ఎర్రచందనం అక్రమ రవాణా.. హత్య కంటే తీవ్రం | CJI NV Ramana Inaugurates 2 Special Courts In Tirupati | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం అక్రమ రవాణా.. హత్య కంటే తీవ్రం

Published Fri, Jun 10 2022 9:44 AM | Last Updated on Fri, Jun 10 2022 2:56 PM

CJI NV Ramana Inaugurates 2 Special Courts In Tirupati - Sakshi

ఎస్వీయూ సెనేట్‌ హాల్లో ప్రసంగిస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

తిరుపతి లీగల్‌: ఎర్రచందనం అక్రమ రవాణాను మనిషి హత్య కంటే తీవ్రమైన నేరంగా భావించి మరణశిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణ నిమిత్తం గురువారం రెండు కోర్టులను ప్రారంభించిన అనంతరం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌ హాలులో సమావేశం నిర్వహించారు.
చదవండి: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా..

ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ ఎన్వీ రమణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల్లో మాత్రమే లభిస్తుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అధికంగా ఉండడంవల్లే అక్రమ రవాణా జరుగుతోందన్నారు. స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చట్టంలో శిక్షా కాలాన్ని, జరిమానాలను పెంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదన్నారు.  
సత్వర న్యాయం అందించాలి..

న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర ఎంత ఉందో.. న్యాయవాదుల పాత్ర అంతే ఉందన్నారు. న్యాయవాదులు కేసులను వాయిదాలు తీసుకోకుండా కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు. భవిష్యత్తు డిజిటల్‌ వైపు పరుగులు తీస్తోందని, అందుకు తగ్గట్లుగా సీనియర్, జూనియర్‌ న్యాయవాదులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో 195 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా అందులో 167 పోస్టుల్లో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. 11మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించామన్నారు. 180 న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సీజేఐ తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి న్యాయమూర్తుల పనిలేకుండా కోర్టులు మాత్రమే ఉండేటట్లు భవిష్యత్తులో జరగాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్షించారు.

కేసుల సంఖ్య పెరుగుతోంది : హైకోర్టు సీజేఐ 
అనంతరం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు త్వరలో ఎర్రచందనం కేసుల విచారణకు మరికొన్ని కోర్టులను ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం సీజేఐని న్యాయమూర్తులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల న్యాయవాదుల సంఘాల కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, బదిలీపై వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమానుల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి భీమారావ్, తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, హైకోర్టు రిజి్రస్టార్‌ దుప్పల వెంకటరమణ, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షులు దినకర్, స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.  
అంతకుముందు.. ఎర్రచందనం కేసుల విచారణకు ఏర్పాటుచేసిన రెండు కోర్టులను ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక కోర్టు సెషన్స్‌ జడ్జిగా ఎన్‌.నాగరాజు, స్థానిక నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి గ్రంధి శ్రీనివాస్‌ ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తిగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాలి
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎర్రచందనం కేసుల విచారణకు తాజాగా ఏర్పాటుచేసిన రెండు కోర్టులే కాకుండా మరిన్ని కోర్టులను రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుచేయాలని సీజేఐ సూచించారు. కోర్టులతో పాటు న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బంది నియామకాలు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు. కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న నిధులను పెంచాలన్నారు.

ఇన్ని రోజులు ఎర్రచందనం విచారణకు ప్రత్యేక కోర్టు లేకపోవడంతో ప్రస్తుతం 2,340 కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అమాయక ప్రజలు వెళ్లకుండా అటవీ శాఖ సిబ్బంది అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జీఓలను నియమించి అక్రమ రవాణాను ఆపాలని సీజేఐ సూచించారు. అడవులను కొల్లగొట్టడంవల్ల మానవజాతికి కలిగే దు్రష్పభావాలను అందరూ గమనించాలన్నారు. ఇక తుడా కాంప్లెక్స్‌లోని రెండు భవనాలను రెండు కోర్టుల ఏర్పాటుకు తక్కువ అద్దెకు ఇవ్వడానికి అంగీకరించిన చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement