![Cell Phone thief caught at Gandhi Bhavan in Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/Gandhi-Bhavan-Cell-Phone-Th.jpg.webp?itok=xxUKWpYh)
కార్యకర్తలు సంబురాల్లో ఉండగా 8 సెల్‌ఫోన్ల చోరీ
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో టక్కరిదొంగ దొరికాడు. బీసీల కులగణన లెక్కలు తేలాయని, ఎస్సీల వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదం లభించిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో ఉంటే ఓ దొంగ తన చేతివాటానికి పనిచెప్పాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 సెల్‌ఫోన్లను కార్యకర్తల జేబుల్లోంచి ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడు. అయినా అతని చౌర్యదాహం తీరలేదేమో ఇంకా ఫోన్లు దొరుకుతాయని ప్రయత్నాలు చేస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ (Photographer) కంటపడటంతో ఆ దొంగ పట్టుబడ్డాడు.
మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) తన గన్‌మెన్‌ను సన్మానించడంతో వెలుగులోకి వచ్చింది. బాణసంచాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ కార్యకర్తలు బిజీగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్లను కొట్టేస్తున్న ఆ దొంగను ఫొటోగ్రాఫర్ హరీశ్ చొరవతో పట్టుకున్నందుకు తన గన్‌మెన్ దేవరాజ్‌ను శాలువాతో సన్మానించారు. దొంగను హ్యాండిల్ చేసిన విధానాన్ని మహేశ్‌గౌడ్ అభినందించారు.
సచివాలయం వద్ద మాజీ సర్పంచ్‌ల అరెస్ట్
తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయం ఎదుట ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, నేతలు గుంటి మధుసూదన్‌రెడ్డి, రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య, నెమలి సుభాష్ గౌడ్, మెడబోయిన గణేష్, బొల్లం శారదలను అరెస్టు చేసి కాంచన్‌బాగ్, షాయినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లా డుతూ 13 నెలలుగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నా కనికరం లేదన్నారు.
చిరకాల ఆకాంక్ష నెరవేరింది
మాదిగల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని, ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్దత కల్పించిన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగ సంఘాల ఫ్రంట్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ సంఘాల ఫ్రంట్ ప్రతినిధులు, తెలంగాణమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు జన్ను కనకరాజు మాదిగ తదితరులు మాట్లాడారు.
చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 17.43 శాతం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు 17శాతం పెంచుతూ మాదిగ జనాభాకు తగినట్లుగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా మాదిగలు నష్టపోయిన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సమావేశంలో లాయర్ మల్లన్న, బొక్కల వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment