సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బ్యాంక్‌లను కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్న వాంటెడ్ క్రిమినల్ బాలమురుగన్‌ను కర్ణాటకలోని తిరువరూర్‌లో బెంగళూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హెచ్‌ఐవీ చికిత్స నిమిత్తం తిరువరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు బెంగళూరు పోలీసులకు ఉప్పందించడంతో వారు బాలమురగన్‌తో పాటు అతడి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసుల బృందం బెంగళూరు బయలుదేరి వెళ్లింది.
జనవరి నుంచి గాలింపు...
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల దోపిడీ కేసులో కీలక సూత్రధారి అయిన బాలమురుగన్‌ను పట్టుకునేందుకు జనవరి నుంచి సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో మూడుసార్లు అతను పోలీసులకు మస్కాకొట్టి తప్పించుకున్నారు. నాలుగు నెలల క్రితం చెన్నై శివారులోని మేనల్లుడి ఫ్లాట్‌లో మురుగన్, భార్యతో పాటు పనివాడు, అనుచరుడు దినకర్‌తో కలిసి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా ఈ విషయాన్ని పసిగట్టిన మురగన్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యింది. ఈ సందర్భంగా సదరు ఫ్లాట్‌లో తనిఖీ నిర్వహించిన పోలీసులు అతనికి ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తించారు.
హెచ్‌ఐవీ కేంద్రాలకు ఫొటోలు...
దీంతో బాలమురుగన్ చికిత్స పొందేందుకు ఆస్పత్రులకు వస్తాడన్న సమాచారంతో కర్ణాటక, మహారాష్ర్ట, యూపీ, తెలంగాణ, తమిళనాడులోని హెచ్‌ఐవీ చికిత్సా కేంద్రాలకు అతని ఫొటోలను పంపారు. ఈ నేపథ్యంలో తిరువరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులు బెంగళూరు పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు బాలమురుగన్‌ను అరెస్టు చేశారు.
ఇన్నోవా ఎక్కితే జెట్ స్పీడ్..
బక్కగా ఉండే బాలమురగన్ బ్యాంక్ దోపిడీకి వెళితే అతని వెంట, తన భార్య,పెంపుడు కుక్క రూబీ తప్పనిసరిగా ఉండాల్సిందే. కారు డ్రైవింగ్‌లో నిష్ణాతుడైన ఇతను ఇన్నోవా కారులోనే దోపిడీకి వెళతాడు. పోలీసులు ఛేజ్ చేసినా కనురెప్ప పాటులో మాయమవుతాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇతని అల్లుడు హీరోగా నటిస్తున్న చిత్ర దృశ్యాలను చిత్రీకరించగా, దీనికి డీఎస్‌పీ స్థాయి అధికారి క్లాప్ కొట్టడం గమనార్హం. గత జనవరిలోనే ఇబ్రహీంపట్నంలోని కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. అతని గ్యాంగ్ ఇన్నోవాను అక్కడే వదిలి వెళ్లడంతో దోపిడీలు చేస్తుంది బాలమురుగన్ గ్యాంగ్‌గా సైబరాబాద్ పోలీసులు గుర్తించడంతో అప్పటినుంచి అతనిపై నిఘా పెంచడంతో హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు.
డెకాయిట్ బాలమురుగన్ దొరికాడు
Published Fri, Oct 30 2015 9:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM
Advertisement