సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్సీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇంకో ఒకరిద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారిగా ఆశావహుల జాబితాను ఇంఛార్జి మున్షీ.. సిద్ధం చేసింది.
ప్రసుత్తం తెలంగాణ కేబినెట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరుగురికి కేబినెట్‌లో చోటు లభించాల్సి ఉంది. కేబినెట్ విస్తరణపై గత కొంత కాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమైన హోం, విద్యా శాఖలు సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు.
కాగా, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment