సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్‌ఎస్ విజయ గర్జన సభ డిసెంబర్ 19న నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అధిష్టానం నుంచి సంకేతాలు అందినట్లు పార్టీ వర్గాల సమాచారం. విజయ గర్జన సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందుకు ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లా కేంద్రాన్ని వేదికగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ సభను మామునూరు రంగలీల మైదానంలో నవంబర్ 15న పెట్టాలని తొలుత అనుకున్నా.. 29న దీక్షా దివస్ రోజున అయితే బాగుంటుందని ఆ రోజుకు మార్చారు. ఇందుకోసం వరంగల్ జిల్లా కాకుండా హనుమకొండ జిల్లా మడికొండ, దేవన్నపేట, కాజీపేట ప్రాంతాలను పరిశీలించారు. చివరకు దేవన్నపేటను ఈ నెల 5న ఎంపిక చేశారు. అక్కడ ఏర్పాట్లు చేసే క్రమంలో 9న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.
దీంతో సభ నిర్వహణను మరోసారి రద్దు చేశారు. తాజాగా వచ్చే నెల 16న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నిర్వహించాలని నిర్ణయించి, డిసెంబర్ 19ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దేవన్నపేట శివారులోని సుమారు 20 ఎకరాల్లో సభ కోసం భూమి చదును చేసే పనులు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment