
పొత్తు కోసం వెంపర్లాడం: పొన్నాల లక్ష్మయ్య
టీఆర్‌ఎస్‌తో సరిపోతుందో లేదో చూస్తాం: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సహా ఎవరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడబోమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ సరిపోతుందో లేదో చూశాకనే ఆ పార్టీతో పొత్తు విషయమై ఆలోచిస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత బుధవారం ఢిల్లీనుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీభవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. బడుగు, బలహీనవర్గాలు, దళితులకు కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తుందని, పీసీసీ తాజా కమిటీల ఎంపికే దీనికి తార్కాణమని పొన్నాల చెప్పారు. సోనియాగాంధీ చిత్తశుద్ధి, పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది తప్ప వేరొకరెవరూ కారణం కాదని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగిందో ప్రపంచమంతటికీ తెలుసు.
ఒప్పందం చేసుకున్న వారు ఎలా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఇద్దరు ఎంపీలున్న పార్టీ (టీఆర్‌ఎస్)తో తెలంగాణ సాధ్యమయ్యేదేనా? పేరుకు ఇద్దరున్నా అందులో ఒకరు సరిగాలేనే లేరు. ఇలాంటి పార్టీతో 545 మంది సభ్యులున్న లోక్‌సభలో తెలంగాణ ఆమోదం పొందేదా?’’ అని ప్రశ్నించారు. పొత్తులపై టీఆర్‌ఎస్ ఏర్పాటుచేసిన కమిటీతో తమకు సంబంధం లేదన్నారు. పొత్తు కోసం ఆ పార్టీయే తగిన ప్రతిపాదనలతో ముందుకు వస్తే.. ఆ ప్రతిపాదనలు తమకు సరిపోతాయో లేదో, పొత్తు అవసరమా, కాదా? అన్న అంశాలు లోతుగా విశ్లేషించాక చర్చలు జరుపుతామని పొన్నాల తేల్చి చెప్పారు. ‘‘విలీనమని చెప్పిన ఆయన (కేసీఆర్) మాట తప్పాడు. ప్రజలు కూడా దీన్ని గమనించారు..’ అని పేర్కొన్నారు.
తమతో పొత్తు కోసం టీఆర్‌ఎస్ ఒక్కటే కాదని, అనేక పార్టీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తనంతటి నాయకుడు లేనేలేడని కేసీఆర్ అనుకుంటే తామేం చేస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీపీసీసీ ఏర్పాటుపై సీనియర్లలో అసంతృప్తి లేదని చెప్పారు. దిగ్విజయ్ ఈనెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో ఉంటారని, తొలిరోజున టీపీసీసీ ఎన్నికల కమిటీతో సమావేశమవుతారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించి ఘన విజయం చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంటు పదవి అనేక రాష్ట్రాల్లో ఉందని, తెలంగాణకు కొత్తగా పెట్టలేదని సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా తెలిపారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, రాజయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఫున స్వాగతం: బుధవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయూనికి చేరుకున్న పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌ల బృందానికి పార్టీ నేతలు పలువురు స్వాగతం పలికారు. హజ్ టెర్మినల్ వద్ద కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడటంతో తోపులాట నెలకొంది. ఒక దశలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పొన్నాల బృందం అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత గాంధీభవన్‌లో ప్రత్యేక పూజలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల ఆటపాటలతో గాంధీభవన్ కోలాహలంగా మారింది. సీనియర్ నేతలు మాత్రం ఎక్కడా కన్పించలేదు. టీపీసీసీ ఎంపిక తీరుపై తీవ్ర నిరసనతో ఉన్నందునే సీనియర్ లెవ్వరూ రాలే దని సమాచారం.
కార్యకర్తల కొట్లాట
పొన్నాల విలేకరుల సమావేశానికి ముందు కార్యకర్తలు కొట్లాటకు దిగారు. సమావేశ మందిరంలోనికి పార్టీ ప్రస్తుత అధికార ప్రతినిధి గడ్డం శ్రీనివాస్‌యాదవ్, ఆయన అనుచరులు రాబోగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడి పోయిన పల్లె లక్ష్మణ్‌గౌడ్ అనుచరులు అడ్డుకున్నారు.
దీంతో కోపోద్రిక్తులైన శ్రీనివాస్‌యాదవ్ అనుచరులు లక్ష్మణ్‌గౌడ్ అనుచరులపై చేయిచేసుకున్నారు. లక్ష్మణ్‌గౌడ్ అనుచరులు శ్రీని వాస్‌యాదవ్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఇరువర్గాలు కుర్చీలు విసురుకున్నాయి. దానం నాగేందర్ జోక్యం చేసుకుని శ్రీనివాస్‌యాదవ్‌ను సముదాయించారు. ఇలావుండగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి పొన్నాలకు స్వాగతం పలుకుతూ శంషాబాద్ విమానాశ్రయంలో ర్యాలీ నిర్వహించినందుకు ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైంది.