
గాంధీభవన్ టు రాజ్‌భవన్
వాస్తు పేరుతో చారిత్రక కట్టడాలున్న సచివాలయాన్ని మార్చాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు.
హైదరాబాద్: వాస్తు పేరుతో చారిత్రక కట్టడాలున్న సచివాలయాన్ని మార్చాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల ప్రజలకు అం దుబాటులోఉన్న సచివాలయాన్ని మార్చాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌దాకా పాదయాత్రను ఈనెల 7న నిర్వహించనున్నట్టుగా పొన్నాల ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఇప్పటికే నిరసనలను వ్యక్తం చేశామన్నారు.
అయినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఈ నిర్ణయంపై ప్రజల్లో పోరాడుతామన్నారు. గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌దాకా పార్టీ ముఖ్యనేతలంతా పాదయాత్రగా వెళ్లి గవర్నరుకు వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్టుగా పొన్నాల ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈనెల 6న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో గ్రూపులవారీగా చర్చలను నిర్వహించాలని పొన్నాల నిర్ణయించారు. హైదరాబాద్ వంటి చారిత్రక నగరాన్ని సీఎం కేసీఆరే స్వయంగా చెత్త నగరమంటూ మాట్లాడితే పెట్టుబడులు పెట్టేవారు ఎలా వస్తారని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామంటూ మాట్లాడినవారే గతంలో అడ్రస్ లేకుండా పోయారని, అది కేసీఆర్ తరం కాదని పొన్నాల అన్నారు.