విశ్వనరుడు జాషువా
కడప కల్చరల్ :
దళితుల్లో పుట్టిన జాషువ ఆ బాధలను తెలుసుకుని వాటికి గొంతుకై నిలిచారని సీపీ బ్రౌన్ గ్రంథాలయం బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి జాషువ జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జాషువాను కేవలం దళిత కవిగా ముద్ర వేయవద్దని, ఆయన విశ్వనరుడని తెలిపారు. సమాజానికి మంచి దారి చూపేవాడే కవి అని, మనిషిని, మనసును పట్టుకోవడమే నిజమైన కవిత్వమని అభివర్ణించారు. సమాజం దిగజారేందుకు తగిన కారణాలను కవిగా జాషువ ఎలుగెత్తి చాటారని తెలిపారు. ప్రముఖ రచయిత, నందలూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు చీపాడు రాజేశ్వరరావు మాట్లాడుతూ జాషువ రచన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించడం సాహితీ లోకానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైవీయూ ఆచార్యులు గంగయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, డాక్టర్ గురవయ్య, డాక్టర్ రమణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.