సునీల్ కుమార్
సాక్షి, హైదరాబాద్ , సిటీబ్యూరో : కుటుంబకలహాల కారణంగా దూరంగా ఉంటున్న భార్య నగ్నచిత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఒడిశాకు చెందిన ప్రభుత్వోద్యోగిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా కథనం ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన చిలకపాటి సునీల్‌కుమార్ ఒడిస్సాలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతనికి 2007లో శేర్‌లింగంపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులుకు వారి మధ్య మనస్పర్థలు రావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. అనంతరం సునీల్ కుమార్ విడాకులు కోరుతూ కోర్టు కెళ్లగా, భరణం చెల్లించాలంటూ బాధితురాలు విశాఖపట్నం కోర్టులో కేసు వేసింది . కోర్టుల్లో విచారణ నడుస్తుండగానే సునీల్ కుమార్ బాధితురాలిని కలిసేందుకు ప్రయత్నించాడు.
తన ఉద్యోగానికి ఇబ్బంది కలిగించేలా ఉన్న కేసులను వెనక్కి తీసుకోవాలని ఆమెను బెదిరించడమేగాక అసభ్యంగా మాట్లాడాడు. ఈ నెల 11న బాధితురాలు నగ్న ఫొటోలు, వీడియోలను ఆమె సోదరుడు వాట్సాప్ నంబర్‌కు పంపాడు. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఆ ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. సదరు ఫొటోలు, వీడియోలు తన చెల్లెలు పరువును దిగజార్చేలా ఉండటంతో ఈ నెల 19న బాధితురాలి సోదరుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడి కాల్‌డేటా, ఐపీ ఆధారంగా యాదయ్యగౌడ్ నేతృత్వంలోని బృందం ఒడిశాకు వెళ్లి సునీల్‌కుమార్‌ను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.