బీజింగ్: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్ నింపుతోంది. కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కేలా కన్పిస్తుండటంతో వారు సంబరపడుతున్నారు. జనవరి చివర్లో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
చైనా బుకింగ్ వెబ్‌సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలు కంటే ఏకంగా పది రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతున్నాయి! విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధనను చైనా ఎత్తేస్తుండటంతో పలు దేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.
చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి వచ్చిపడుతుందేమోనని బెంబేలెత్తుతున్నాయి. దాంతో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్‌తో పాటు పలు దేశాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకూ అమెరికాతో పాటు పలు ఆసియా, యూరప్ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనీయుల సంఖ్యే ఎక్కువగా ఉండేది.
అంతమయ్యే లక్షణాలే!
చైనాలో కరోనా విలయం తాండవం చేస్తున్నా వైరస్ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులుంటున్నారు. ఇక కరోనా ముగిసిపోయే దశకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. దేశంలో కరోనా పరీక్షలను బాగా తగ్గించేశారని చైనా జెజాంగ్ ప్రావిన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ డాక్టర్ అభిషేక్ కుందు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వచ్చిన వారు, ఇళ్లల్లో కోవిడ్–19 కిట్ కొనుక్కొని చేసుకుంటున్నవారే తప్ప ప్రభుత్వం చేసే పరీక్షలు తగ్గిపోయాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు కోలుకుంటున్నారని, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ కుందు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment