jashuva jayanti
-
నవయుగ కవిచక్రవర్తికి జేజేలు!
జాషువ అచ్చమైన జాతీయకవి. విశ్వనరుడి భావన ఆయన సాహిత్య తాత్వికత. తెలుగు నుడి కారం, ఇంపుసొంపులను పద్య లాలిత్యంతో పాఠకునికి అందించిన ‘నవయుగ కవి చక్రవర్తి’. భారతీయ తత్వాన్ని ఆకళించు కున్న కళాప్రపూర్ణుడు. నిరంతరం జాతి పురోగమనాన్ని కాంక్షిస్తూ సంఘంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న ధృడ సంకల్పంతో శక్తిమంతమైన కావ్యాలను రాసిన పద్మ భూషణుడన్న సాహిత్య విమర్శకుని మాటలు మహాకవికి అక్షరాలా అబ్బుతాయి. జాషువ కవిత్వం జాతీయ భావాలతో నిండి, మానవ జాతి శ్రేయస్సునూ, విశ్వకల్యాణాన్నీ కాంక్షిస్తూ చైతన్యశీలంగా ఉంటుంది. ‘భరత ఖండంబు నా పాఠశాల / భాగవతంబు నా బాలశిక్ష’ అని పేర్కొన్న జాషువాకి ఈ దేశ భిన్నసంస్కృతి, సంప్రదాయాల పట్ల అపారగౌరవం వుంది. కాబట్టే ఆయన ‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి, పంజరాన గట్టువడను నేను / నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వన రుడ నే’నని ప్రకటించాడు. దేశం సంస్కృతీ, భిన్న సంప్ర దాయాలను గౌరవిస్తూ అందరూ ఐకమత్యంతో, సహనంతో సహజీవనం చెయ్యాలని కాంక్షించాడు. మనుష్యులంతా సమానమేనని మరణంలేని మానవతను ప్రకటించాడు. ‘సింధు గంగానదీ జలక్షీరమెపుడు / కురిసి బిడ్డల పోషించుకొనుచున్న / పచ్చి బాలెంతరాలు మా భారత మాత / మాతలకు మాత సకల సంపత్సమేత’ అని దేశాన్ని కీర్తించారు. భారతీయ చారిత్రక పురాణ పురుషులనూ, అందు నాయకులనూ వారి ఔన్నత్యాన్నీ బట్టి గొప్ప వ్యక్తు లుగా చిత్రించారు. సగరుడు, మాంధాత్రి వంటి చక్ర వర్తులు మొదలు అశోకుడు, గౌతమ బుద్ధుడు, కర్ణుడు, శివాజీ, మహాత్మాగాంధి, అంబేడ్కర్ వంటి నేటికాల మేధా వుల వరకూ జాషువ రచనల్లో అత్యుత్తమంగా కన్పిస్తారు. మొదటి ఖండికే భారతమాత ప్రశస్తికి అంకితమై దేశానికి నీరాజనం పట్టింది. తరతరాల భారతీయ స్త్రీ, పురుషుల పరాక్రమోన్నతినీ నదుల ప్రాభవాన్నీ, గానం చేసి ‘గొన బుసిరిగల భాగ్యశాలివి నీవు, భారతాంబా మణి నమస్కారమమ్మ’ అని రెండు చేతుల నమస్కరించిన తీరు ఆయన దేశభక్తికీ, జాతీయతకీ నిదర్శనం. స్వాతంత్య్రం సిద్ధించిన పిమ్మట ఆనందాతిశయంతో ‘తల్లి భారతి నేడు దక్కె మాకు / పదియు రెండగు పుణ్య నదులు నదంబులు / చిరకాలమునకు జేజిక్కె మాకు / అమర సన్నుతమైన హస్తినాపుర రత్న పీఠంబు...’ అని హర్షాతిరేకము ప్రకటించారు. చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో వివేకానందుని అద్భుత ప్రతిభాపాటవాలనూ, అహింసాయుధంతో మహాత్మాగాంధీ సాంధించిన స్వాతంత్య్రాన్నీ, తెలుగు వాడైన తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్నూ, విశ్వకవి రవీంద్రునీ కొనియాడారు. అన్ని సంపదలు పుష్కలంగా ఉన్న దేశంలో ప్రజల మధ్య అనైక్యత, ప్రాంతాల వారిగా, మతాలవారిగా విడిపోయి, పరమత సహనం, పరజాతి సహనం లోపించి మానవజాతి సహజ గుణాల్ని కోల్పోయి అసహనంగా తయారయిందని చింతించారు. కులం కారణంగా తనను హీనపరిచారని దేశ ప్రము ఖులను స్తుతిస్తూనే తన నిందను సున్నితంగా చెప్పారు. జాతి సమైక్యత, సహన సహిత జీవనమే మహాకవి కవిత్వ తత్త్వంగా సాగింది. బాపూజీ అంటే జాషువ కవికి అనిర్వచనీయమైన భక్తిభావం. మహాత్ముని నిత్యసత్యవ్రతుడిగా పేర్కొన్నారు. ‘వడికిన నూలుపోగుతో ప్రపంచపు టేనుగు గట్టి అహింసా మార్గాన విరోధి గుండెలో పిడుగులు గుప్పువాడనీ, తన బోసినోట అమృత బిందువులను జిమ్మెడు వక్త’ అనీ మహా త్ముని వ్యక్తిత్వాన్ని గొప్పగా స్తుతించారు జాషువ. ‘మహా త్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్’ అనీ వెల్లడించారు. ‘గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలపినట్టి ఖదరునేతగా, పండ్లు