పొన్నాల.. నెరవేరిన కల
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయాలనేది పొన్నాల లక్ష్మయ్య చిరకాల వాంఛ. గత దశాబ్ద కాలంగా పొన్నాల పీసీసీ పీఠం కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు. కలవని నేత లేరు. నాలుగోసారి తన ప్రయత్నాన్ని సఫలం చేసుకున్నారు.2003 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు పీసీసీ అధ్యక్ష నియామకం చేపట్టారు. 2003లో డి.శ్రీనివాస్, 2005లో కె.కేశవరావు, 2008లో మళ్లీ డి.శ్రీనివాస్ 2011లో బొత్స సత్యనారాయణ కు పీసీసీ పగ్గాలు అప్పగించారు. వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావటం విశేషం. బొత్స తూర్పుకాపు సామాజికవర్గ నేతకాగా, మిగిలిన ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. తాజాగా ఐదోసారి కూడా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ అధ్యక్షుడిగా నియమించటం గమనార్హం.
తెరపైకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...
విశ్వసనీయ సమాచారం మేరకు.. తొలుత జానారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ మూడు రోజుల కిందటే నిర్ణయించింది. అయితే.. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా నియమిస్తానంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు దూరమవుతుండటాన్ని గమనించిన రాహుల్‌గాంధీ ఆయా వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జానారెడ్డిని పక్కనపెట్టి పొన్నాలను నియమించినట్లు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టారనే సంకేతాలు వెళితే తెలంగాణలో రాజకీయంగా పట్టున్న ఆ సామాజికవర్గమంతా కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం పెద్దలు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి.. పార్టీకి విధేయుడైన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆ పదవిలో నియమించినట్లు తెలిసింది. కాగా తెలంగాణలో జరిగే ఎన్నికలకు పార్టీ పరంగా అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని పొన్నాల హైకమాండ్ పెద్దలకు ప్రతిపాదించినట్లు చెప్తున్నారు.