'కిరణ్ ఏఐసీసీ నాయకుడిగా వస్తారు'
హైదరాబాద్: సీఎం కిరణ్ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు. విభజన బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించాలనే కిరణ్ ఎజెండా పూర్తయిందని తెలిపారు. విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజే పదవికి రాజీనామా చేసుంటే రాజ్యాంగ సంక్షోభం వచ్చేదని, విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేదని అన్నారు. ఓ ఢిల్లీ నేత డైరెక్షన్ మేరకు ప్రభుత్వాన్ని కిరణ్ కాపాడుకున్నారని వెల్లడించారు. అసెంబ్లీలో బిల్లు గట్టెక్కించేందుకే కిరణ్ ఇప్పటి వరకు పదవిలో ఉన్నారన్నారు.
సమైక్యాంధ్ర డిమాండ్ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఇతర సమైక్యవాదులు సీఎం ట్రాప్‌లో పడ్డారని అన్నారు. 2012లో హైకమాండ్ తెలంగాణకు ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయిస్తే పదవిని కాపాడుకోవడానికి కిరణ్ అడ్డుపడ్డారని వెల్లడించారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే సీఎం పదవి కూడా ఆ ప్రాంతానికే ఇవ్వాల్సి వస్తుందని హైకమాండ్ స్పష్టం చేసింది. అప్పుడే 25 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పంపి ప్యాకేజీ వద్దు.. తెలంగాణ రాష్ట్రమే కావాలని హైకమాండ్‌కు చెప్పించారని వివరించారు. ఎన్నికల ముందు తెలంగాణ ఇవ్వాలని హైకమాండ్‌కు సూచించారని పేర్కొన్నారు.
రెండు ప్రణాళికలతో కిరణ్ ముందుకెళుతున్నారని చెప్పారు. కొత్తపార్టీ పెట్టి ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయడం, రెండోది కొత్త పార్టీ పెట్టకుండా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కావాలన్న ఆలోచనతో ఉన్నారని వెల్లడించారు. సీఎం ఎత్తుగడలు నాలాంటి ఒకరిద్దరు కాంగ్రెస్ పసిగట్టినప్పటికీ, ప్రజలు ఆ వాస్తవాలను అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజల్లో ఉన్న సమైక్య భావోద్వేగాన్ని కిరణ్ తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకున్నారని మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. కొంత లగేజీ సర్దుకోవాల్సిన అవసరమున్నందున కిరణ్ రాజీనామా కొంత సమయం పట్టవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.