నూరుచున్న బహుమతంబులలోన సహన విద్య నేర్పు సాధకుండనీ, భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవం’ అనీ ‘విశ్వసామరస్య విజ్ఞాన సంధాత’ అనీ బాపూ జీని ప్రస్తుతించారు. నిమ్న జాతుల కంటినీరంబు దుడిచి యాశ్వాసించు నిరుపేద బాంధవుడు అని కొనియాడారు. భారత స్వాతంత్య్ర దీప్తి సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ముగ్ధుడై ‘బోసు చరిత్ర మద్భుతమైనది, ఆయన మహాత్యాగి, మహనీ యునకు కావ్య నమస్కారము చేయక నా చేతులూరు కొనక పోయినవి’ అని ‘నేతాజీ’ కావ్యాన్ని రచించారు. భారతవీరుడు శీర్షికన కర్ణుని గుణగణాలను శౌర్య ప్రతాపాలను వర్ణించారు. కర్ణుని పరాక్రమం, సత్యసంధత కవిని ముగ్ధుని చేశాయి. మనుషుల్లో పెరుగుతున్న అమానవీయ మౌఢ్యాలను ఖండిస్తూ ‘మనుజులార మాది ఘనమైన మతమని / ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది’ అని మహాకవి జాషువ అన్ని మతాల వారినీ ప్రశ్నించారు. మతం కంటే మానవత్వమే గొప్ప దనీ, మానవత్వానికి మకుటధారణ చేయమన్నారు. కుల జాఢ్యాన్ని వదిలి మానవతకు పట్టం కట్టాలని కోరారు. భారత ఇతిహాస యుగం నుండి మొగలాయి యుగం వరకూ, స్వాతంత్య్రోద్యమం నుండి స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొన్న భిన్న సంఘర్షణల వరకూ జాషువ తన కవిత్వంలో బంధించారు. విశ్వమానవ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జాషువ విశ్వకల్యాణానికై తన కవిత్వాన్ని ఆయుధంగా మలిచారు. జాషువ కవిత్వం నేటికినీ ప్రాసంగికతను కలిగి ఉందనటంలో అతిశయోక్తి లేదు. అనేక కష్టాలనూ, అవమానాలనూ ఎదుర్కొన్నప్పటికీ జాషువ మహాకవి మాత్రం భారతజాతి అభివృద్ధికి కులమతాలు లేని సమసమాజాన్ని కాంక్షించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త మాజీమంత్రి (నేటి నుండి 28 వరకూ గుంటూరులో ‘జాషువ జయంతి వారోత్సవాలు’) -
జీవితం వడగాడ్పు, కవిత్వం వెన్నెల
మనిషిని మనిషి కించపరిచి, అసహ్యించుకుని, ఊడిగింపు చేయించుకుని అధఃపాతాళానికి తొక్కే సమాజ పరిస్థితులున్నంతవరకూ దేశంలో ఎన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆ సమాజం అభివృద్ధి చెందనట్లే భావించాలి. ఈ పరిస్థితి మారాలంటే కొన్ని దశాబ్దాల క్రితం మహాకవి గుర్రం జాషువా అనుభవించిన వేదనను మనం అర్థం చేసుకోవాలి. ఆయన వేదన కొన్ని వేల ఏళ్ల దళిత ఆక్రందనల ప్రతిఫలన. అది పీడితుల బాధలతో, గాథలతో అప్పుడూ ఇప్పుడూ మమేకమవుతున్న హృదయ స్పందన. స్వాతంత్య్రోద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలు జరుగుతున్న కాలంలో అడుగడుగునా వివక్షకు గురవుతూనే ఆయన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉపాధ్యాయ శిక్షణను పొంది తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగం చేశారు. మహా మహా పండితులతో సమానంగా తెలుగు పద్యాలు రాయగల శక్తిని సంపాదించారు. వినుకొండలో జరిగిన ఒక సభలో జాషువా తన ఆశుకవితా నైపుణ్యంతో సభికులను మెప్పించారు. అయితే ఈ సభలో ఒక నిమ్నజాతికి చెందిన కవికి ఎలా ప్రవేశం కలిగిందని కొందరు ఆగ్రహించడంతో జాషువా నీరుకారి పోకుండా మరింత పట్టుదలతో అద్భుతమైన సాహిత్యాన్ని సృజించారు. ఒక సారి రైలులో ఒక రాజావారు తనతో ప్రయాణిస్తున్న జాషువా కవి అని తెలుసుకుని ఆయన కవితలు విని మెచ్చుకున్నారు. చివరిలో జాషువా కులం గురించి తెలుసుకుని చివాలున లేచిపోయారు. దీంతో ‘తన కవితా వధూటిని చూసి భళి భళి అన్నవారే కులం తెలుసుకుని చివాలున లేచిపోతే బాకుతో కుమ్మినట్లుంటుంద’ని పద్యం రాశారు. పండితుల సాహచర్యం సంపాదించి పద్యాలు రాయడం నేర్చుకున్నారు. మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలను చదివి భాషపై పట్టు సంపాదించారు.. సరళ గ్రాంథికాన్నీ, ప్రాచీన పద్య ఛందస్సును స్వీకరించి పద్యానికి కూడా జవజీవాలు కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లగలమని నిరూపించిన కవి జాషువా. జాషువా రచనల్లో గబ్బిలం పద్యకావ్యం ప్రతిఘటనా కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. గుడిలో గబ్బిలానికి ప్రవేశం ఉన్నది కాని దళితుడికి మాత్రం లేదని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన చదివిన ప్రతి ఒక్కరి హృదయాలను కరిగిస్తుంది. ‘ఎన్ని దేశాలు తిరిగిన నేమి నీవు నా వలె పుట్టు బానిసవు కావు..’ అని ఆయన అంటారు. ఫిరదౌసి అనే మరో పద్యకావ్యంలో ఒక కవికి అక్షరలక్షలు ఇస్తానని చెప్పిన చక్రవర్తి మాట తప్పడంతో ఆ కవి ఆత్మహత్య చేసుకున్న తీరును అద్భుతమైన శైలిలో అనన్యసామాన్యమైన కవితా ప్రతిభతో వర్ణిస్తారు. ‘రాజు మరణించెనొక తార రాలిపోయె, సుకవి మరణించెనొక తార గగనమెక్కె, రాజు జీవించు రాతివిగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్క లయందు‘. అని రాశారు. జాషువా రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని çశ్మశాన వాటికలోని పద్యాలు చదివిన వారి గుండెలు ఆర్ద్రతతో స్పందించక మానవు. పేద రైతు కుటుంబంలో జన్మించిన జాషువా రైతన్నల బాధలను తన కవిత్వంలో పండించినంతగా మరెవరూ పండించలేదనే చెప్పాలి. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు’ అన్నాడు. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ‘ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యమైంది’ అన్నారు. ‘తన జీవితంలో అన్నిటికన్నా ఇది అత్యున్నత పురస్కారం’ అని జాషువా అన్నారు. చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి శిషు్యడైన విశ్వనాథ సత్యనారాయణ కూడా శారదాదేవీ అనుగ్రహం వల్ల జాషువా కవిత్వంలో మాధుర్యం ధ్వని స్తుందని, ఆయన మధుర కవి అని ప్రశంసించారు. జాషువా రాసిన శిశువు అనే ఖండికను కమనీయంగా గానం చేసిన ఘంటసాల ఇంటిలోకి వెళ్లడానికి తాను తటపటాయిస్తుంటే ఆ గాయకుడు ఎంతో బాధపడ్డారట. ‘నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్ఛగా లోపలికి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్థం!’’ అని ఘంటసాల అన్నారట. ‘వడగాడ్పు–నా జీవితమైతే, వెన్నెల–నా కవిత్వం’ అని జాషువా అన్నారు. ఆయన జీవితమంతా వడగాడ్పులా సాగితే వెన్నెల లాంటి ఆయన కవిత్వం నేటికీ మన హృదయాలను రసప్లావితం చేస్తోంది. (సీఎం క్యాంప్ ఆఫీస్లో సభ సందర్భంగా) వ్యాసకర్త : ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు -
విశ్వనరుడు జాషువా
కడప కల్చరల్ : దళితుల్లో పుట్టిన జాషువ ఆ బాధలను తెలుసుకుని వాటికి గొంతుకై నిలిచారని సీపీ బ్రౌన్ గ్రంథాలయం బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి జాషువ జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జాషువాను కేవలం దళిత కవిగా ముద్ర వేయవద్దని, ఆయన విశ్వనరుడని తెలిపారు. సమాజానికి మంచి దారి చూపేవాడే కవి అని, మనిషిని, మనసును పట్టుకోవడమే నిజమైన కవిత్వమని అభివర్ణించారు. సమాజం దిగజారేందుకు తగిన కారణాలను కవిగా జాషువ ఎలుగెత్తి చాటారని తెలిపారు. ప్రముఖ రచయిత, నందలూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు చీపాడు రాజేశ్వరరావు మాట్లాడుతూ జాషువ రచన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించడం సాహితీ లోకానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైవీయూ ఆచార్యులు గంగయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, డాక్టర్ గురవయ్య, డాక్టర్ రమణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.