ఘరానా మోసగాడి ముందస్తు బెయిల్‌కు నో
ముంబై: మ్యాట్రిమోనియల్ సైట్లలో అవివాహిత మహిళలను వేధిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఘరానా మోసగాడికి కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పబ్బం గడుపుకోవడమే అలవాటుగా మార్చుకున్నాడంటూ మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా వసాయ్‌కి చెందిన ఇమాదుద్దీన్ ఇర్ఫాన్ షేక్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జి జయేంద్ర జగ్దలే వ్యాఖ్యానించారు. మోసం, వేధింపులు, లైంగిక దాడికి యత్నం తదితర సెక్షన్ల కింద పోలీసులు ఇతడిపై కేసు పెట్టారు.
మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వైద్యురాలైన బాధితురాలికి నిందితుడు ఇర్ఫాన్ షేక్ పరిచయమయ్యాడు. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇర్ఫాన్ షేక్‌కు అప్పటికే పెళ్లయి, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం మాత్రం బాధితురాలికి చెప్పకుండా దాచాడు. కొన్ని రోజుల తర్వాత మోసం బయటపడింది. అప్పటి నుంచి అతడి నుంచి వేరుగా ఉంటోంది. నిందితుడు మాత్రం వాట్సాప్ కాల్స్‌తో వేధించడం మానలేదు. ఆమె వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానంటూ బెదిరిస్తున్నాడు.
ఈ క్రమంలో 2024 జూన్‌లో బాధితురాలి కారులోకి బలవంతంగా చొరబడ్డ ఇర్ఫాన్ షేక్ తుపాకీ లాంటి ఆయుధంతో బెదిరించి, లైంగిక దాడికి యతి్నంచాడు. తనను కాదని వేరెవరిని పెళ్లి చేసుకున్నా పరిణామాలు దారుణంగా ఉంటాయని వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇర్ఫాన్ షేక్ గతంలో మ్యాట్రిమోనియల్ సైట్లలో బ్యాంక్ ఉద్యోగినంటూ ఒకరిని మోసం చేసినట్లు గుర్తించారు. పోలీసు అధికారి పేరుతో, న్యాయశాఖ చిహ్నాన్ని తన వాహనంపై అతికించుకుని వసూళ్లకు పాల్పడ్డాడని తేల్చారు.
మ్యాట్రిమోనియల్ సైట్‌కు సంబంధించిన మరో కేసులో తెలంగాణ పోలీసులు ఇతడిని అరెస్ట్ కూడా చేశారని కోర్టుకు పోలీసులు నివేదించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న జడ్జి జయేంద్ర..ఇతడి నేర చరిత్రను వెలికి తీసేందుకు, మున్ముందు ఇతడి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇతడిపై అభియోగాలు తీవ్రమైనవని, అందుకు తగు ఆధారాలు సైతం ఉన్నాయన్నారు. బెయిలిస్తే విచారణకు అవరోధం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment