Akshay Raut
-
450 కోట్లతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ధి
హైదరాబాద్: దేశంలో ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను స్వచ్ఛ ఐకానిక్ స్థలాలుగా గుర్తించి వాటిని రూ.450 కోట్ల వ్యయంతో పర్యాటక అనుకూల ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మూడో దశ స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాలను ప్రకటించారు. ఇందులో కణ్వాశ్రమ్ (ఉత్తరాఖండ్), బ్రహ్మసరోవర్ టెంపుల్(హరియాణా), శ్రీనాగ్వాసుకి ఆలయం (ఉత్తరప్రదేశ్), శబరిమల శ్రీధర్మసస్థ టెంపుల్ (కేరళ), శ్రీరాఘవేంద్రస్వామి మంత్రాలయం (ఆంధ్రప్రదేశ్), పాంగోంగ్‌త్సో(జమ్మూ కశ్మీర్), మన విలేజ్ (ఉత్తరాఖండ్), విదుర్కుటి టెంపుల్ (ఉత్తరప్రదేశ్), ఎమాకైథెల్ (మణిపూర్), హజార్ దువారి ప్యాలెస్ (పశ్చిమబెంగాల్)ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి ఏ ప్రాంతం ఎంపిక కాలేదు. మొత్తం మూడు దశల్లో 30 ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఐకానిక్ ప్రాంతాలుగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో కార్పొరేట్ సంస్థకు అప్పగించామని ఈ సందర్భంగా అక్షయ్ రౌత్ తెలిపారు. చార్మినార్‌లో భారీ పాదచారుల ప్రాజెక్టు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ చార్మినార్ పరిసర ప్రాం తాల అభివృద్ధికి అతిపెద్ద పాదచారుల ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. చార్మినార్ వద్ద నిత్యం శానిటేషన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థల నిధుల విడుదలలో మరింత సరళీకృతంగా ఉండాలని తెలిపారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.35.10 కోట్ల జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. స్వచ్ఛ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
ఎనిమిదిలోనూ భారీ పోలింగ్
* 7 రాష్ట్రాల్లోని 64 లోక్‌సభ స్థానాల్లో 63.8 శాతం పోలింగ్ * అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 81.28% * 41 నియోజకవర్గాలకు మే 12న చివరి విడత ఎన్నికలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో 8వ దశ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు సహా ఏడు రాష్ట్రాల్లోని 64 లోక్‌సభ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ ముగిసింది. మొదటి విడత నుంచి ఓటెత్తుతున్న భారీ పోలింగ్ ఈ దశలోనూ కొనసాగింది. మొత్తం 9.5 కోట్ల ఓటర్లకు గానూ.. దాదాపు 6.06 కోట్ల మంది (63.8%) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన సోదరుడు వరుణ్ గాంధీ, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి సహా 1737 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఓ పోలింగ్ బూత్‌ను ఆక్రమించేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు. దాంతోపాటు, కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన 502 స్థానాల్లో రికార్డుస్థాయిలో 66.27% పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. 2009 ఎన్నికల్లో ఈ 502 నియోజకవర్గాల్లో 57.74 శాతం పోలింగ్ మాత్రమే నమోదయిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత ఈ శాతం మరింత పెరగొచ్చన్నారు. ► ఈ విడతలో అత్యధిక శాతం పోలింగ్ పశ్చిమబెంగాల్లో నమోదైంది. అక్కడ 81.28% ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానాల్లో 77.72% ఓటింగ్ నమోదైంది. ► ఉత్తరప్రదేశ్‌లో 55.52%, బీహార్‌లో 58% పోలింగ్ నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లోని 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు హోరాహోరీ తలపడ్డాయి. రాహుల్‌గాంధీ బరిలో ఉన్న అమేథీలో 55.2% పోలింగ్ నమోదయింది. 2004 నుంచి వరుసగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌గాంధీ.. మొదటిసారి ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లి ఎన్నికల సరళిని పరిశీలించారు. ► జమ్మూ, కాశ్మీర్‌లోని బారాముల్లాలో మాత్రం వేర్పాటు వాదుల భయానికి ఓటర్లు ఓటేసేందుకు ముందుకురాలేదు. బారాముల్లా, లడఖ్ స్థానాల్లో 49.96% పోలింగ్ మాత్రమే నమోదైంది. గత ఎన్నికల్లో ఇది 39.68 శాతమే. ► నాలుగు స్థానాల్లో ఎన్నికలు జరిగిన హిమాచల్‌ప్రదేశ్‌లో 66.5%, ఐదు స్థానాల్లో పోలింగ్ జరిగిన ఉత్తరాఖండ్‌లో 62% పోలింగ్ నమోదైంది. 2009 ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో 53.7%, ఉత్తరాఖండ్‌లో 53.68% నమోదయింది. ► మొత్తంమీద ఈ విడత ఎన్నికల్లో బుధవారం నాటికి దేశం మొత్తంమీద 502 స్థానాల్లో పోలింగ్ పూర్తవగా.. మిగిలిన 41 నియోజకవర్గాల్లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ఓటేసిన తొలి ఓటరు కినౌర్: స్వతంత్ర భారత తొలి ఓటరు.. శ్యాంశరణ్ నేగి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 97 ఏళ్ల నేగి హిమాచల్ ప్రదేశ్‌లోని కినౌర్ జిల్లా కల్పాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం.. ఇంకు పూసిన చూపుడు వేలిని మీడియాకు చూపారు. హిమాచల్‌ప్రదేశ్ సాంప్రదాయ టోపీ ధరించి, ఊతకర్ర సహాయంతో భార్యతో కలసి ఉదయం 6.55 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయనకు ఎన్నికల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఓటేసి బయటకొచ్చిన నేగీని శాలువా కప్పి సత్కరించారు. ‘నేను తొలి ఓటు వేసిన రోజు ఇప్పటికీ జ్ఞాపకముంది. ఆ ఆనందం, ఆ ఉద్వేగం జ్ఞాపకమున్నాయి. ఈ సారీ ఓటు వేశాను’ అని ఆయన అన్నారు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి వరకు జరిగిన దేశ తొలి సాధారణ ఎన్నికల్లో తొలి ఓటు ఆయనే వేశారు. అప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్న నేగి వయస్సు 34 ఏళ్లు. ఆనాడు తొలి పోలింగ్ కేంద్రాన్ని కల్పాలోనే ఏర్పాటుచేశారు. అక్కడే ఎన్నికల విధుల్లో ఉన్న నేగి తొలుత తానే ఓటేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆయనను భారత తొలి ఓటరుగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తూనే ఉన్నారు.