పొన్నాలను అధిష్ఠానమే తప్పిస్తుంది: పాల్వాయి
పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికీ పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తనదేనని చెప్పిన పొన్నాల.. ఇంకా ఎందుకు ఆ పదవిలో ఉన్నారని ఆయన అడిగారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పొన్నాలను అధిష్ఠానమే ఆ పదవి నుంచి తప్పిస్తుందని చెప్పారు.
వాస్తవానికి దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదని పాల్వాయి విమర్శించారు. అధిష్ఠానానికి తెలియకుండానే జిల్లా నాయకులను పొన్నాల సస్పెండ్ చేస్తుంటే దిగ్విజయ్ స్పందించట్లేదని మండిపడ్డారు. పీసీసీ బాధ్యతలను అధిష్ఠానం యువతరానికి అప్పగించాలని, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు.