సాక్షి, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా సీపీఐ శుక్రవారం హైదరాబాద్ అర్థనగ్న ప్రదర్శన చేపట్టింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆపాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషాతో పాటు పలువురు పార్టీ నేతలు అర్థ నగ్నంగా నిరసన తెలిపారు. ’పదవులను అమ్ముకున్న ప్రజా ప్రతినిధులు ఏదైనా అమ్ముకునే సమర్థులు.. అమ్ముడపోయిన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులారా...తస్మాస్ ...జాగ్రత్త....’ అని బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ... వేలాదిమంది ఓటర్లు నమ్మి అసెంబ్లీకి పంపితే సిగ్గు విడిచి పార్టీలు మారుతున్నారని దుయ్యబట్టారు. జనాన్ని మోసం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను అమ్మడానికి కూడా వెనకాడరని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వాళ్లు సిగ్గుపడాలని విమర్శించారు. కేసీఆర్ కంటే వైఎస్ జగన్ చిన్నవాడని, అతడిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, కేసీఆర్ ముగ్గురు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా తయారవుతారని అన్నారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం వంటింటి కుందేలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment