కరోనా జపం చేస్తుండగానే ఏడాది గడిచిపోయింది. కాలం, కోవిడ్ కలిపి కొత్త విషయాలు నేర్పాయి. మనిషికి మనిషికి మధ్య దగ్గరితనాన్ని దూరం చేశాయి. ఆత్మీయ స్పర్శ అలవాటును మర్చిపోవాలని చెప్పాయి. మరి కొత్త ఏడాదిలో ఎలా..? చేతులు కలపకూడదు.. కానీ విష్ చేయాలి. ఆలింగనాలు కుదరవు.. కానీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. అందుకు ఉందో దారి. సాంకేతికతను సమర్థంగా గానీ వాడుకుంటే దూరాలను దగ్గర చేసుకోవచ్చు. తెగిన బంధాలను దారికి తెచ్చుకోవచ్చు. హీరోలు, దేవుళ్ల ఫొటోల గ్రీటింగ్ కార్డులు ఇవ్వనక్కర్లేదు.. మన ఫొటోతోనే ఓ కార్డు వాట్సాప్ చేద్దాం. హత్తుకుని విష్ చెప్పనక్కర్లేదు. ఫోన్‌లో ఓ మంచి మాటను చెవిన వేద్దాం. గిఫ్ట్‌లు ఇవ్వకూడని స్థితిలో గిఫ్ట్‌కార్డులు పంపవచ్చనే సంగతిని గుర్తుంచుకుందాం. కరోనా నిబంధనలను కొత్త పద్ధతి నేర్చుకోవడానికి అనుకూలంగా మార్చుకుందాం.
మన జ్ఞాపకాలు పంచుకుందాం..
న్యూ ఇయర్ అనగానే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డు లు, పువ్వుల బొకేలు ఉండేవి. చిన్నచిన్న గ్రామాల్లో కూడా గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసి తమ ఆత్మీయులకు అందించేవారు. ఇప్పుడు వాట్సాప్ అనే సాధనం ద్వారా చేతులు కలపకుండానే గ్రీటింగులు ఇచ్చి పుచ్చుకోవచ్చు. కరోనా కాలంలో ఇదే చక్కటి అలవాటు. ఇందుకు కొంచెం కొత్తగా ఆలోచించాలి. అందరిలా ఫార్వర్డ్ మెసేజీలు కాకుండా.. మన జ్ఞాపకాలను ఎదుటి వారికి చెప్పగలిగేలా మంచి ఫొటోను ఎంపిక చేసుకుని ఆ చిత్రం వెనుక సంఘటనను గుర్తు చేసుకుంటే కొత్త ఏడాది మొదటి రోజు హాయిగా గడిచిపోతుంది. స్నేహితులైతే చిన్నప్పటి చిత్రాలు, బంధువులైతే శుభ కార్యాల్లో సందడి చేసిన చిత్రాలు, తల్లిదండ్రులకైతే వారి పెళ్లి నాటి ఛాయా చిత్రాలు, ప్రేమికులకైతే తొలినాటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఓ సారి వాట్సాప్ చేసి చూడండి. ఆ జ్ఞాపకాల జల్లులో తడుస్తూ కొత్త ఏడాది ఆహ్వానించండి.. ఆనందాన్ని ఆస్వాదించండి.
పండ్లు, పువ్వులకు బదులు..
నూతన ఏడాది రోజున ఊరంతా తిరిగి పెద్దలను కలిసి పండ్లు, బొకేలు ఇవ్వడం అందరి కీ అలవాటు. ఆ అలవాటును వదులుకోనక్కర్లేదు. సామగ్రి ని కొద్దిగా మార్చితే చాలు. పండ్లు, బొకేలకు బదులు శానిటైజర్లు, శానిటైజ్ చేసిన చాక్లెట్లతో ఓ అందమైన బహుమతిని సురక్షితంగా ఇవ్వగలిగితే అంతకంటే భాగ్యం ఏముంటుంది? కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూలబు ట్టలో శానిటైజర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపి ఓ చిన్న కార్డుపై మన సందేశాన్ని అందిస్తే అందుకునే వారికి ఎంతో సంతోషం.
కరోనా వారియర్స్‌ను మెచ్చుకుంటే..
కొత్త ఏడాది రోజు కొత్త పనులు మొదలుపెట్టడం చాలా మందికి అలవాటు. ఈ ఏడాది కూడా అలాంటి పనులు చేయవచ్చు. ఏడాదిగా కరోనాతో పో రాడుతున్న యోధులను కొత్త ఏడాది రోజు కలిసి శుభాకాంక్షలు చెబితే అంతకంటే ఏడాదికి గొప్ప స్వాగతం ఉండదు. ప్రతి ఊరిలోనే కరోనా యోధు లు ఉంటారు. అలాంటి వారికి నూతన ఏడాది మొదటి రోజు టాప్ ప్రయారిటీ ఇస్తే ఊరూరా వేడుక సఫలమవుతుంది.
జీరో నైట్ సందడి..
డిసెంబర్ 31 రాత్రి పడుకుంటే పాపం అన్నంత గా యువత రెచ్చిపోతుంది. కానీ ఈ ఏడాది పరిస్థితులు వేరు. కాస్త శారీరకంగా బలంగా ఉన్న యువకులకు ఏమీ కాకపోవచ్చు. కానీ వయసు మళ్లిన వారికి ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకునైనా జీరో నైట్ వేడుకలు మానుకుంటే మేలు. అలాగని పూర్తిగా వదులుకోనక్కర్లేదు. వీడియో కాల్స్, వర్చువల్ కాలింగ్ పద్ధతులు ఇప్పడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ పద్ధతిలో అందరూ కలిసి వేడుక చేసుకుంటే ఎవరికీ కీడు జరగదు.
ఆన్‌లైన్ షాపింగ్‌తో సర్‌ప్రైజ్
ఇప్పుడు ట్రెండ్ మారింది. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు, సర్‌ప్రైజ్ సందేశాలు అందించడం అందరికీ ఆనవాయితీగా మారింది. మారిన ట్రెండ్ కరోనా టైమ్‌లో ఆదుకుంటోంది. బహుమతులను షాపుల్లో కొని ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వడం కంటే ఆన్‌లైన్ షాపింగ్ చేసి వారి అడ్రస్‌కు పంపిస్తే చాలు. శుభాకాంక్షలు అందిపోతాయి. గిఫ్టు కార్డులు కూడా పంపుకునే పద్ధతి వచ్చేసింది. దూరంగా ఉండక తప్పని పరిస్థితుల్లో ఈ ఆన్‌లైన్ పద్ధతి ఆ దూరాన్ని ఇలా దగ్గర చేసేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment