తెలంగాణలో 35 లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్పించే లక్ష్యాన్ని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది.
టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 35 లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్పించే లక్ష్యాన్ని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశం శనివారం జరిగింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరిగే పార్టీ ముఖ్యుల మేధోమధన సమావేశాలు, పార్టీ సభ్యత్వంపై సమీక్ష, ఢిల్లీ ఎన్నికల్లో టీపీసీసీ పాత్ర, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ, పి.నర్సింహ్మా రెడ్డి, నాగయ్య, ప్రధానకార్యదర్శులు జెట్టి కుసుమకుమార్, సి.శ్రీనివాస్, కుమార్‌రావు, వేణుగోపాల్‌రావు, హరి రమాదేవి, లక్ష్మణ్‌కుమార్, గోలేటి దామోదర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 20న నాలుగు బృందాలు, 22న నాలుగు బృందాలతో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, కొప్పుల రాజు, రామచంద్ర కుంతియా తదితర ముఖ్యనేతలు సమావేశం కానున్నారు.
ఒక్కొక్క బృందంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేతలు సుమారు 15 మంది ఉంటారు. ప్రతీ బృందంతో ఏఐసీసీ నేతలు రెండు గంటలపాటు సమావేశమవుతారు. పార్టీ సైద్ధాంతికత, సంస్థాగత నిర్మాణం, క్రమశిక్షణా రాహిత్యం-సవరణ, ఎన్నికల్లో టికెట్ల పంపిణీ, పార్టీ క్షేత్రస్థాయి పాత్ర, భవిష్యత్తులో పార్టీ ఎదగడానికి అనుసరించాల్సిన వ్యూహం, సామాజిక మీడియాను ఉపయోగించుకునే విధానం, క్షేత్రస్థాయి సమస్యలు, రాజకీయ ప్రణాళిక, రాజకీయ విధానం వంటి ముఖ్యమైన అంశాలపై అభిప్రాయాలను వీరు తీసుకోనున్నారు. దీని కోసం 8 బృందాలను ఖరారు చేశారు. వాటికి సమన్వయ బాధ్యతలను కూడా ఆఫీసు బేరర్లకు అప్పగించారు.
35 లక్షల లక్ష్యం దాటుతాం: షబ్బీర్
తెలంగాణలో 35 లక్షల సభ్యత్వ లక్ష్యాన్ని పెట్టుకున్నామని, క్షేత్రస్థాయి స్పందన అంతకంటే ఎక్కువగానే ఉందని షబ్బీర్ అలీ తెలిపారు. సమావేశం వివరాలను మీడియాకు వివరిస్తూ 11 ముఖ్య అంశాలపై రాష్ట్రస్థాయి పార్టీ ముఖ్యులతో రెండురోజుల పాటు సమావేశం జరుగుతుందన్నారు.
తెలంగాణ మేధావులు, ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమకారులతోనూ ఏఐసీసీ నేతలు ప్రత్యేకంగా భేటీ అవుతారని వెల్లడించారు. ఢిల్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణవాసుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి కొందరు పార్టీ ముఖ్యులను పంపిస్తున్నట్టుగా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.