గిఫ్ట్‌ కొనొద్దు.. కొనుక్కోమనండి! | Personal Finance section | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌ కొనొద్దు.. కొనుక్కోమనండి!

Published Sun, Jan 8 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

గిఫ్ట్‌ కొనొద్దు.. కొనుక్కోమనండి!

గిఫ్ట్‌ కొనొద్దు.. కొనుక్కోమనండి!

గిఫ్ట్‌కార్డులతో ముందుకొస్తున్న బ్యాంకులు   
 జారీ... డెలివరీలో కూడా వినూత్న పద్ధతులు
కార్డుపై తీసుకునే వారి పేరు; చిరునామాకే డెలివరీ
 వీసా, మాస్టర్‌ ఔట్‌లెట్లలో ఎక్కడైనా వాడుకోవచ్చు
ఏడాది నుంచి మూడేళ్ల వరకూ కాల వ్యవధి  
మ ఔట్‌లెట్లలో కొనుగోళ్లకు షాపుల సొంత గిఫ్ట్‌కార్డులు
నచ్చని గిఫ్ట్‌ల బదులు... నచ్చింది కొనుక్కునే అవకాశం  
నచ్చని గిఫ్ట్‌లు చేతులు మారుతున్నాయంటున్న సర్వేలు  


ఆన్‌లైన్లో సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులు విక్రయించే ఓఎల్‌ఎక్స్‌.. ఈ మధ్య ఓ సర్వే చేసింది. జనం ఘనంగా ఇచ్చే బహుమతులు... ఆ తీసుకునేవారికి నచ్చుతున్నాయా? లేదా? అని. ఇందులో తేలిందేమిటంటే 70% మందికి తమకొచ్చే బహుమతులు నచ్చటం లేదు.

దీన్లో హైదరాబాద్‌ది మొదటి స్థానమని కూడా తేలింది. వాళ్లేం చేస్తున్నారంటే... ఇలా నచ్చని బహుమతుల్ని వేరొకరికి గిఫ్ట్‌గా ఇచ్చేస్తున్నారట!!. మరి మీకు నచ్చనిది వాళ్లకు నచ్చుతుందా చెప్పండి? పోనీ కొద్ది మందికి అలా నచ్చినా అందరికీ నచ్చాలని రూలేమైనా ఉందా? అప్పుడేమవుతుంది..? వాళ్లు మరొకరికి బహుమతి ఇస్తారంతే!! అదీ కథ.
–సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

గిఫ్ట్‌ కొనుక్కునే అవకాశాన్ని వారికే వదిలేద్దాం!
అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న గిఫ్ట్‌ కార్డులతో అది సాధ్యమే. ఎందుకంటే ఈ గిఫ్ట్‌ కార్డులు ప్రీపెయిడ్‌ కార్డుల్లాంటివే. మీరు మీ ఆత్మీయులకు ఏ మేరకు బహుమతి ఇవ్వాలనుకున్నారో... అంతమేరకే ముందు ఈ కార్డులో నగదును లోడ్‌ చేయొచ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ వీటిని అందిస్తున్నాయి. బ్యాంకు శాఖలో కొనుగోలు చేసి... ఆత్మీయులకు చిన్న కవర్లో పెట్టి సింపుల్‌గా ఇచ్చేయొచ్చు. పైపెచ్చు ఈ కార్డు కొనాలంటే మీకు సదరు బ్యాంకులో ఖాతా ఉండాలన్న నిబంధనేదీ లేదు. ఖాతా ఉన్న బ్యాంకుల్లోనే కార్డులు అందుబాటులో ఉంటే నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా కొనుక్కోవచ్చు.

పేరుతోనూ ఇస్తాయి కొన్ని బ్యాంకులు...
ఉదాహరణకు ‘హెచ్‌డీఎఫ్‌సీ గిఫ్ట్‌ ప్లస్‌ కార్డు’ను అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉంటే... నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా గిఫ్ట్‌ కార్డు కొనుగోలు చేయొచ్చు. కార్డుపై బహుమతి అందుకునే వారి పేరును ప్రింట్‌ చేసి మరీ ఇస్తుంది బ్యాంకు. ఈ పథకంలో భాగంగా బహుమతి అందించే తీరిక మీకు లేకపోతే, చిరునామా ఇస్తే బ్యాంకే స్వయంగా దాన్ని మీ ఆత్మీయులకు చేరవేస్తుంది కూడా. అయితే ఇలా పేరుతో రూపొందించిన వ్యక్తిగత గిఫ్ట్‌ కార్డు జారీకి కనీసం ఐదు నుంచి ఏడు పనిదినాల సమయం తీసుకుంటుంది. పైగా కార్డు యాక్టివేషన్‌ సమయం అనేది బ్యాంకును బట్టి మారుతుంటుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అందిస్తున్న ‘బరోడా గిఫ్ట్‌ కార్డు’ యాక్టివేషన్‌కు నాలుగు రోజులు సమయం పడుతుంది.


ఇవి ఎలా పనిచేస్తాయంటే...
కొనుగోలు సమయంలోనే గిఫ్ట్‌ కార్డు విలువ ఎంత ఉండాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. రూ.500 నుంచి ఇది ప్రారంభమవుతుంది. గరిష్టంగా రూ.50 వేల వరకు లోడ్‌ చేసుకోవచ్చు. అదే కెనరా బ్యాంకు అయితే రూ.500, రూ.1,000, రూ.2,000, రూ.5000 విలువ గల కార్డులనే అందిస్తోంది. ఇలా బ్యాంకులను బట్టి కార్డుల రూపు, విలువ మారొచ్చు. బ్యాంకులిచ్చే గిఫ్ట్‌కార్డులన్నీ కూడా వీసా కార్డులే. కాబట్టి వీటిని ప్రపంచ వ్యాప్తంగా వీసా మర్చంట్‌ అవుట్‌లెట్లలో ఎక్కడైనా వినియోగించవచ్చు. యస్‌ బ్యాంకు మాత్రం మాస్టర్‌ కార్డు అందిస్తోంది. ఈ గిఫ్ట్‌ కార్డుల కాల పరిమితి ఏడాది వరకు ఉంటుంది. అంటే సదరు కార్డులో నగదు లోడ్‌ చేశాక... ఏడాదిలోపు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగని ఒకేసారి దీన్లో ఉన్న మొత్తాన్నంతటినీ వాడాలన్న నిబంధనలేమీ లేవు. మీకు నచ్చినపుడు, నచ్చిన మొత్తాన్ని వాడుకోవచ్చు. కాకపోతే కాలపరిమితిలోగా వాడాలి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం స్టేట్‌ బ్యాంకు గిఫ్ట్‌ కార్డు పేరుతో మూడేళ్ల కాల వ్యవధితో అందిస్తోంది. ఈ కార్డుల్లో ఎంత బ్యాలెన్స్‌ ఉందనేది బ్యాంకు ఏటీఎంకు వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. అంతేతప్ప ఏటీఎం నుంచి నగదు తీసుకునే అవకాశం మాత్రం లేదు. ఒక కార్డులో బ్యాలెన్స్‌ను మరో కార్డుకు బదిలీ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఒకవేళ కార్డు గడువు ముగిసిపోవడానికి సమీపిస్తుంటే అందులో ఉన్న బ్యాలెన్స్‌ను రిఫండ్‌ చేయాలని కోరవచ్చు. అందుకు కొంత రుసుం తీసుకుని ఆ మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేస్తాయి. ఉదాహరణకు కోటక్‌ బ్యాంకు అయితే గడువుకు నెలరోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిఫండ్‌కు రూ.100 రుసుం తీసుకుంటోంది. బ్యాంకు ఆఫ్‌ బరోడా అయితే కార్డులో బ్యాలెన్స్‌ రూ.100లోపు ఉంటే రిఫండ్‌ చేయడం లేదు. ఒకవేళ కార్డులో బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ గడువు దాటితే రూపాయి కూడా వెనక్కి రాదన్నది మాత్రం గుర్తుంచుకోవాలి.

ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి...
గిఫ్ట్‌ కార్డు కోసం బ్యాంకులకు చిరునామా, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓ దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ఈ కార్డును బహుమతిగా ఎవరు అందుకోబోతున్నారో వారి పేరు, చిరునామా, కాంటాక్టు నంబర్‌ కూడా ఇవ్వాలి. ఇక ఫీజుల విషయానికొస్తే బ్యాంకులను బట్టి మారుతున్నాయి. దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంకులు కార్డు జారీకి రూ.100 రుసుం తీసుకుంటున్నాయి. దీనికి సర్వీస్‌ చార్జీలు అదనం. అదే బ్యాంకు ఆఫ్‌ బరోడా అయితే రూ.15–50 మధ్యలో చార్జ్‌ చేస్తోంది. ఈ చార్జీలకు అదనంగా రిఫండ్‌ ఫీజు, కార్డు పోతే తిరిగి జారీ చేసేందుకు చార్జీ, పిన్‌ జారీ ఫీజు తదితర చార్జీలుంటాయి.

బహుమతికీ ఉంది పన్ను...
బహుమతిపై పన్ను ఉంటుందన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. కానీ, బహుమతి స్వీకరించిన వారిపై ఈ బాధ్యత ఉంటుందని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. ఇచ్చే వారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించకుండా బహుమతులు పుచ్చుకుంటే పన్ను చెల్లించాల్సిన పనిలేదు. కానీ, ఇది రూ.50వేలకు మించి ఉంటే మాత్రం బహుమతి స్వీకరించిన వ్యక్తి ఆ ఏడాది ఆర్జించిన ఆదాయానికి బహుమతి విలువ కూడా కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రామారావు 2015–16లో రూ.3,50,000 ఆదాయం ఆర్జించాడు. అతడికి ఆ ఏడాదిలో రూ.60వేల విలువైన కానుకలు వచ్చాయి. ఇప్పుడు చట్టంలోని నిబంధనల ప్రకారం రామారావు ఆదాయం రూ.4,10,000 అవుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను రేటు ఉంది కనుక ఆ మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కుటుంబసభ్యులు ఇస్తే...
కానుకలు కుటుంబసభ్యుల నుంచి అందుకుంటే పన్ను బాధ్యత ఉండదు. కుటుంబ సభ్యులు అన్నదానికి ఆదాయపన్ను చట్టం నిర్వచనం ఇచ్చింది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోడబుట్టినవారు, జీవిత భాగస్వామి తోడబుట్టినవారు, మీ వంశస్థులను కుటుంబ సభ్యులుగా చట్టం పరిగణిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఎంత విలువైన ఆస్తి అయినా బహుమతిగా ఇచ్చి, పుచ్చుకోవచ్చు. కానీ, ఆ ఆస్తిపై వచ్చే ఆదాయాన్ని కానుకిచ్చిన వ్యక్తి ఆదాయంగానే చట్టం పరిగణిస్తుంది. ఉదాహరణకు కృష్ణ తన వేతనంలో మిగులుతో మంచి సెంటర్‌లో ఓ కమర్షియల్‌ షాపు కొన్నాడు. దానిపై నెలకు రూ.15వేల ఆదాయం వస్తోంది. దాన్ని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడనుకోండి. షాపుపై ఏటా వచ్చే రూ.1.8 లక్షల ఆదాయాన్ని కృష్ణ తన ఆదాయంలోనే చూపించి పన్ను చెల్లించాలి. పన్ను లేకుండా మినహాయింపు కల్పిస్తే ఇలా విలువైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆస్తులను దగ్గరి వారికి బహమతిగా ఇచ్చి పన్ను ఎగ్గొడతారనే స్పృహతోనే ఈ నిబంధన పెట్టారు.

