ప్రీ-పెయిడ్ కార్డ్ పరిమితి రెట్టింపు
* రూ.లక్షకు పెంచిన ఆర్‌బీఐ
* గిఫ్ట్ కార్డ్ కాలపరిమితి కూడా పెంపు
ముంబై: వ్యవస్థలో నగదు లావాదేవీల తగ్గింపు దిశగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో కీలక చర్య తీసుకుంది. ప్రీ-పెయిడ్ కార్డ్ (ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రమెంట్-పీపీఐ) పరిమితిని ప్రస్తుత రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచింది. దీనితోపాటు గిఫ్ట్ కార్డుల గరిష్ట కాలపరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. పూర్తి స్థాయిలో కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలకు అనుగుణంగా ఉన్న అకౌంట్ల నుంచి అకౌంట్‌దారులు కోరిన విధంగా వారిపై ఆధారపడినవారికిగానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఎన్ని పీపీఐలు జారీ చేయడానికైనా బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఒక వ్యక్తికి ఒక కార్డును మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది. దఫాకు రూ.10,000, నెలకు రూ.25,000 మించి ఈ పరిమితి ఉండరాదని కూడా స్పష్టం చేసింది.
విదేశీయుల విషయంలో...
కాగా దేశంలో పర్యటిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీయులకు రూపాయి డినామినేటెడ్ (రూపాయిలో చెల్లుబాటు అయ్యే విధంగా) నాన్-రీలోడబుల్ పీపీఐల జారీకి సైతం రిజర్వ్ బ్యాంక్ అనుమతి మంజూరు చేసింది. కాగా ఎక్స్ఛేంజ్ హౌస్‌లు లేదా ఆర్‌బీఐ గుర్తింపు పొందిన మనీ ట్రాన్స్‌మీటర్స్ భాగస్వామ్యంతో కూడా ఎన్‌ఆర్‌ఐ లేదా విదేశీయులకు పీపీఐలు జారీ చేసే వీలుంది.
ప్రి పెయిడ్ కార్డ్ అంటే...
కొంత మొత్తాన్ని ముందుగా బ్యాంకులో డిపాజిట్ చేసి తీసుకునే క్రెడిట్ కార్డ్ లాంటిదే ప్రి పెయిడ్ కార్డు. క్రెడిట్ కార్డులో అయితే ఆ కార్డు బ్యాంకు నిర్దేశించే క్రెడిట్ లిమిట్ వరకూ వాడుకోవచ్చు. ప్రి పెయిడ్ కార్డ్‌లో ఎంతైతే ముందుగా డిపాజిట్ చేస్తారో ఆ మొత్తాన్నే వాడుకోవాలి. సాధారణంగా ఖర్చుల నియంత్రణ కోసం ఈ కార్డులను వాడతారు.
టీనేజర్లకు తల్లిదండ్రులు ఇలాంటి కార్డులను ఇస్తారు. వాళ్లు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయకుండా ఉండటానికి క్రెడిట్ కార్డులకు బదులుగా ఈ కార్డులను ఇస్తారు. కాగా, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసిన డెబిట్ కార్డును గిఫ్ట్‌కార్డుగా వ్యవహరిస్తారు. ఇవి జారీ చేసే బ్యాంకులు, సంస్థలను బట్టి వివిధ డినామినేషన్‌లలో లభిస్తాయి. ఎవరికైనా నగదు బహుమతులుగా ఇవ్వడానికి వీటిని జారీ చేస్తారు. కార్డు డినామినేషన్ మేరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.