balamurugan
-
‘ఆమె’ బాధితులు 17 మంది
సాక్షి చెన్నై: పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న యువకులకు వల విసురుతుంది. మాయమాటలతో దగ్గరవుతుంది. పెళ్లి చేసుకుందామంటూ నమ్మిస్తుంది. కష్టాల కథలు చెప్పి అందినంత కాజేసి, అవసరం తీరాక మొహం చాటేస్తుంది. ఇలా ఆ కిలాడీ యువతి వలలో చిక్కుకున్న యువకులు 17 మంది. బాధిత యువకులు కొందరు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మాయలేడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడులోని కడలూరు జిల్లా వలయామదేవి ప్రాంతానికి చెందిన ఎంబీఏ పట్టభద్రుడైన బాలమురుగన్ (33) అనే బంగారు నగల వ్యాపారి తన వివాహం కోసం కొన్నేళ్ల క్రితం మాట్రిమోనియల్ వెబ్సైట్లో పేరు, వివరాలు నమోదు చేశాడు. సేలం జిల్లా ఆట్టయంపట్టి సమీపం మరుమలయంపాళెంకు చెందిన 25 ఏళ్ల యువతి అతడిని సంప్రదించి 2016 సెప్టెంబరు నుంచి పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించింది. తన కుటుంబ కష్టాలు, అవసరాలు చెప్పుకుంటూ డబ్బులు, ఇంటికి కావాల్సిన వస్తువులను అతడి ద్వారా పొందేది. ఇలా రూ.23 లక్షల వరకూ యువతికి సమర్పించుకున్నాడు. ఆ తరువాత క్రమేణా అతనితో మాట్లాడడం తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలో యువతి ఇంటికి వెళ్లినపుడు ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా చాలామంది యువకులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, అసభ్యంగా తీసుకున్న సెల్ఫీలు, ప్రేమ ముసుగులో అసభ్య చాటింగులు, ఎస్ఎంఎస్లు చూసి మోసపోయినట్లు తెలుసుకున్నాడు. తానిచ్చిన డబ్బు, నగలు తిరిగి పొందేందుకు సేలంకు చెందిన రాజా అనే వ్యక్తి ద్వారా సంప్రదించగా అతడు కూడా యువతితో చేరిపోయి బాలమురుగన్‌తో బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టించి ఫొటోలు తీసి వెళ్లగొట్టారు. తరువాత ఆ దృశ్యాలను చూపుతూ మరికొన్ని లక్షలు ఇవ్వాల్సిందిగా హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని బాలమురుగన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించడంతో సదరు కిలాడీ లేడీ పారిపోయింది. పోలీసుల ప్రాథమిక విచారణలో బాలమురుగన్ తరహాలోనే కోయంబత్తూరు, మదురై, చెన్నై, తిరుచ్చిరాపల్లి ప్రాంతాలకు చెందిన 17 మంది యువకులను మోసగించి రూ.85 లక్షల వరకు కాజేసినట్లు తేలింది. -
బ్యాంకు దోపిడీ దొంగ అరెస్టు
796 గ్రాముల బంగారం స్వాధీనం నిందితుడు సినిమా నిర్మాత ? సత్యవేడు : చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో 2014 నవంబర్ 16న జరిగిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి తమిళనాడు రాష్ట్రం తిరువారుర్కు చెందిన ఎన్.బాలమురుగన్(45)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్న అతడిని ఈ నెల తొమ్మిదో తేదీ పీటీ వారెంట్‌పై వరదయ్యపాళెం పోలీసులు తీసుకొచ్చారు. నిందితుడి నుంచి 796 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. చిన్న వయసు నుంచే.. బాలమురుగన్ 18 ఏళ్ల వయసు నుంచే చోరీలకు అలవాటుపడ్డాడు. ఇతనిపై ఇంటి దొంగతనాలకు సంబంధించి తమిళనాడులో 30 కేసులు, కర్ణాటకలో 80 వరకు కేసులు ఉన్నాయి. బెంగళూరులో చోరీలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడ మంజుల అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు అందరూ తమిళనాడులో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. గొప్పవాడు కావాలని... తమ కుటుంబ సభ్యుల కంటే గొప్పగా ఉండాలని, తనకు గుర్తింపు రావాలని బాలమురుగన్ సినిమాలు తీయాలని ఆలోచించాడు. అందుకు డబ్బు ఎక్కువ కావాల్సి వస్తుందనే ఉద్దేశంతో చిన్న దొంగతనాలు మానేసి బ్యాంకు దోపిడికీ ప్లాన్ చేశాడు. ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నపుడు మొబైల్లో ఇంటర్నెట్ ద్వారా దొంగతనం చాకచక్యంగా చేసే విధానం తెలుసుకున్నాడు. సెక్యూరిటీ ఉన్న బ్యాంకుల వివరాలను మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే గుర్తించాడు. చోరీ సమయంలో గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచేవాడు. మొట్ట మొదట అతడు హైదరాబాద్‌లోని ఓ గ్రామీణ బ్యాంకులో చోరీ చేశాడు. అనంతరం వరదయ్యపాళెం బ్యాంకు, ఆ తరువాత బాలానగర్ బ్యాంకుల్లో దొంగతనాలు చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోనూ నాలుగు బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు ప్రస్తుతం ‘మనసా వినవే’ అనే తెలుగు సినిమా ను రూ. 7 కోట్లు ఖర్చు చేసి తీస్తున్నట్లు తెలిసింది. మీడియా సమావేశంలో వరదయ్యపాళెం సీఐ టి.నరసింహులు, ఎస్ఐ షేక్షావలిపాల్గొన్నారు. -
డెకాయిట్ బాలమురుగన్ దొరికాడు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బ్యాంక్‌లను కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్న వాంటెడ్ క్రిమినల్ బాలమురుగన్‌ను కర్ణాటకలోని తిరువరూర్లో బెంగళూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హెచ్ఐవీ చికిత్స నిమిత్తం తిరువరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు బెంగళూరు పోలీసులకు ఉప్పందించడంతో వారు బాలమురగన్తో పాటు అతడి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసుల బృందం బెంగళూరు బయలుదేరి వెళ్లింది. జనవరి నుంచి గాలింపు... ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల దోపిడీ కేసులో కీలక సూత్రధారి అయిన బాలమురుగన్‌ను పట్టుకునేందుకు జనవరి నుంచి సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో మూడుసార్లు అతను పోలీసులకు మస్కాకొట్టి తప్పించుకున్నారు. నాలుగు నెలల క్రితం చెన్నై శివారులోని మేనల్లుడి ఫ్లాట్‌లో మురుగన్, భార్యతో పాటు పనివాడు, అనుచరుడు దినకర్‌తో కలిసి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా ఈ విషయాన్ని పసిగట్టిన మురగన్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యింది. ఈ సందర్భంగా సదరు ఫ్లాట్‌లో తనిఖీ నిర్వహించిన పోలీసులు అతనికి ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఐవీ కేంద్రాలకు ఫొటోలు... దీంతో బాలమురుగన్ చికిత్స పొందేందుకు ఆస్పత్రులకు వస్తాడన్న సమాచారంతో కర్ణాటక, మహారాష్ర్ట, యూపీ, తెలంగాణ, తమిళనాడులోని హెచ్ఐవీ చికిత్సా కేంద్రాలకు అతని ఫొటోలను పంపారు. ఈ నేపథ్యంలో తిరువరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులు బెంగళూరు పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు బాలమురుగన్‌ను అరెస్టు చేశారు. ఇన్నోవా ఎక్కితే జెట్ స్పీడ్.. బక్కగా ఉండే బాలమురగన్ బ్యాంక్ దోపిడీకి వెళితే అతని వెంట, తన భార్య,పెంపుడు కుక్క రూబీ తప్పనిసరిగా ఉండాల్సిందే. కారు డ్రైవింగ్‌లో నిష్ణాతుడైన ఇతను ఇన్నోవా కారులోనే దోపిడీకి వెళతాడు. పోలీసులు ఛేజ్ చేసినా కనురెప్ప పాటులో మాయమవుతాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇతని అల్లుడు హీరోగా నటిస్తున్న చిత్ర దృశ్యాలను చిత్రీకరించగా, దీనికి డీఎస్పీ స్థాయి అధికారి క్లాప్ కొట్టడం గమనార్హం. గత జనవరిలోనే ఇబ్రహీంపట్నంలోని కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. అతని గ్యాంగ్ ఇన్నోవాను అక్కడే వదిలి వెళ్లడంతో దోపిడీలు చేస్తుంది బాలమురుగన్ గ్యాంగ్‌గా సైబరాబాద్ పోలీసులు గుర్తించడంతో అప్పటినుంచి అతనిపై నిఘా పెంచడంతో హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు. -
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు ఎస్‌బీక్యూ ఉప్పు పరిశ్రమ ఎదుట బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతిచెందాడు. వేరే ఊరెళ్లటానికి లారీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు చెన్నైలోని అన్నానగర్‌కు చెందిన బాలమురుగన్(40) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.