కిరణ్‌లాంటి వారుంటారనే ఆర్టికల్ 3: పొన్నాల
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకోడానికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలాంటి వారు ఉంటారని ముందుగా ఊహించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపర్చారని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం ఆయన పార్లమెంటు వెలుపల ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ, రాజ్యాంగ ప్రక్రియలు ఉంటాయని, రాజకీయ ప్రక్రియలో ఆందోళనలు, దీక్షలు, అనుకూల, వ్యతిరేక అగ్రనేతలను మెప్పించడాలూ ఉంటాయన్నారు. అందులో భాగంగానే సీఎం కిరణ్ దీక్ష చేసినట్లుగా అభివర్ణించారు.
రాజ్యాంగ ప్రక్రియలో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పార్టీలను సంప్రదించాకే ఆ బిల్లును రూపొందించారని చెప్పారు. బిల్లుపై అసెంబ్లీ, శాసన మండలి అభిప్రాయాలను కేంద్రానికి పంపడం, మళ్లీ జీవోఎం సమీక్షించి పార్లమెంటులో పెట్టడం సాధారణ ప్రక్రియేనని తెలిపారు. అలాగే హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా అడగడం సహేతుకం కాదన్నారు.