పిచ్చోడు.. బుడ్డర్ఖాన్.. అలీబాబా చాలీస్ చోర్!
సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని చాలా రోజుల తర్వాత మళ్లీ నాయకుల తిట్ల పురాణం వినే భాగ్యం తెలుగు ప్రజలకు కలిగింది. సాధారణంగా నోటి దురుసు ప్రదర్శించే విషయంలో కాస్త వెనకబాటులో ఉండే నాయకులు కూడా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా స్వరం పెంచేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కేంద్రంగానే ఈ తిట్లన్నీ సాగుతున్నాయి. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కేసీఆర్ను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. కిలాడీ, అలీబాబా చాలీస్ చోర్, కాపలా కుక్క, బుడ్డర్ఖాన్, పిచ్చోడు.. ఇలా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు కేసీఆర్ను తిట్టిపోస్తున్నారు.
కే అంటే కిలాడీ అని.. కేసీఆర్ అంటే మాట తప్పే పెద్ద కిలాడీ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక కాపలా కుక్క(వాచ్‌డాగ్) లా పని చేస్తానని చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మొరగడమేంటని విమర్శించారు. కేసీఆర్ బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నారని మరో సందర్భంలో పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిత్యం ఫాం హౌస్‌లో పడుకునే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిందెప్పుడని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్‌చోర్.. టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌వి మాయ మాటలు.. నమ్మి మోసపోవద్దని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. కేసీఆర్ బిడ్డకోసీటు, కొడుక్కో సీటు, అల్లుని కో సీటు ఇచ్చి.. తానూ రెండుసీట్లు తీసుకున్నాడు.. ఇది కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు.
ఇక విమర్శల విషయంలో ఎప్పుడూ పెద్దగా ధైర్యం చేయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ విషయంలోకి వచ్చేసరికి రెచ్చిపోయి మాట్లాడారు. తనను జైలుకు పంపుతానని కేసీఆర్ అంటున్నాడని, 'మరోసారి పిచ్చిమాటలు మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా జాగ్రత్త’ అని ఆయన అన్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కళ్లూ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని తమ తిట్లపురాణాలకు మరింత పదును పెడుతున్నారు.