ఈ జాగ్రత్తలు అవసరం...
బహుమతి ఆస్తి కావచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కావచ్చు. ఆ బహుమతికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఆధారాలతో పాటు, బహుమతికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. బహుమతి ఇస్తున్న వారితో అనుబంధాన్ని కూడా సమీక్షించుకోండి. ఎందుకంటే ఒకసారి బహుమతి ఇచ్చేసినా దానిపై వచ్చే ఆదాయంపై మీరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

తల్లిదండ్రులకిస్తే...
తల్లిదండ్రులకు ఇస్తే మాత్రం పన్నుండదు. ఇచ్చినందుకు మీకు, పుచ్చుకున్నందుకు వారూ పన్ను చెల్లించక్కర్లేదని చట్టమే చెబుతోంది. తల్లిదండ్రులకు ఇచ్చిన బహుమతిపై వచ్చే ఆదాయం కూడా ఇచ్చిన వ్యక్తి ఆదాయంలో కలవదు. సదరు ఆస్తిపై ఆదాయం ఏదైనా గానీ తీసుకున్న తల్లిదండ్రుల ఆదాయంలోనే కలుస్తుంది.

పిల్లలకు ఇచ్చినా ఇంతే...
18 ఏళ్లు నిండిన అవివాహితులైన పిల్లలకు ఇచ్చే బహుమతులపై ఆదాయం కూడా తల్లి లేదా తండ్రి ఆదాయంలో భాగం కాబోదు. తల్లిదండ్రులకు బహుమతి ఇస్తే ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఇక్కడ కూడా అవే అమలవుతాయి. బహుమతి తీసుకున్న పిల్లలు మాత్రం ఐటీ రిటర్నులు దాఖలు చేసి పన్ను చెల్లించాలి. అది కూడా చట్టబద్ధమైన పన్ను ఆదాయం ఉన్నప్పుడే.

జీవిత భాగస్వామికి ఇస్తే...
భార్యా భర్తల మధ్య బహుమతులు సాధారణ బహుమతి నిబంధనలే వర్తిస్తాయి. బహుమతిపై ఆదాయాన్ని... ఇచ్చిన వ్యక్తి ఆదాయంగానే చట్టం పరిగణిస్తుంది.

వ్యాపారంలో భాగంగా ఇచ్చే కానుకలపై...
వ్యాపారంలో భాగంగా బహుమతులు ఇస్తే... వాటిని స్వీకరించిన వారు రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ బహమతులకు అయిన వ్యయాన్ని వ్యాపార ఆదాయం నుంచి మినహాయించుకునే అవకాశం కూడా చట్ట ప్రకారం లేదు.  

షాపులూ జారీ చేస్తున్నాయి...
బిగ్‌బజార్, లైఫ్‌సై్ట్టల్, షాపర్స్‌ స్టాప్‌ తదితర గొలుసు సంస్థలు, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థలు కూడా గిఫ్ట్‌ కార్డుల్ని జారీ చేస్తున్నాయి. వీటిలో ఉన్న సౌలభ్యమేంటంటే ఈ కార్డుల జారీకి ఎలాంటి చార్జీలూ ఉండవు. మీరు రూ.500 కార్డు కావాలనుకుంటే 500 పెట్టి తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు మాత్రం నామమాత్రపు రుసుములు వసూలు చేస్తున్నాయి. కానీ వీటితో ఉండే ప్రధాన ఇబ్బందేమిటంటే మీరు కార్డుపై ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకున్నపుడు మీకు కార్డును ఏ సంస్థయితే జారీ చేసిందో ఆ సంస్థలోనే కొనాలి. వేరే సంస్థలు ఈ కార్డుల్ని అంగీకరించవు. ఇది దృష్టిలో ఉంచుకుని వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement