wanted criminal
-
బార్బర్ టు సైబర్ క్రిమినల్!
సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా లండన్‌లో నివసిస్తున్న కృష్ణకుమార్‌గా నగర యువతికి పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి, కస్టమ్స్ అధికారుల డ్రామా ఆడి రూ.10.65 లక్షలు కాజేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన ఆఫ్రికా జాతీయుడు కాబ్రెల్ ఎడ్మాండో సైబరాబాద్ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. జీడిమెట్లకు చెందిన వ్యాపారి నుంచి గతేడాది రూ.46.35 కాజేసింది కూడా ఇతడేనని ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ గుర్తించారు. దీంతో ఇతడిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబ్రెల్ కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వ్యాపారి మనోహర్‌కు గతేడాది మే 13న వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. లండన్‌లోని బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన ఎలిజిబెత్ జియోబార్జ్ పేరుతో ఇది వచ్చింది. తమ కంపెనీకి భారత్ నుంచి నిత్యం బయాస్మా యాక్టివ్ లిక్విడ్ సరఫరా అవుతుందని అందులో పేర్కొన్నాడు. దీన్ని తమకు నాగ్‌పూర్ కేంద్రంగా పని చేసే కేఎస్ ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తోందని జియోబార్జ్ చెప్పాడు. అనివార్య కారణాల వల్ల తాము నేరుగా ఖరీదు చేయలేకపోతున్నామన్నాడు. ఆ సంస్థ నుంచి మీరు సమీకరించుకుని మాకు సరఫరా చేస్తే లీటర్ రూ.95 వేలకు ఖరీదు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ 300 లీటర్లకు పర్చేజ్ ఆర్డర్ కూడా పంపాడు. ఇది చూసిన మనోహర్ కేఎస్ ఎంటర్ప్రైజెస్ వివరాలు కోరాడు. జియోబార్జ్ రెండు ఫోన్ నెంబర్లను పంపాడు. బాధితుడు వీటిలో సంప్రదించగా ఆ సంస్థకు చెందిన వారుగా ఇద్దరు మాట్లాడారు. తనకు ఒక లీటర్ బయాస్మా యాక్టివ్ లిక్విడ్ పంపాలని కోరడంతో వాళ్లు పంపారు. దీన్ని ఈయన జియోబార్జ్ చెప్పిన వారికి మహారాష్ట్రలోనే అందించాడు. బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులుగా చెప్పుకున్న వాళ్లు సదరు ఆయిల్ పరీక్షించామని, నాణ్యమైనదిగా తేలిందని చెప్పారు. తొలిదఫా 300 లీటర్లు పంపితే లండన్ చేరుస్తామన్నారు. దీంతో మనోహర్ మళ్లీ కేఎస్ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించారు. తనకు ఆ పరిమాణంలో బయాస్మా యాక్టివ్ లిక్విడ్ కావాలని ఆర్డర్ చేశాడు. దీని నిమిత్తమంటూ ఆయన నుంచి రూ.46,35,600 ఆన్లైన్లో కాజేసిన నిందితులు ఆపై తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిపై బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది అక్టోబర్ 14న కేసు నమోదైంది. కాబ్రెల్ ఎడ్మాండో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని విచారించిన నేపథ్యంలోనే అప్పట్లో జియోబార్జ్గా నగదు కాజేసింది సైతం ఇతడేనని బయటపడింది. ఇతడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం సిటీ సైబర్ కాప్స్ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇది పూర్తయిన తర్వాత సైబరాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. (చదవండి: చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం) -
