారికి నచ్చుతున్నాయా? లేదా? అని. ఇందులో తేలిందేమిటంటే 70% మందికి తమకొచ్చే బహుమతులు నచ్చటం లేదు. దీన్లో హైదరాబాద్‌ది మొదటి స్థానమని కూడా తేలింది. వాళ్లేం చేస్తున్నారంటే... ఇలా నచ్చని బహుమతుల్ని వేరొకరికి గిఫ్ట్‌గా ఇచ్చేస్తున్నారట!!. మరి మీకు నచ్చనిది వాళ్లకు నచ్చుతుందా చెప్పండి? పోనీ కొద్ది మందికి అలా నచ్చినా అందరికీ నచ్చాలని రూలేమైనా ఉందా? అప్పుడేమవుతుంది..? వాళ్లు మరొకరికి బహుమతి ఇస్తారంతే!! అదీ కథ. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం గిఫ్ట్ కొనుక్కునే అవకాశాన్ని వారికే వదిలేద్దాం! అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న గిఫ్ట్ కార్డులతో అది సాధ్యమే. ఎందుకంటే ఈ గిఫ్ట్ కార్డులు ప్రీపెయిడ్ కార్డుల్లాంటివే. మీరు మీ ఆత్మీయులకు ఏ మేరకు బహుమతి ఇవ్వాలనుకున్నారో... అంతమేరకే ముందు ఈ కార్డులో నగదును లోడ్ చేయొచ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ వీటిని అందిస్తున్నాయి. బ్యాంకు శాఖలో కొనుగోలు చేసి... ఆత్మీయులకు చిన్న కవర్లో పెట్టి సింపుల్‌గా ఇచ్చేయొచ్చు. పైపెచ్చు ఈ కార్డు కొనాలంటే మీకు సదరు బ్యాంకులో ఖాతా ఉండాలన్న నిబంధనేదీ లేదు. ఖాతా ఉన్న బ్యాంకుల్లోనే కార్డులు అందుబాటులో ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. పేరుతోనూ ఇస్తాయి కొన్ని బ్యాంకులు... ఉదాహరణకు ‘హెచ్డీఎఫ్సీ గిఫ్ట్ ప్లస్ కార్డు’ను అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంటే... నెట్‌బ్యాంకింగ్ ద్వారా గిఫ్ట్ కార్డు కొనుగోలు చేయొచ్చు. కార్డుపై బహుమతి అందుకునే వారి పేరును ప్రింట్ చేసి మరీ ఇస్తుంది బ్యాంకు. ఈ పథకంలో భాగంగా బహుమతి అందించే తీరిక మీకు లేకపోతే, చిరునామా ఇస్తే బ్యాంకే స్వయంగా దాన్ని మీ ఆత్మీయులకు చేరవేస్తుంది కూడా. అయితే ఇలా పేరుతో రూపొందించిన వ్యక్తిగత గిఫ్ట్ కార్డు జారీకి కనీసం ఐదు నుంచి ఏడు పనిదినాల సమయం తీసుకుంటుంది. పైగా కార్డు యాక్టివేషన్ సమయం అనేది బ్యాంకును బట్టి మారుతుంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న ‘బరోడా గిఫ్ట్ కార్డు’ యాక్టివేషన్‌కు నాలుగు రోజులు సమయం పడుతుంది. ఇవి ఎలా పనిచేస్తాయంటే... కొనుగోలు సమయంలోనే గిఫ్ట్ కార్డు విలువ ఎంత ఉండాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. రూ.500 నుంచి ఇది ప్రారంభమవుతుంది. గరిష్టంగా రూ.50 వేల వరకు లోడ్ చేసుకోవచ్చు. అదే కెనరా బ్యాంకు అయితే రూ.500, రూ.1,000, రూ.2,000, రూ.5000 విలువ గల కార్డులనే అందిస్తోంది. ఇలా బ్యాంకులను బట్టి కార్డుల రూపు, విలువ మారొచ్చు. బ్యాంకులిచ్చే గిఫ్ట్కార్డులన్నీ కూడా వీసా కార్డులే. కాబట్టి వీటిని ప్రపంచ వ్యాప్తంగా వీసా మర్చంట్ అవుట్లెట్లలో ఎక్కడైనా వినియోగించవచ్చు. యస్ బ్యాంకు మాత్రం మాస్టర్ కార్డు అందిస్తోంది. ఈ గిఫ్ట్ కార్డుల కాల పరిమితి ఏడాది వరకు ఉంటుంది. అంటే సదరు కార్డులో నగదు లోడ్ చేశాక... ఏడాదిలోపు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగని ఒకేసారి దీన్లో ఉన్న మొత్తాన్నంతటినీ వాడాలన్న నిబంధనలేమీ లేవు. మీకు నచ్చినపుడు, నచ్చిన మొత్తాన్ని వాడుకోవచ్చు. కాకపోతే కాలపరిమితిలోగా వాడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం స్టేట్ బ్యాంకు గిఫ్ట్ కార్డు పేరుతో మూడేళ్ల కాల వ్యవధితో అందిస్తోంది. ఈ కార్డుల్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది బ్యాంకు ఏటీఎంకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అంతేతప్ప ఏటీఎం నుంచి నగదు తీసుకునే అవకాశం మాత్రం లేదు. ఒక కార్డులో బ్యాలెన్స్‌ను మరో కార్డుకు బదిలీ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఒకవేళ కార్డు గడువు ముగిసిపోవడానికి సమీపిస్తుంటే అందులో ఉన్న బ్యాలెన్స్‌ను రిఫండ్ చేయాలని కోరవచ్చు. అందుకు కొంత రుసుం తీసుకుని ఆ మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేస్తాయి. ఉదాహరణకు కోటక్ బ్యాంకు అయితే గడువుకు నెలరోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిఫండ్‌కు రూ.100 రుసుం తీసుకుంటోంది. బ్యాంకు ఆఫ్ బరోడా అయితే కార్డులో బ్యాలెన్స్ రూ.100లోపు ఉంటే రిఫండ్ చేయడం లేదు. ఒకవేళ కార్డులో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ గడువు దాటితే రూపాయి కూడా వెనక్కి రాదన్నది మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి... గిఫ్ట్ కార్డు కోసం బ్యాంకులకు చిరునామా, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓ దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ఈ కార్డును బహుమతిగా ఎవరు అందుకోబోతున్నారో వారి పేరు, చిరునామా, కాంటాక్టు నంబర్ కూడా ఇవ్వాలి. ఇక ఫీజుల విషయానికొస్తే బ్యాంకులను బట్టి మారుతున్నాయి. దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంకులు కార్డు జారీకి రూ.100 రుసుం తీసుకుంటున్నాయి. దీనికి సర్వీస్ చార్జీలు అదనం. అదే బ్యాంకు ఆఫ్ బరోడా అయితే రూ.15–50 మధ్యలో చార్జ్ చేస్తోంది. ఈ చార్జీలకు అదనంగా రిఫండ్ ఫీజు, కార్డు పోతే తిరిగి జారీ చేసేందుకు చార్జీ, పిన్ జారీ ఫీజు తదితర చార్జీలుంటాయి. బహుమతికీ ఉంది పన్ను... బహుమతిపై పన్ను ఉంటుందన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. కానీ, బహుమతి స్వీకరించిన వారిపై ఈ బాధ్యత ఉంటుందని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. ఇచ్చే వారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించకుండా బహుమతులు పుచ్చుకుంటే పన్ను చెల్లించాల్సిన పనిలేదు. కానీ, ఇది రూ.50వేలకు మించి ఉంటే మాత్రం బహుమతి స్వీకరించిన వ్యక్తి ఆ ఏడాది ఆర్జించిన ఆదాయానికి బహుమతి విలువ కూడా కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రామారావు 2015–16లో రూ.3,50,000 ఆదాయం ఆర్జించాడు. అతడికి ఆ ఏడాదిలో రూ.60వేల విలువైన కానుకలు వచ్చాయి. ఇప్పుడు చట్టంలోని నిబంధనల ప్రకారం రామారావు ఆదాయం రూ.4,10,000 అవుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను రేటు ఉంది కనుక ఆ మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులు ఇస్తే... కానుకలు కుటుంబసభ్యుల నుంచి అందుకుంటే పన్ను బాధ్యత ఉండదు. కుటుంబ సభ్యులు అన్నదానికి ఆదాయపన్ను చట్టం నిర్వచనం ఇచ్చింది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోడబుట్టినవారు, జీవిత భాగస్వామి తోడబుట్టినవారు, మీ వంశస్థులను కుటుంబ సభ్యులుగా చట్టం పరిగణిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఎంత విలువైన ఆస్తి అయినా బహుమతిగా ఇచ్చి, పుచ్చుకోవచ్చు. కానీ, ఆ ఆస్తిపై వచ్చే ఆదాయాన్ని కానుకిచ్చిన వ్యక్తి ఆదాయంగానే చట్టం పరిగణిస్తుంది. ఉదాహరణకు కృష్ణ తన వేతనంలో మిగులుతో మంచి సెంటర్లో ఓ కమర్షియల్ షాపు కొన్నాడు. దానిపై నెలకు రూ.15వేల ఆదాయం వస్తోంది. దాన్ని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడనుకోండి. షాపుపై ఏటా వచ్చే రూ.1.8 లక్షల ఆదాయాన్ని కృష్ణ తన ఆదాయంలోనే చూపించి పన్ను చెల్లించాలి. పన్ను లేకుండా మినహాయింపు కల్పిస్తే ఇలా విలువైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆస్తులను దగ్గరి వారికి బహమతిగా ఇచ్చి పన్ను ఎగ్గొడతారనే స్పృహతోనే ఈ నిబంధన పెట్టారు. ఈ జాగ్రత్తలు అవసరం... బహుమతి ఆస్తి కావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు. ఆ బహుమతికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఆధారాలతో పాటు, బహుమతికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. బహుమతి ఇస్తున్న వారితో అనుబంధాన్ని కూడా సమీక్షించుకోండి. ఎందుకంటే ఒకసారి బహుమతి ఇచ్చేసినా దానిపై వచ్చే ఆదాయంపై మీరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకిస్తే... తల్లిదండ్రులకు ఇస్తే మాత్రం పన్నుండదు. ఇచ్చినందుకు మీకు, పుచ్చుకున్నందుకు వారూ పన్ను చెల్లించక్కర్లేదని చట్టమే చెబుతోంది. తల్లిదండ్రులకు ఇచ్చిన బహుమతిపై వచ్చే ఆదాయం కూడా ఇచ్చిన వ్యక్తి ఆదాయంలో కలవదు. సదరు ఆస్తిపై ఆదాయం ఏదైనా గానీ తీసుకున్న తల్లిదండ్రుల ఆదాయంలోనే కలుస్తుంది. పిల్లలకు ఇచ్చినా ఇంతే... 18 ఏళ్లు నిండిన అవివాహితులైన పిల్లలకు ఇచ్చే బహుమతులపై ఆదాయం కూడా తల్లి లేదా తండ్రి ఆదాయంలో భాగం కాబోదు. తల్లిదండ్రులకు బహుమతి ఇస్తే ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఇక్కడ కూడా అవే అమలవుతాయి. బహుమతి తీసుకున్న పిల్లలు మాత్రం ఐటీ రిటర్నులు దాఖలు చేసి పన్ను చెల్లించాలి. అది కూడా చట్టబద్ధమైన పన్ను ఆదాయం ఉన్నప్పుడే. జీవిత భాగస్వామికి ఇస్తే... భార్యా భర్తల మధ్య బహుమతులు సాధారణ బహుమతి నిబంధనలే వర్తిస్తాయి. బహుమతిపై ఆదాయాన్ని... ఇచ్చిన వ్యక్తి ఆదాయంగానే చట్టం పరిగణిస్తుంది. వ్యాపారంలో భాగంగా ఇచ్చే కానుకలపై... వ్యాపారంలో భాగంగా బహుమతులు ఇస్తే... వాటిని స్వీకరించిన వారు రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ బహమతులకు అయిన వ్యయాన్ని వ్యాపార ఆదాయం నుంచి మినహాయించుకునే అవకాశం కూడా చట్ట ప్రకారం లేదు. షాపులూ జారీ చేస్తున్నాయి... బిగ్‌బజార్, లైఫ్సై్ట్టల్, షాపర్స్ స్టాప్ తదితర గొలుసు సంస్థలు, అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థలు కూడా గిఫ్ట్ కార్డుల్ని జారీ చేస్తున్నాయి. వీటిలో ఉన్న సౌలభ్యమేంటంటే ఈ కార్డుల జారీకి ఎలాంటి చార్జీలూ ఉండవు. మీరు రూ.500 కార్డు కావాలనుకుంటే 500 పెట్టి తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు మాత్రం నామమాత్రపు రుసుములు వసూలు చేస్తున్నాయి. కానీ వీటితో ఉండే ప్రధాన ఇబ్బందేమిటంటే మీరు కార్డుపై ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకున్నపుడు మీకు కార్డును ఏ సంస్థయితే జారీ చేసిందో ఆ సంస్థలోనే కొనాలి. వేరే సంస్థలు ఈ కార్డుల్ని అంగీకరించవు. ఇది దృష్టిలో ఉంచుకుని వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ప్రీ-పెయిడ్ కార్డ్ పరిమితి రెట్టింపు
* రూ.లక్షకు పెంచిన ఆర్బీఐ * గిఫ్ట్ కార్డ్ కాలపరిమితి కూడా పెంపు ముంబై: వ్యవస్థలో నగదు లావాదేవీల తగ్గింపు దిశగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక చర్య తీసుకుంది. ప్రీ-పెయిడ్ కార్డ్ (ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రమెంట్-పీపీఐ) పరిమితిని ప్రస్తుత రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచింది. దీనితోపాటు గిఫ్ట్ కార్డుల గరిష్ట కాలపరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. పూర్తి స్థాయిలో కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలకు అనుగుణంగా ఉన్న అకౌంట్ల నుంచి అకౌంట్‌దారులు కోరిన విధంగా వారిపై ఆధారపడినవారికిగానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఎన్ని పీపీఐలు జారీ చేయడానికైనా బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఒక వ్యక్తికి ఒక కార్డును మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది. దఫాకు రూ.10,000, నెలకు రూ.25,000 మించి ఈ పరిమితి ఉండరాదని కూడా స్పష్టం చేసింది. విదేశీయుల విషయంలో... కాగా దేశంలో పర్యటిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), విదేశీయులకు రూపాయి డినామినేటెడ్ (రూపాయిలో చెల్లుబాటు అయ్యే విధంగా) నాన్-రీలోడబుల్ పీపీఐల జారీకి సైతం రిజర్వ్ బ్యాంక్ అనుమతి మంజూరు చేసింది. కాగా ఎక్స్ఛేంజ్ హౌస్‌లు లేదా ఆర్బీఐ గుర్తింపు పొందిన మనీ ట్రాన్స్‌మీటర్స్ భాగస్వామ్యంతో కూడా ఎన్ఆర్ఐ లేదా విదేశీయులకు పీపీఐలు జారీ చేసే వీలుంది. ప్రి పెయిడ్ కార్డ్ అంటే... కొంత మొత్తాన్ని ముందుగా బ్యాంకులో డిపాజిట్ చేసి తీసుకునే క్రెడిట్ కార్డ్ లాంటిదే ప్రి పెయిడ్ కార్డు. క్రెడిట్ కార్డులో అయితే ఆ కార్డు బ్యాంకు నిర్దేశించే క్రెడిట్ లిమిట్ వరకూ వాడుకోవచ్చు. ప్రి పెయిడ్ కార్డ్‌లో ఎంతైతే ముందుగా డిపాజిట్ చేస్తారో ఆ మొత్తాన్నే వాడుకోవాలి. సాధారణంగా ఖర్చుల నియంత్రణ కోసం ఈ కార్డులను వాడతారు. టీనేజర్లకు తల్లిదండ్రులు ఇలాంటి కార్డులను ఇస్తారు. వాళ్లు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయకుండా ఉండటానికి క్రెడిట్ కార్డులకు బదులుగా ఈ కార్డులను ఇస్తారు. కాగా, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసిన డెబిట్ కార్డును గిఫ్ట్కార్డుగా వ్యవహరిస్తారు. ఇవి జారీ చేసే బ్యాంకులు, సంస్థలను బట్టి వివిధ డినామినేషన్లలో లభిస్తాయి. ఎవరికైనా నగదు బహుమతులుగా ఇవ్వడానికి వీటిని జారీ చేస్తారు. కార్డు డినామినేషన్ మేరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.