సాక్షి, వరంగల్: అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైద్య విద్య కోసం రష్యా చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలోనే వైద్య విద్య చదివేందుకు సరిపడా సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో అయిదు కాలేజీలు ఉండగా.. కొత్తగా 12 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని తెలిపారు. హరీశ్‌రావు సారథ్యంలో ఇది సాధ్యమైందన్న కేసీఆర్.. త్వరలోనే జిల్లాకొక మెడికల్ కాలేజీ వస్తుందన్నారు.
కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రులను తిట్టిపోతారని, కేంద్ర మంత్రులు వచ్చి తిట్టిపోయిన మరునాడే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని తెలిపారు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు.
ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువగా ఉంది. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాము. తెలంగాణ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం ఉంది. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నాం. ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం. మరిన్ని విజయాలు సాధించాలి. తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక మార్గదర్శకంగా మారింది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లక్ష‍్మణ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment