సాక్షి, అమరావతి: చంద్రబాబు అవినీతి బండారం బయటపడిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముడుపులపై ఐటీ పూర్తి ఆధారాలతో నోటీసులు ఇచ్చిందని, ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
‘‘నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చింది. ఐటీకి లేఖలు రాసారే తప్ప ఆరోపణలను చంద్రబాబు ఖండించలేదు. ముడుపులు తీసుకోలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు?. మనోజ్ వాసుదేవ్ పార్థసాని చెప్పిన విషయాలపై ఎందుకు మాట్లాడరు?. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా చంద్రబాబే చెబుతారా?’’ అంటూ ఎమ్మెల్సీ డొక్కా దుయ్యబట్టారు.
‘‘ఐటీ శాఖ తన విధులు తాను నిర్వర్తిస్తుంది. ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఐటి శాఖ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించడం లేదు. తాను హరిశ్చంద్రుడినంటూ మాటలు చెప్పే బాబు ఇప్పుడు ఏం చెబుతారు?’’ అంటూ ఆయన ధ్వజమెత్తారు.
చదవండి: ఒక ఐటీ నోటీస్.. 10 ప్రశ్నలు.. ఇవి నిజం కాదా చంద్రాలు..?
డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ ఏమన్నారంటే..
నైతిక బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు
ఐటీ శాఖ (ఆదాయ పన్ను శాఖ) చంద్రబాబుకు జారీ చేసిన నోటీసులపై ఎందుకు నోరు విప్పరని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ఆదాయ పన్ను శాఖ చట్ట ప్రకారమే పనిచేస్తున్నారు. ఏ వ్యక్తి, సంస్థల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో తేడాలుంటే ఐటీ శాఖ నోటీసులు ఇస్తారు. అలా ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. 2014-19లో రూ.118 కోట్లు మనీ ల్యాండరింగ్ ద్వారా చంద్రబాబుకు అందించామని మనోజ్ పార్థసాని చెప్పారని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. సెంట్రల్ ఐటీ శాఖకు విచారణ పరిధి లేదని.. ఫలానా ఆఫీసు చేయాలని టెక్నికల్ ఇష్యూను చంద్రబాబు లేవనెత్తారు కానీ.. సమాధానం ఇవ్వలేదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉంది. కేవలం ఐటీ శాఖకు లేఖలు రాసారే తప్ప ఆరోపణలను చంద్రబాబు ఖండించలేదు.ముడుపులు తీసుకోలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు.
చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాలి
చంద్రబాబును ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం ఆలస్యం అయితే వెంటనే చంద్రబాబును పిలిపించి కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. ఎలా ఈ వేల కోట్ల రూపాయలు మాయం అయ్యాయో విచారించాల్సిన బాధ్యత ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఉంది. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుకు చంద్రబాబు ధైర్యంగా వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా. కేంద్రంలో అనేకసార్లు ప్రభుత్వాన్ని నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు. కనీసం ఒక రింగ్ కూడా లేదని హరిశ్చంద్రుడిని అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారు? ఐటీ నోటీసులపై ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు సమాధానం చెబితే.. మంచిది కదా. ప్రజాజీవితంలో ఉన్న మిగిలిన వారికి ఒక ట్రెండ్ సెట్ చేసిన వారు అవుతారు. పైగా నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా చంద్రబాబే చెబుతారా?
విక్కీ జైన్, మనోజ్ పార్థసాని చంద్రబాబుకు తెలీదా?
విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. ఒకవేళ విక్కీ జైన్ ఎవరో చంద్రబాబుకు తెలియదని చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. చంద్రబాబు పేరును ఐటీ శాఖకు వాళ్లు చెప్పారు. ఐటీ శాఖ పూర్తిగా దర్యాప్తు చేస్తే మరింత డబ్బు వివరాలు బయటపడతాయి.
అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే...
చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకున్నారు. నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ పరిధి గురించి చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఐటీ నోటీసులు జూబ్లిహిల్స్ శాఖ మాత్రమే ఇవ్వాలని, సెంట్రల్ ఆఫీస్ ఎలా ఇస్తుంది అనటం కాదు. ఇది చంద్రబాబు చేయాల్సిన పనికాదు. అవన్నీ చంద్రబాబు కోర్టుల్లో తేల్చుకోవాలి. ప్రజాజీవితంలో ఉన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ప్రజలకు ఐటీ నోటీసులపై వివరణ ఇవ్వాలి. విక్కీ జైన్, మనోజ్ పార్థసాని తెలియదని.. ఆ డబ్బు రాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.
ఎల్లో పత్రికల్లో ఎందుకు రాయరు?
చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియాలో ఒక్క పత్రిక రాయదు. ఒక్కరు డిబేట్ చేయరు. చంద్రబాబే నాలుగుసార్లు ఐటీ శాఖకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం మీద చంద్రబాబు ఉలుకుపలుకు లేదు. ఇది అవినీతి సొమ్ము కాదా? దీనిపై ఏచట్టం క్రింద చర్యలు తీసుకోరా? ఐటీ శాఖ తక్షణం ఆ ప్రజాధనాన్ని ట్రెజరీకి అందించటానికి విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి. దీంతో పాటు ఏమేమి జరిగాయో విచారించాలి.
ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి, బాబు అవినీతి విషయంపై పత్రికలు ఎందుకు దాస్తున్నాయి. పత్రికల్లో రాస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? ప్రజలకు వాస్తవాలు తెలిస్తే తప్పా? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీకు నచ్చినవే.. రాయటానికి పత్రికల్లో రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలు ప్రజలకు అందివ్వరా? పత్రికలకు కూడా ఇది మంచిపద్ధతి కాదు.
రోజుకో అంశం రాస్తున్నారు కదా. ఇది కూడా రాస్తే ప్రజాధనం ఏమైందో... ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏదైనా పథకంలో ఏమైన లోటుపాట్లు ఉన్నాయని కాగ్ లేక కేంద్రమో చెబితే.. గగ్గోలు పెట్టే మీడియా, చర్చలు పెట్టే మేధావులు చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు. కాగ్ ఒక అభ్యంతరం తెలిపితే దోపిడీ అని బ్యానర్ ఐటమ్స్‌తో రాస్తారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన డబ్బు పక్కదారి పడితే ఎందుకు డిబేట్లు పెట్టరు. భారీగా మీడియాలో ఎందుకు రాయరు. చంద్రబాబు, మీడియా తేలుకుట్టిన దొంగల్లా కూర్చున్నారు.
2022లోనే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటం జరిగింది. నాలుగు సార్లు ఐటీ శాఖకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి. సీక్రెట్ డాక్యుమెంట్స్ సంపాదించి మీడియా వార్తలు రాస్తారు. చంద్రబాబు నోటీసులపై ఎందుకు రాయరు. ఐటీ శాఖ తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని లోతుగా విచారించి ప్రజాధనం ఏమైందో కనుక్కోవాలని డొక్కా డిమాండ్ చేశారు.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
2023 ఆగస్టు 4న చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చింది . గత రెండేళ్లుగా ఇది జరుగుతోంది. సాక్ష్యాధారాలు లేకుండా ఐటీ శాఖ నోటీసు ఇస్తుందా? ఎలా సాధ్యం అవుతుంది.
తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి.
ఐటీ శాఖ ఆధారాలతో సహా నోటీసు ఇచ్చింది. తర్వాత సీబీఐ క్రిమినల్ చార్జిషీటు దాఖలు చేయటం ఆటోమ్యాటిక్‌గా జరుగుతుంది.
మేం కూడా సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలి కూడా.
ప్రజాధనం దుర్వినియోగం అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్ర సంస్థలు, సీబీఐ, ఐటీ దర్యాప్తు చేయాలి. విక్కీ జైన్, మనోజ్ పార్థసానినితో పాటు దీనివెనుక ఉన్న పెద్దలూ వస్తారు. తద్వారా ప్రజాధనం ఎంత వెనకుందో తెలుస్తుంది.
ఎన్టీఆర్ నాణెం విడుదల రోజున చంద్రబాబు పడిన అవస్థలు చూడలేకపోయాం. నడ్డాను బ్రతిమిలాడటానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు
Comments
Please login to add a commentAdd a comment