ఈ దొంగను పట్టిస్తే 50 వేలిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఓ వృద్ధురాలిని చంపి బంగారు నగలతో ఉడాయించిన ఓ నిందితుడు ఏడాదిన్నరగా నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆ దొంగ సమాచారం అందిస్తే 50 వేల నజరాన ఇస్తామని రాచకొండ కమిషనర్ పోలీసులు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు తమిళనాడులోని తుత్తుకూడి గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, డ్రైవింగ్ చేస్తూ భార్యతో మెడ్చల్‌లోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివసించేవాడు. గతేడాది మార్చిలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట,వెంకటాద్రి నివాస్‌లో ఒంటిరిగా నివసిస్తున్న నాగమణి అనే వృద్ధురాలిని హతమార్చి ఆమె నగలతో ఉడాయించాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే అతని భార్యను అదుపులోకి తీసుకున్న మీర్పేట్ పోలీసులు అతని ఆచూకి కనుగొనడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పోలీసులు నిందితుని సమాచారం తెలియజేస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని, సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. -
డెకాయిట్ బాలమురుగన్ దొరికాడు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బ్యాంక్‌లను కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్న వాంటెడ్ క్రిమినల్ బాలమురుగన్‌ను కర్ణాటకలోని తిరువరూర్లో బెంగళూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హెచ్ఐవీ చికిత్స నిమిత్తం తిరువరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు బెంగళూరు పోలీసులకు ఉప్పందించడంతో వారు బాలమురగన్తో పాటు అతడి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసుల బృందం బెంగళూరు బయలుదేరి వెళ్లింది. జనవరి నుంచి గాలింపు... ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల దోపిడీ కేసులో కీలక సూత్రధారి అయిన బాలమురుగన్‌ను పట్టుకునేందుకు జనవరి నుంచి సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో మూడుసార్లు అతను పోలీసులకు మస్కాకొట్టి తప్పించుకున్నారు. నాలుగు నెలల క్రితం చెన్నై శివారులోని మేనల్లుడి ఫ్లాట్‌లో మురుగన్, భార్యతో పాటు పనివాడు, అనుచరుడు దినకర్‌తో కలిసి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా ఈ విషయాన్ని పసిగట్టిన మురగన్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యింది. ఈ సందర్భంగా సదరు ఫ్లాట్‌లో తనిఖీ నిర్వహించిన పోలీసులు అతనికి ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఐవీ కేంద్రాలకు ఫొటోలు... దీంతో బాలమురుగన్ చికిత్స పొందేందుకు ఆస్పత్రులకు వస్తాడన్న సమాచారంతో కర్ణాటక, మహారాష్ర్ట, యూపీ, తెలంగాణ, తమిళనాడులోని హెచ్ఐవీ చికిత్సా కేంద్రాలకు అతని ఫొటోలను పంపారు. ఈ నేపథ్యంలో తిరువరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులు బెంగళూరు పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు బాలమురుగన్‌ను అరెస్టు చేశారు. ఇన్నోవా ఎక్కితే జెట్ స్పీడ్.. బక్కగా ఉండే బాలమురగన్ బ్యాంక్ దోపిడీకి వెళితే అతని వెంట, తన భార్య,పెంపుడు కుక్క రూబీ తప్పనిసరిగా ఉండాల్సిందే. కారు డ్రైవింగ్‌లో నిష్ణాతుడైన ఇతను ఇన్నోవా కారులోనే దోపిడీకి వెళతాడు. పోలీసులు ఛేజ్ చేసినా కనురెప్ప పాటులో మాయమవుతాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇతని అల్లుడు హీరోగా నటిస్తున్న చిత్ర దృశ్యాలను చిత్రీకరించగా, దీనికి డీఎస్పీ స్థాయి అధికారి క్లాప్ కొట్టడం గమనార్హం. గత జనవరిలోనే ఇబ్రహీంపట్నంలోని కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. అతని గ్యాంగ్ ఇన్నోవాను అక్కడే వదిలి వెళ్లడంతో దోపిడీలు చేస్తుంది బాలమురుగన్ గ్యాంగ్‌గా సైబరాబాద్ పోలీసులు గుర్తించడంతో అప్పటినుంచి అతనిపై నిఘా పెంచడంతో హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు.