న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న నేరపూరిత కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, అవసరమైన నిధులను కూడా అంచనా వేసి ఆ వివరాలను తమకు అందించాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. ప్రత్యేక కోర్టులకు జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది, మౌలిక వసతుల కల్పన విషయాలను తామే పర్యవేక్షిస్తామంది. 2014 సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తంగా 1,581 కేసులు ఉన్నట్లు తేలడం తెలిసిందే.
ఈ కేసుల్లో ఎన్నింటిని పరిష్కరించారు? ఎన్ని కేసుల్లో నిందితులను దోషులు లేదా నిర్దోషులుగా తేల్చారనే వివరాలను తమకు అందించాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఆత్మారామ్ నాదకర్ణి వాదనలు వినిపిస్తూ రాజకీయ నాయకులు నిందితులుగా ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ధర్మాసనానికి విన్నవించారు. దోషులుగా తేలిన నేతలు ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాలం నిషేధం విధించాలన్న ఎన్నికల సంఘం సిఫార్సులను కూడా కేంద్రం పరిశీలిస్తోందన్నారు. కొత్తగా ఏర్పాటు చేయదలచిన ప్రత్యేక కోర్టులను ప్రస్తుతం ఉన్న సీబీఐ కోర్టులతో కలపవచ్చా అని కేంద్రం కోరగా, ‘ప్రత్యేక కోర్టులను మరే కోర్టుతోనూ కలపకూడదు. ఇవి దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేయాల్సినవి’ అని కోర్టు పేర్కొంది.
ఒక్కో కోర్టులో 4 వేల కేసులు పెండింగ్!
ప్రస్తుతం దేశంలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో ప్రతి కోర్టులో దాదాపు 4 వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు గత ఆదేశాల ప్రకారం రాజకీయ నేతలపై కేసుల్లో ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలంటే ఓ జడ్జి ప్రత్యేకంగా ఆ కేసులను మాత్రమే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం అంచనా వేసింది. ప్రజాప్రతినిధుల చట్టంలోని ప్రస్తుత సెక్షన్ల ప్రకారం ఓ రాజకీయ నాయకుడు ఏదైనా నేరపూరితమైన కేసులో దోషిగా తేలిన సందర్భంలో శిక్షా కాలం పూర్తయిన తర్వాత ఆరు సంవత్సరాల వరకు అతను పోటీ చేయడానికి అనర్హుడు. ఇది రాజ్యాంగ విరుద్ధమనీ, ఆ సెక్షన్‌ను కొట్టేయాలని వచ్చిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. వివరాలను సమర్పించేందుకు తమకు ఆరు వారాల గడువు కావాలని ఏఎస్జీ కోరడంతో కేసును డిసెంబరు 13కు వాయిదా వేసింది.
నేతలపై విచారణకు ప్రత్యేక కోర్టులు!
Published Thu, Nov 2 2017 2:18 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment