సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెదురుమదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మొత్తం 14 శాసనసభ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఈవీఎంలు మొరాయించడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియలో అంతరాయం ఏర్పడింది.
దీంతో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అధికారులు వెంటనే తేరుకుని సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపి సమస్యలను పరిష్కరించారు. జిల్లాలో 53,48,927 మంది ఓటర్లుండగా.. బుధవారం నాటి పోలింగ్ ప్రక్రియలో కేవలం 32 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా జిల్లాలో 60 శాతం ఓటింగ్ నమోదైందని అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి.
ఈవీఎంలు మెరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ స్తబ్ధుగా సాగింది. దీంతో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. ఈ నేపథ్యంలో రాత్రి పొద్దుపోయేవరకు పోలింగ్ సాగింది. అధికారుల తుది గణాంకాలు కొలిక్కి వస్తే పోలింగ్ శాతంలో కొంత మార్పు రావచ్చు.
కనిపించని జోరు..
సార్వత్రిక పోలింగ్ జిల్లాలో మందకొడిగా సాగింది. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేయడంతోపాటు గంటపాటు పోలింగ్ సమయాన్ని పెంచింది. అంతేకాకుండా ప్రత్యేక ప్రకటనలు, కళాజాతలతో క్షేత్రస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ భారీ కార్యక్రమాలనే చేపట్టింది. అంతేకాకుంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాను ఎంపికచేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చేట్టింది.
ఈనేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకొని ఓటరుగా నమోదయ్యారు. కానీ బుధవారం నాటి సార్వత్రిక పోలింగ్‌లో మాత్రం ఆ జోరు కనిపించలేదు. ఫలితంగా జిల్లాలో ఓటింగ్ సమయం ముగిసేనాటికి 60శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 58.16శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఓటింగ్ కాస్త పుంజెకుందని తెలుస్తోంది.
పోలింగ్ సాగిందిలా..
ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9గంటల ప్రాంతంలో 12.5% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండు గంటల అనంతరం 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 26%కు చేరింది. ఒంటి గంట ప్రాంతంలో పోలింగ్ 39.6%, మధ్యాహ్నం 3గంటలకు 50.4%, సాయంత్రం 5గంటలకు 56.7% నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 60శాతం నమోదైనట్లు కలెక్టర్ బీ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
7.30 వరకు పోలింగ్..
తాండూరు మండలం నారాయణపూర్ గ్రామంలో రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో జనం ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్‌కు తరలివచ్చి క్యూలో నిల్చోవడంతో వారందరికీ ఓటువేసే అవకాశం కల్పించారు. దీంతో ఆ గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ముగిసింది.
ఓటింగ్ అంతంతే!
Published Thu, May 1 2014 12:09 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement