గుర్రం జాషువ
జాషువ అచ్చమైన జాతీయకవి. విశ్వనరుడి భావన ఆయన సాహిత్య తాత్వికత. తెలుగు నుడి కారం, ఇంపుసొంపులను పద్య లాలిత్యంతో పాఠకునికి అందించిన ‘నవయుగ కవి చక్రవర్తి’. భారతీయ తత్వాన్ని ఆకళించు కున్న కళాప్రపూర్ణుడు. నిరంతరం జాతి పురోగమనాన్ని కాంక్షిస్తూ సంఘంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న ధృడ సంకల్పంతో శక్తిమంతమైన కావ్యాలను రాసిన పద్మ భూషణుడన్న సాహిత్య విమర్శకుని మాటలు మహాకవికి అక్షరాలా అబ్బుతాయి. జాషువ కవిత్వం జాతీయ భావాలతో నిండి, మానవ జాతి శ్రేయస్సునూ, విశ్వకల్యాణాన్నీ కాంక్షిస్తూ చైతన్యశీలంగా ఉంటుంది.
‘భరత ఖండంబు నా పాఠశాల / భాగవతంబు నా బాలశిక్ష’ అని పేర్కొన్న జాషువాకి ఈ దేశ భిన్నసంస్కృతి, సంప్రదాయాల పట్ల అపారగౌరవం వుంది. కాబట్టే ఆయన ‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి, పంజరాన గట్టువడను నేను / నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వన రుడ నే’నని ప్రకటించాడు. దేశం సంస్కృతీ, భిన్న సంప్ర దాయాలను గౌరవిస్తూ అందరూ ఐకమత్యంతో, సహనంతో సహజీవనం చెయ్యాలని కాంక్షించాడు. మనుష్యులంతా సమానమేనని మరణంలేని మానవతను ప్రకటించాడు.
‘సింధు గంగానదీ జలక్షీరమెపుడు / కురిసి బిడ్డల పోషించుకొనుచున్న / పచ్చి బాలెంతరాలు మా భారత మాత / మాతలకు మాత సకల సంపత్సమేత’ అని దేశాన్ని కీర్తించారు. భారతీయ చారిత్రక పురాణ పురుషులనూ, అందు నాయకులనూ వారి ఔన్నత్యాన్నీ బట్టి గొప్ప వ్యక్తు లుగా చిత్రించారు. సగరుడు, మాంధాత్రి వంటి చక్ర వర్తులు మొదలు అశోకుడు, గౌతమ బుద్ధుడు, కర్ణుడు, శివాజీ, మహాత్మాగాంధి, అంబేడ్కర్ వంటి నేటికాల మేధా వుల వరకూ జాషువ రచనల్లో అత్యుత్తమంగా కన్పిస్తారు.
మొదటి ఖండికే భారతమాత ప్రశస్తికి అంకితమై దేశానికి నీరాజనం పట్టింది. తరతరాల భారతీయ స్త్రీ, పురుషుల పరాక్రమోన్నతినీ నదుల ప్రాభవాన్నీ, గానం చేసి ‘గొన బుసిరిగల భాగ్యశాలివి నీవు, భారతాంబా మణి నమస్కారమమ్మ’ అని రెండు చేతుల నమస్కరించిన తీరు ఆయన దేశభక్తికీ, జాతీయతకీ నిదర్శనం.
స్వాతంత్య్రం సిద్ధించిన పిమ్మట ఆనందాతిశయంతో ‘తల్లి భారతి నేడు దక్కె మాకు / పదియు రెండగు పుణ్య నదులు నదంబులు / చిరకాలమునకు జేజిక్కె మాకు / అమర సన్నుతమైన హస్తినాపుర రత్న పీఠంబు...’ అని హర్షాతిరేకము ప్రకటించారు.
చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో వివేకానందుని అద్భుత ప్రతిభాపాటవాలనూ, అహింసాయుధంతో మహాత్మాగాంధీ సాంధించిన స్వాతంత్య్రాన్నీ, తెలుగు వాడైన తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌నూ, విశ్వకవి రవీంద్రునీ కొనియాడారు. అన్ని సంపదలు పుష్కలంగా ఉన్న దేశంలో ప్రజల మధ్య అనైక్యత, ప్రాంతాల వారిగా, మతాలవారిగా విడిపోయి, పరమత సహనం, పరజాతి సహనం లోపించి మానవజాతి సహజ గుణాల్ని కోల్పోయి అసహనంగా తయారయిందని చింతించారు.
కులం కారణంగా తనను హీనపరిచారని దేశ ప్రము ఖులను స్తుతిస్తూనే తన నిందను సున్నితంగా చెప్పారు. జాతి సమైక్యత, సహన సహిత జీవనమే మహాకవి కవిత్వ తత్త్వంగా సాగింది.
బాపూజీ అంటే జాషువ కవికి అనిర్వచనీయమైన భక్తిభావం. మహాత్ముని నిత్యసత్యవ్రతుడిగా పేర్కొన్నారు. ‘వడికిన నూలుపోగుతో ప్రపంచపు టేనుగు గట్టి అహింసా మార్గాన విరోధి గుండెలో పిడుగులు గుప్పువాడనీ, తన బోసినోట అమృత బిందువులను జిమ్మెడు వక్త’ అనీ మహా త్ముని వ్యక్తిత్వాన్ని గొప్పగా స్తుతించారు జాషువ. ‘మహా త్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్’ అనీ వెల్లడించారు.
‘గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలపినట్టి ఖదరునేతగా, పండ్లు నూరుచున్న బహుమతంబులలోన సహన విద్య నేర్పు సాధకుండనీ, భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవం’ అనీ ‘విశ్వసామరస్య విజ్ఞాన సంధాత’ అనీ బాపూ జీని ప్రస్తుతించారు. నిమ్న జాతుల కంటినీరంబు దుడిచి యాశ్వాసించు నిరుపేద బాంధవుడు అని కొనియాడారు. భారత స్వాతంత్య్ర దీప్తి సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ముగ్ధుడై ‘బోసు చరిత్ర మద్భుతమైనది, ఆయన మహాత్యాగి, మహనీ యునకు కావ్య నమస్కారము చేయక నా చేతులూరు కొనక పోయినవి’ అని ‘నేతాజీ’ కావ్యాన్ని రచించారు.
భారతవీరుడు శీర్షికన కర్ణుని గుణగణాలను శౌర్య ప్రతాపాలను వర్ణించారు. కర్ణుని పరాక్రమం, సత్యసంధత కవిని ముగ్ధుని చేశాయి. మనుషుల్లో పెరుగుతున్న అమానవీయ మౌఢ్యాలను ఖండిస్తూ ‘మనుజులార మాది ఘనమైన మతమని / ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది’ అని మహాకవి జాషువ అన్ని మతాల వారినీ ప్రశ్నించారు. మతం కంటే మానవత్వమే గొప్ప దనీ, మానవత్వానికి మకుటధారణ చేయమన్నారు. కుల జాఢ్యాన్ని వదిలి మానవతకు పట్టం కట్టాలని కోరారు.
భారత ఇతిహాస యుగం నుండి మొగలాయి యుగం వరకూ, స్వాతంత్య్రోద్యమం నుండి స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొన్న భిన్న సంఘర్షణల వరకూ జాషువ తన కవిత్వంలో బంధించారు. విశ్వమానవ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జాషువ విశ్వకల్యాణానికై తన కవిత్వాన్ని ఆయుధంగా మలిచారు. జాషువ కవిత్వం నేటికినీ ప్రాసంగికతను కలిగి ఉందనటంలో అతిశయోక్తి లేదు. అనేక కష్టాలనూ, అవమానాలనూ ఎదుర్కొన్నప్పటికీ జాషువ మహాకవి మాత్రం భారతజాతి అభివృద్ధికి కులమతాలు లేని సమసమాజాన్ని కాంక్షించారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్
వ్యాసకర్త మాజీమంత్రి
(నేటి నుండి 28 వరకూ గుంటూరులో ‘జాషువ జయంతి వారోత్సవాలు’)
Comments
Please login to add a commentAdd a comment