పొన్నాల టికెట్లు అమ్ముకున్నారు.. తప్పించండి
కాంగ్రెస్ పార్టీ నేతల లోపం వల్లే తెలంగాణ ప్రాంతంలో పార్టీ ఓటమి చవిచూసిందని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టికెట్లు అమ్ముకున్నారని, ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. కేవలం తమ నేతల వైఫల్యం వల్లే టీడీపీకి తెలంగాణలో ఓట్లు పడ్డాయన్నారు. పార్టీ ఓటమికి అసలైన కారణం దిగ్విజయ్ సింగ్, పొన్నాల లక్ష్మయ్యలేనని, వాళ్లిద్దరినీ తక్షణం పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రవిభజన తర్వాత టీపీసీసీని ఏర్పాటు చేయడంలో దిగ్విజయ్ ఆలస్యం చేశారని, ఆయన పూర్తిగా కేవీపీ డైరెక్షన్‌లో నడిచారని ఆరోపించారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో కేసీఆర్ పాత్ర ఉండాలన్న తన సలహాను దిగ్విజయ్ పట్టించుకోలేదని చెప్పారు. ఇక తెలంగాణ ప్రాంతంలో టిక్కెట్ల కేటాయింపు, పార్టీ నేతలను కలుపుకోవడంలో పొన్నాల ఘోరంగా విఫలమయ్యారని, ఆయన టిక్కెట్లు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఓటమికి కారణమైన పొన్నాల తక్షణమే పార్టీకి క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. దిగ్విజయ్, జైరాం రమేష్ లాంటి కొందరు పెద్దలు సోనియగా గాంధీ చుట్టూ చేరి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి తనకు కావాలంటే తనకు కావాలంటూ బయల్దేరిన జానారెడ్డి లాంటి ఆశావహులు కూడా ఈ ఓటమికి కారణమేనని పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు.