సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజాకిరణ్ మరోసారి సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావాలని సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేశారు. తద్వారా దర్యాప్తునకు ఏమాత్రం సహకరించే ప్రసక్తే లేదన్న వైఖరిని పునరుద్ఘాటించారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టం, ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల నిధులను మళ్లించిన కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు రామోజీరావు, శైలజాకిరణ్‌కు నోటీసులు జారీ చేశారు.
వీరు ఈ నెల 16న (బుధవారం) విచారణకు హాజ రు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరుకాలేదు. సీఐడీ దర్యాప్తునకు రామోజీరావు, శైలజాకిరణ్ ముఖం చాటేయడం ఇది రెండోసారి. ఈ కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయంలో జూలై 5న విచారణకు హాజరు కావాలని గతంలో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు.
అప్పుడు కూడా కేవలం మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగానే తాము చేశామని వారు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కానీ రామోజీరావు, శైలజాకిరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. తాము విచారణకు హాజరయ్యే పరిస్థితుల్లో లేమని సీఐడీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా తెలిపారు.
మళ్లీ కూడా అదే వైఖరి
రామోజీరావు, శైలజాకిరణ్‌కు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ ఈ నెల 9న నోటీసులు జారీ చేసింది. ఈసారీ వారిద్దరూ విచారణకు ముఖం చాటేశారు. ఈ కేసులో రామోజీరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఓసా రి, శైలజాకిరణ్‌ను రెండుసార్లు సీఐడీ అధికారులు విచారించారు. ఆ విచారణ సమయంలో ఇంటి గేట్లు ఉద్దేశ పూర్వకంగా తెరవకుండా అధికారులను వేచి చూసేలా చేశారు. ఆపై విచారణకు ఏమాత్రం సహకరించ లేదు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల నిధులు మళ్లించినందున.. అంటే నేరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగినందున వారిద్దరినీ రాష్ట్రంలోనే విచారించాల్సి ఉంది. అందుకే ఏపీలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment